మృత్యు.. వలసజీవి

ABN , First Publish Date - 2020-04-09T11:46:52+05:30 IST

ఊరూరా తిరుగుతూ బతుకుదెరువు కోసం సంచార జీవనం సాగిస్తున్న ఓ అభాగ్య కుటుంబంపై విధిపగబట్టింది. ఓ యువకుడు

మృత్యు.. వలసజీవి

వలస జీవులు...

పిడికెడు బువ్వ కోసం వెంపర్లాడతారు.!

దొరికింది తింటారు.. దొరక్కపోతే పస్తులుంటారు.!!

లాక్‌డౌన్‌ ఎటూ కాలు కదపనివ్వలేదు

రోడ్డు పక్కన చెట్లే నివాసాలయ్యాయి..!

కరోనా వైరస్‌ వారి సంచార జీవనాన్ని ఛిద్రంచేసింది..!

అభాగ్యుడిపై విద్యుత్‌ మృత్యుపంజా కసిగా విసిరింది!!

చేతిలో చిల్లగవ్వలేదు, యాచించి కననం చేసే పరిస్థితులూ లేవు...!

పొగిలిపొగిలి వస్తున్న ఏడుపును వారెంత బిగపట్టినా ఆగలేదు!

ఉబికిఉబికి వస్తున్న కన్నీటిని బలవంతంగాకళ్లలోనే బంధిద్దామనుకున్నా

అప్రయత్నంగా ధారలయ్యాయి!!

బతుకుదెరువు కోసం సంచారం జీవనం చేస్తూ నిండు ప్రాణం బలి 

ఆవు, దూడ వెతకడానికి వెళ్లిన యువకుడికి విద్యుత్‌షాక్‌

పోస్టుమార్టం కోసం మృతదేహం తరలింపు 

ఖననం చేసేందుకూ డబ్బుల్లేక అష్టకష్టాలు


వెలిగండ్ల, ఏప్రిల్‌ 8 : ఊరూరా తిరుగుతూ బతుకుదెరువు కోసం సంచార జీవనం సాగిస్తున్న ఓ అభాగ్య కుటుంబంపై విధిపగబట్టింది. ఓ యువకుడు విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కడప జిల్లా గోపవరం మండలం పిపికుంటకు చెందిన సంచార జాతుల వారు మూడు నెలల క్రితం బతుకుదెరువు కోసం మండలానికి వలస వచ్చారు. పద్మాపురం వద్ద రోడ్డు వెంబడి ఉంటూ జీవనం సాగిస్తున్నారు. కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ ఆ కుటుంబం పాలిట శాపంలా మారింది. ఎటూ వెళ్లలేక రోడ్లు పక్క చెట్ల కిందే జీవిస్తున్నారు. పొట్టకూటి కోసం చిన్న చిన్న పక్షులను వేటాడుతూ కడుపు నింపుకుంటున్నారు. ఈ క్రమంలో కొంతమంది ప్రజాప్రతినిధులు, దాతలు వారి దుస్థితిని చూసి చలించి ఆహారాన్ని కూడా అందించారు.


స్వగ్రామానికి వెళ్లే అవకాశం లేకపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు ఆవు, దూడలను కూడా వారు తినే దాంట్లోనే పెడుతూ పోషించుకుంటూ గడుపుతున్నారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున వారితో ఉండే ఆవు, దూడ కనిపించకుండా పోయాయి. వాటిని వెతుక్కుంటూ కుటుంబ సభ్యులు నలుగురు పొలాల గట్ల వెంబడి వెతకడం మొదలు పెట్టారు. చీర్లదిన్నె జామతోటలో ఆవు, దూడ ఉన్నాయి. కంచె దాటి వాటి వద్దకు పోయే క్రమంలో మొదటగా జగన్నాథం వన్నూరయ్య(18) ప్రమాదవశాత్తూ విద్యుత్‌ వైర్‌ తగలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.


దిక్కుతోచని మిగతా ముగ్గురు మృతి చెందిన వన్నూరయ్య మృతదేహాన్ని తాము నివసిస్తున్న చెట్ల కిందకు తీసుకొచ్చారు. మృతదేహంపై పడి బోరున విలపించారు. కననం చేసే స్థోమతా లేదు, యాచించి కననం చేద్దామన్నా లాక్‌డౌన్‌ కారణంగా సంచరించడానికే అవకాశం లేకుండా పోయింది. ఈ సమాచారం స్థానిక పోలీసులకు చేరింది. ఈ మేరకు ఎస్‌ఐ టి. రాజ్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకొని పుర్వాపరాలు విచారించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. 


Updated Date - 2020-04-09T11:46:52+05:30 IST