పుట్టిన బిడ్డను చూసుకోలేక.. కరోనా బాధిత తల్లిదండ్రుల ఆవేదన

ABN , First Publish Date - 2020-04-04T14:59:19+05:30 IST

తొలిచూరు బిడ్డ, పుట్టి పదిరోజులు అయింది. ఒకే బిల్డింగ్‌లో ఉన్నా ఓ జంట ఆ బాబును చూసుకోలేక పోయింది. తల్లిదండ్రులు ఇద్దరికి కరోనా రావడంతో డాక్టర్లు బిడ్డను చూడడానికి అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాతైనా పట్టుకుందామంటే క్వారంటైన్‌ పూర్తయ్యే వరకు చేతులకు గ్లౌస్‌ లేకుండా ఆపని చేయవద్దని డాక్టర్లు హెచ్చరించారు.

పుట్టిన బిడ్డను చూసుకోలేక.. కరోనా బాధిత తల్లిదండ్రుల ఆవేదన

మాడ్రిడ్‌, ఏప్రిల్‌ 3: తొలిచూరు బిడ్డ, పుట్టి పదిరోజులు అయింది. ఒకే బిల్డింగ్‌లో ఉన్నా ఓ జంట ఆ బాబును చూసుకోలేక పోయింది. తల్లిదండ్రులు ఇద్దరికి కరోనా రావడంతో డాక్టర్లు బిడ్డను చూడడానికి అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాతైనా పట్టుకుందామంటే క్వారంటైన్‌ పూర్తయ్యే వరకు చేతులకు గ్లౌస్‌ లేకుండా ఆపని చేయవద్దని డాక్టర్లు హెచ్చరించారు. స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో జరిగిన సంఘటన ఇది. చేతికి గ్లోవ్స్‌ లేకుండా తను కాని, తన భర్తకాని కన్న బిడ్డను తీసుకునే పరిస్థితి లేదని వనీసా మురో (34) అనే గృహిణి ఆవేదన వ్యక్తం చేసింది.


ఈమె గర్భవతిగా ఉన్నప్పుడు అంతా తానే అయి చూసుకున్న అమ్మమ్మ కోరోనా కాటుకు బలైంది. వివరాల్లోకి వెళితే మార్చి 12న చేయించుకున్న పరీక్షలో మురో భర్తకు పాజిటవ్‌ అని తేలింది. ఆ తర్వాత వనీసాకు కరోనా సోకింది. దాంతో ఆమె సిజేరియన్‌ కోసం ఒంటరిగానే మార్చి 16న ఆసుపత్రిలో చేరింది. పుట్టబోయేబిడ్డకు వైరస్‌ సోకుతుందేమోనని మరోవైపు భయం. ఈ పరిస్థితుల్లో మొత్తానికి బుజ్జి బాబు బయటకు వచ్చాడు. 3.6 కిలోల బరువు ఉన్నాడు.


వెంటనే తనను ఇంక్యుబేటర్‌లో పెట్టారు. పరీక్షలు జరిపి వైరస్‌ లేదని తేల్చేవరకు బాబును మిగతా పిల్లల నుంచి వేరుగానే ఉంచారు. సిబ్బంది పర్యవేక్షణలోనే తదుపరి 48 గంటలూ బాబు ఉన్నాడు. ఏడు అంతస్తుల కింద బాబు ఉన్నప్పటికీ తనకు దగ్గరగానే ఉన్నట్టు భావించానని మురే తెలిపింది. పది రోజుల తరవాత కూడా గ్లోవ్స్‌ ఉంచుకునే బాబును ఇంటికి తీసుకెళ్ళేందుకు డాక్టర్లు ఆ దంపతులకు అనుమతించారు.  బాబు ఆసుపత్రిలో ఉన్నంత కాలం వీడియోలు, ఫొటోలను పంపి వారికి బెంగలేకుండా సైకాలజిస్టులు చూశారు.  

Updated Date - 2020-04-04T14:59:19+05:30 IST