ఇలాంటి పరిస్థితి ఇంతకుముందు రాలేదు!

ABN , First Publish Date - 2020-04-05T05:40:11+05:30 IST

చిరంజీవి నుండి పిలుపు వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమ కదిలింది. కరోనా కష్టాలపై యుద్ధం ప్రకటించింది. ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ’ సహాయ కార్యక్రమాలు, కొత్త సినిమా ‘ఆచార్య’ కబుర్ల గురించి చిరంజీవితో...

ఇలాంటి పరిస్థితి ఇంతకుముందు రాలేదు!

చిరంజీవి నుండి పిలుపు వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమ కదిలింది. కరోనా కష్టాలపై యుద్ధం ప్రకటించింది. ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ’ సహాయ కార్యక్రమాలు, కొత్త సినిమా ‘ఆచార్య’ కబుర్ల గురించి చిరంజీవితో ‘నవ్య’ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ...


కరోనా వల్ల షూటింగ్‌ వాయిదా ఆలోచనకు కారణం?

కరోనా మహమ్మారి రోజురోజుకీ ఎలా విస్తరిస్తుందో ప్రసార మాధ్యమాలు, సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న తర్వాత ఇది ఆషామాషీ వ్యవహారం కాదు, కనీవినీ ఎరుగని ఉపద్రవం అనిపించింది. ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో దర్శకుడు కొరటాల శివ, సోనూసూద్‌తో ఈ విషయం గురించి చర్చించేవాడిని. అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఎక్కువమంది ఒకేచోట గుమికూడకుండా చర్యలు తీసుకోవాలి, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించకపోతే వైరస్‌ తీవ్రత ఎక్కువవుతుందని ప్రకటించడంతో వెంటనే దర్శకుడు కొరటాల శివకు ఫోన్‌ చేసి రేపటి నుండి షూటింగ్‌ ఆపేద్దామని చెప్పాను. ‘కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడానికి మనం కారణం కాకూడదు’ అనే నా భావాన్ని ఆయన అర్థం చేసుకుని సరేనన్నారు. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో పరిస్థితి తీవ్రతను గమనించిన మిగిలిన పెద్దలు షూటింగ్స్‌ ఆపివేయాలని నిర్ణయించారు. కష్టనష్టాలు కలిగిన నిర్ణయమే. కానీ భరించక తప్పదు. 


మీరు, మీ ఫ్యామిలీ తీసుకొంటున్న  జాగ్రత్తలు? 

ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామనే చెప్పాలి. బయట నుంచి వచ్చే మా సహాయకులు, డ్రైవర్స్‌,  సెక్యూరిటీ పర్సన్స్‌, హౌస్‌ కీపింగ్‌ స్టాఫ్‌... అందరికీ సెలవులు ఇచ్చేశాను. లాక్‌ డౌన్‌ పీరియడ్‌ను గౌరవిస్తూ తీసుకొన్న నిర్ణయమది. లాక్‌ డౌన్‌ ఎత్తేసిన తర్వాత కొంతకాలం పాటు ఇదే విధానాన్ని ఆచరించాలనుకొంటున్నాను. కుక్స్‌, ఇంట్లో ఉండే సహాయకులు, ఇతర పనివాళ్లు ఎప్పటినుంచో మా ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్లు మాతో పాటు స్వీయ నిర్బంధంలోనే ఉన్నారు. అతిఽథులను కూడా కొంత కాలంపాటు రావద్దని రిక్వెస్ట్‌ చేస్తున్నాం. మా అమ్మాయిలు, చెల్లాయిలు వాళ్ల కుటుంబాలతో మాతో పాటే ఉంటున్నారు.  కొత్త సినిమాలు చూడగలుగుతున్నాం. మంచి పుస్తకాలు చదువుతున్నాం. రెండు పూటలా ఎక్సర్‌సైజ్‌ చేయగలుగుతున్నాం. మొక్కలకు నీళ్లు పోయడం, తోట పని చేయడం.. స్విమ్మింగ్‌ పూల్‌ క్లీన్‌ చేయడం ఇలాంటి వాటి వల్ల సమయం తెలియడం లేదు. ఉదయాన్నే లేచి బయట కూర్చుని సిటీని చూడడం కొత్త అనుభూతి కలిగిస్తోంది. ఆ నిశ్శబ్ద వాతావారణంలో, పక్షుల కిలకిలా రావాలు వింటూ ప్రకృతితో మమేకం అయ్యే అవకాశం మనకు మళ్లీ కలిగింది. ఇది కఠినమైన పరీక్షా సమయమే అయినా ఎంతో కొంత ఎంజాయ్‌ చేస్తున్నామనే చెప్పాలి. 


వంట గదిలోకి వెళ్లి గరిటె తిప్పుతున్నారా? 

(నవ్వు) కొత్త వంటకాలు చేయడం దుబారానే కదా! అందుకే వంట గదిలోకి వెళ్లి కొత్త వంటలు చేయడం లేదు కానీ దోసెలు, ఉప్మా అప్పుడప్పుడు చేస్తున్నాను. ఇలా వంట గదిలో తలే కాదు చెయ్యి కూడా దూరుస్తున్నాను. 


ఈ తీరిక సమయాన్ని  ఎలా వినియోగిస్తున్నారు? 

నా ఆత్మకథ రాసుకోవాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఖాళీ దొరికింది కదా! అందుకే గతంలో జరిగిన  సంఘటనల్ని సురేఖతో కలసి గుర్తు చేసుకొని వాటిని వీడియో రూపంలో రికార్డ్‌ చేసుకొంటున్నాను.


‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ’ సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎలా కలిగింది?

ఎలాంటి విపత్తు ఎదురైనా ప్రభుత్వానికి మద్దతు పలకడం, అండదండలు అందించడం పౌరులుగా మన బాధ్యత. అయితే ఈ విపత్తు సమయంలో నాకు మొదట సినీ కార్మికులు గుర్తుకు వచ్చారు. రోజువారీ వేతనం లభిస్తే తప్ప పొట్టగడవని పరిస్థితి వాళ్లలో చాలామందిది. షూటింగ్స్‌ లేకపోతే వారి జీవనాధారం ఆగిపోతుంది కనుక వాళ్లు ఆకలితో పస్తులు ఉండకూడదు, వెంటనే ఆదుకోవాలని అనిపించింది. మరో ఆలోచన లేకుండా సినీ కార్మికుల కోసం కోటి రూపాయలు విరాళం ప్రకటించాను. ఆ స్ఫూర్తితో సోదర హీరోలందరూ ముందుకు వచ్చి చేయూతనిచ్చారు. సినీ కార్మికులను ఆదుకోవాలనే ఆలోచన వచ్చిన వెంటనే సురేష్‌బాబుకు ఫోన్‌ చేశాను. వాళ్లకు ఏవిధంగా సాయం అందజేయాలనే అంశం మీద చాలాసేపు చర్చించుకొన్నాం. ఇది ఏ ఒక్కరితోనో అయ్యే కార్యక్రమం కాదు కనుక సేవాభావం కలిగిన మరి కొంతమంది వ్యక్తుల తోడ్పాటు తీసుకుంటే బాగుంటుందనిపించి తమ్మారెడ్డి భరద్వాజ, సి.కల్యాణ్‌, ఎన్‌.శంకర్‌, ‘మా’ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బెనర్జీ, ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ నుంచి డి. నురేశ్‌బాబు, ఫిల్మ్‌ చాంబర్‌ సెక్రటరీ దామోదర ప్రసాద్‌లను సంప్రదించాను. నాతో కలసి నడవడానికి వాళ్లంతా అంగీకరించారు. 


కానీ ఒకరిద్దరు తప్ప మిగిలిన హీరోయిన్లు ఎవరూ విరాళాలు ప్రకటించలేదు. కారణం? 

ఇప్పటికే తమన్నా, కాజల్‌ సాయం చేస్తామంటూ ముందుకు వచ్చారు. మిగిలిన హీరోయిన్లకు సమాచారం లేకపోవడమే తప్ప మరే కారణం కాదు. అందుకే వ్యక్తిగతంగా అందర్నీ సంప్రతిస్తున్నాం. మరో విషయమేమిటంటే ఇప్పుడున్న పరిస్థితుల వల్ల కొత్తగా ట్రస్ట్‌ ఏర్పాటు చేయడానికీ, బ్యాంక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయడానికీ అవకాశం లేకపోవడంతో చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఉంది కనుక దాని పేరిట విరాళాలు తీసుకొంటున్నాం. 


వేలల్లో ఉన్న సినీ కార్మికులకు నిత్యావసర వస్తువుల సరఫరా ప్రణాళిక ఎలా చేశారు? 

అన్ని శాఖల నుంచి లబ్ధి పొందడానికి అర్హులైన సినీ కార్మికుల డేటాను ఆయా అసోసియేషన్‌ల చీఫ్‌ల ద్వారా సేకరించాం. నిజాయితీగా అవసరార్థులకు సీసీసీ చేసే సాయం పారదర్శకంగా అందడానికి అమితాబ్‌ బచ్చన్‌గారు ఓ సులభమైన పద్ధతిని చెప్పారు. ‘సినీ కార్మికుల డేటా ప్రకారం వారి పేరుతో ఓ ఎలక్ర్టానిక్‌ కార్డ్‌ రూపొందించి, దాన్ని ఆధార్‌ కార్డ్‌కి లింక్‌ చేస్తున్నాం. అందులో బ్లడ్‌ గ్రూప్‌ సహా అన్ని వివరాలు ఉంటాయి. దీన్ని కంప్యూటర్‌కి అనుసంధానం చేసి ఆ డేటాతో ప్రతి పేద కార్మికుడికి సహాయం అందేలా చేస్తున్నాం’’ అని అమితాబ్‌ బచ్చన్‌ చెప్పారు. అదే పద్ధతిని మనమూ ఫాలో అవుతున్నాం. దీనికి సంబంధించి నలుగురు సాఫ్ట్‌వేర్‌ నిపుణులు పని చేస్తున్నారు. ఈ విషయంలో మెహర్‌ రమేశ్‌ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాడు. లబ్ధి పొందిన ప్రతి ఒక్కరి నుంచి ఎలక్ర్టానిక్‌ కార్డ్‌ ద్వారా సీసీసీ ఆఫీస్‌కు ఓటీపీ వస్తుంది. ‘మేం సహాయాన్ని స్వీకరించాం’ అనడానికి అది నిదర్శనం. ఎలాంటి పొరపాటు జరగకుండా పారదర్శకంగా జరుగుతుంది. ‘మాకు అందలేదు’ అన్నమాట రాకుండా ప్రతి సినీ కార్మికుడిని తమ పేర్లను ఆయా అసోసియేషన్‌లలో నమోదు చేసుకోమని చెబుతున్నాం. ప్రస్తుతం నెలరోజులకు సరిపడా రూ.2222 విలువగల నిత్యావసర వస్తువులతోపాటు, శానిటైజర్‌, కొన్ని మాస్క్‌లు అందజేస్తున్నాం. లాక్‌డౌన్‌ కొనసాగి మళ్లీ షూటింగ్‌లు లేకపోతే మరో నెలకు కూడా సాయం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అవసరమైతే నా సోదర సమానులైన తోటి కళాకారులను, పరిశ్రమ బయట నాకున్న స్నేహితులను అడిగైనా సరే.. పరిశ్రమకు అండగా ఉంటాం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సినీ కార్మికులు ఆకలితో ఉండకూడదన్నది మా ఽధ్యేయం. అలాగే రామ్‌చరణ్‌ అడగడంతో ఉపాసన కూడా తమ అపోలో ఫార్మసీ నుంచి ప్రిస్ర్కిప్షన్‌ ఉన్న కార్మికులకు రూ.500 నుంచి 1000 వరకూ మెడిసిన్స్‌ కూడా ఫ్రీ హోమ్‌ డెలివరీతో ఇవ్వడానికి ప్రిపేర్‌ అవుతున్నారు. 


‘సీసీసీ’ అన్నది ఇకపై కూడా కొనసాగుతుందా?

కరోనా సమస్య పరిష్కారం అయ్యాక ‘సీసీసీ’ ఉండదు. ‘మన కోసం’ అనే సంస్థ మాత్రం అన్ని క్రాఫ్ట్‌లనూ, అసోసియేషన్‌లనూ కలుపుకొని విపత్కర పరిస్థితుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా చేయూతనివ్వడానికి సిద్ధంగా ఉంటుంది. దీనికి ఓ కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఇదెలా ముందుకెళ్తుంది అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. 


థియేటర్ల మూత, షూటింగ్‌ల నిలిపివేత వల్ల కలిగిన నష్టాన్ని తట్టుకోవడానికి, మళ్లీ దారిలో పడటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? 

గతంలో కూడా థియేటర్లు మూతపడడం, షూటింగ్‌లు ఆగిపోవడం జరిగాయి. అన్నీ సర్దుకున్నాక ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండేవారు. కానీ తెలుగు సినిమా పుట్టాక ఇలాంటి పరిస్థితులు రాలేదు. దీనివల్ల ఎంత నష్టం వాటిల్లిందనేది ఇంకా బేరీజు వేసుకోలేకపోతున్నాం. సినిమా పరిశ్రమ అనే కాదు ప్రపంచంలో ఏ రంగం తీసుకున్నా ఇదే పరిస్థితి. ఇప్పట్లో ఎవరూ మాట్లాడలేరు. చిన్నా, పెద్ద అంతా కలిసి దీనిని అధిగమించాలి. 


‘ఆచార్య’ సినిమా, దర్శకుడు కొరటాల శివ గురించి? 

‘ఆచార్య నిమిత్తం అతనితో ఇంటరాక్ట్‌ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత లోతైన వ్యక్తిగా కనిపించాడు. సమాజం పట్ల ఎంతో అవగాహన, మేధస్సు ఉన్న వ్యక్తి. జాతీయ, అంతర్జాతీయ విషయాలపై పట్టున్న వ్యక్తి. దిగజారుతున్న రాజకీయలు, నాయకుల వ్యక్తిత్వాలు-ప్రవర్తన గురించి అతనిలో ఆందోళన ఎక్కువ. డబ్బు తీసుకుని ఓట్లు వేస్తున్న ప్రజల గురించి వ్యధతో మాట్లాడతాడు. కొరటాల శివలోని సేవాతత్పరత నాకు బాగా నచ్చింది. శ్రీమతితో కలిసి తన ఆదాయంలో కొంత భాగాన్ని సమాజసేవకు వెచ్చించే వ్యక్తి కొరటాల. పిల్లలు పుడితే స్వార్థంతో సమాజానికి ఏమీ చేయలేమని... బిడ్డలు వద్దనే కఠోర నిర్ణయం తీసుకున్న గొప్ప జంట. గొప్ప వ్యక్తిత్వం, సామాజిక స్పృహ ఉన్న తనతో సినిమా చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. అతని చిత్రాల్లో ఆ భావాలు కనపడతాయి.


సినిమాలో మీరు మాజీ మావోయిస్టుగా నటిస్తున్నారని టాక్‌. ఆల్రెడీ లుక్‌ కూడా లీకైంది!

కొరటాల శివ వామపక్ష భావాలున్న మనిషి. ఆ నేపథ్యం నుండి వచ్చాడు. అతని వ్యక్తిగత భావజాలం నా పాత్రలో కనపడుతుంది. అంతవరకూ చెప్పగలను.


‘ఆచార్య’లో మహేశ్‌బాబు నటిస్తున్నారనీ, కాదు కాదు రామ్‌చరణ్‌ నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. 

(నవ్వుతూ) నేను పొరపాటున ‘ఆచార్య’ టైటిల్‌ చెప్పేశా. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నా... మహేశ్‌బాబు పేరు ఎలా వచ్చిందో తెలియడం లేదు. నేనంటే మహేశ్‌కి ప్రేమ, అభిమానం. అలాగే, అతనంటే నాకు చాలా ఇష్టం. మహేశ్‌బాబుతో సినిమా చేసే అవకాశం వస్తే అద్భుతం. తనూ నా బిడ్డలాంటివాడు. ఈ చిత్రానికి సంబంధించి ఓ పాత్రకు ముందు నుంచీ రామ్‌చరణ్‌ అయితే బాగుంటుందనే భావన కొరటాల శివకు ఎక్కడో ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో చరణ్‌ చాలా బిజీగా ఉన్నాడు. అందువల్ల, ఆ సినిమా పూర్తికాకుండా తను ఎంత వరకూ డేట్స్‌ ఇవ్వగలడనే మీమాంస ఉంది. ఒకవేళ రాజమౌళిగారు, కొరటాల శివగారు అండర్‌స్టాండింగ్‌కి వస్తే.. ‘ఆచార్య’లో చరణ్‌ ఉండొచ్చు. కుదరకపోతే... ఏమో! నేను, చరణ్‌ కలిసి కంప్లీట్‌ సినిమా చేయాలన్నది సురేఖ కోరిక. తల్లి కోరిక నెరవేరుతుందేమో చూడాలి.


ఒకవేళ ఉంటే... అతిథి పాత్రలా ఉంటుందా? ప్రత్యేక పాత్రలా ఉంటుందా?

రీజనబుల్లీ... మంచి నిడివి గల పాత్రే.




ఇటీవల ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో అడుగుపెట్టారు. ఈ ఆలోచన ఎప్పట్నుంచి ఉంది? 

నిజం చెప్పాలంటే... ముందు నుంచీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని గానీ, దాని ఆవశ్యకత గానీ నాకు పూర్తిగా తెలియదు. పవన్‌కల్యాణ్‌, చరణ్‌ ఇలా అందరూ ఉన్నారు. ఒక్కోసారి నేను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు... ఎవరికి, ఎలా చెప్పాలి? అనేది తెలియదు. అప్పటికప్పుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయలేను. ప్రెస్‌నోట్‌ ఇస్తే పూర్తిస్థాయిలో వెళుతుందో, లేదో? తెలియదు. ఇటువంటి ఇబ్బంది చాలాసార్లు ఎదుర్కొన్నా. నేను అనుకున్నవి చెప్పలేకపోతున్నానని ఒక్కోసారి అనిపించేది. అందుకని, నేనూ సోషల్‌ మీడియాలోకి వస్తే బాగుంటుందా అనుకుంటూ ఉండేవాణ్ణి. డిసెంబర్‌లో కరోనా రావడం, జనవరిలో ఉధ్ధృతి పెరగడంతో ‘ఇటువంటి సమయంలో హెచ్చరికలు గానీ, జాగ్రత్తలు గానీ చెప్పాల్సిన పరిస్థితి. సోషల్‌ మీడియాలోకి ఎంటరైతే బావుంటుంది’ అనుకున్నా. అభిమానులకు నేను ఎక్కడ ఉన్నాను? ఏంటి? అనేది ఫొటోలు పోస్ట్‌ చేయడం ద్వారా కనువిందు చేయగలను కదా! ఇన్ని ఆలోచించి ఉగాది రోజున ప్రారంభించా. యాక్టివ్‌గా ఉంటున్నా. ఎవరైనా, ఏదైనా మంచి పని చేస్తే ట్విట్టర్‌ ద్వారా అభినందిస్తున్నా. ధన్యవాదాలు చెబుతున్నా. సరైన సమయంలో మంచి వేదికను వాడుకుంటున్నా.


రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీజర్‌ను మెచ్చుకుంటూ ట్వీట్‌ చేశారు. తండ్రిగా ఆ లుక్‌, టీజర్‌ చూసినప్పుడు ఎటువంటి ఉద్వేగానికి లోనయ్యారు?

ఏ సినిమాకు ఆ సినిమాయే. రాజమౌళి హీరో క్యారెక్టరైజేషన్‌ డిజైన్‌ చేయడం, ఎమోషన్‌తో కథను నడిపించే విధానం గానీ బాగుంటుంది. ఇద్దరు హీరోలున్నా... కచ్చితంగా ఇద్దర్నీ బ్యాలెన్స్‌ చేస్తారని నేను విశ్వసిస్తున్నా. ఆయన ముందు నుంచీ చరణ్‌ పుట్టినరోజుకు టీజర్‌ విడుదల చేయాలని అనుకున్నారు. అయితే... అది ఎలా ఉండబోతుందని నేనూ ఉత్సుకతతో చూశా. నిజంగా అమేజింగ్‌గా అనిపించింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో కచ్చితంగా రాజమౌళి తన ముద్ర తిరిగి వేయగలడు. ‘బాహుబలి’కి ఏమాత్రం తగ్గని సినిమా అవుతుందనే నమ్మకం నాకుంది.


‘ఆచార్య’ తర్వాత ఏ సినిమా చేయబోతున్నారు? 

ఇంకా ఏమీ అనుకోలేదు. ప్రస్తుతం నలుగురైదుగురు దర్శకులతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలో చెబుతా. చేయబోయే ‘లూసిఫర్‌’ రీమేక్‌కి దర్శకుడు ఎవరనేది నిర్ధారించుకోలేదు. 


‘లూసిఫర్‌’ రీమేక్‌ పవన్‌కల్యాణ్‌ చేస్తారని ఒక టాక్‌!

నో... నో! ఆ సినిమా నేనే చేస్తా. తమ్ముడు (పవన్‌కల్యాణ్‌) చేయాలని ఉత్సాహపడితే తప్పకుండా తనకు ఇచ్చేస్తా. తనకు చేయాలనుందనే వార్త అయితే నా వరకూ రాలేదు.


తెలుగు చలనచిత్ర పరిశ్రమ పుట్టిన తర్వాత ఎప్పుడూ సమ్మర్‌ సీజన్‌ మిస్‌ కాలేదు. తొలిసారి మిస్‌ అవుతోంది.

ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో... ఎవరికైనా సినిమా అన్నది లీస్ట్‌ ప్రయారిటీ అయిపోయింది. సినిమాల్లో పెట్టుబడి గురించీ ఆలోచించడం లేదు.  ప్రజలందరితో పాటు పరిశ్రమలో వ్యక్తులు కూడా ఈ సమయంలో కొంత నష్టపోతారు. అందరితో పాటు మనం అనే మానసిక సంసిద్ధత ఏర్పడింది కాబట్టి... సమ్మర్‌ సీజన్‌ గురించి ఎవరూ ఏమీ ఆలోచించడం  లేదని నేను నమ్ముతున్నా. ఒక సీజన్‌ మిస్‌ అయితే సినిమా ఇండస్ట్రీకి, ప్రేక్షకులకూ ఏమీ కాదు. కొంత నష్టం జరుగుతుంది. భరిద్దాం!


సూపర్‌స్టార్స్‌ అంతా కలిసి...

ఇటీవల ఓ యాడ్‌ షూట్‌ కోసం బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ నాతో మాట్లాడారు. ‘ఇండియాలో సూపర్‌స్టార్స్‌ అందరితో ఓ యాడ్‌ షూట్‌ చేస్తున్నాం. ఇందులో మీరు భాగం కావాలి చిరంజీవీ’ అని ఆయనడిగారు. తప్పకుండా చేస్తానని అందులో యాక్ట్‌ చేశాను. త్వరలోనే ఆ వీడియో బయటకు వస్తుంది. ‘సినీ కార్మికుల కోసం తెలుగు పరిశ్రమలో మీరంతా చేస్తున్న సహకారం గురించి విన్నాను. మీరు, నాగార్జున చేసిన సాంగ్‌ బావుంది’ అని చెప్పి.. కార్మికులకు సీసీసీ అందజేసే సహాయం వారికి ఎలా చేరాలి అన్నదానిపై అమితాబ్‌ మాకు ఓ గొప్ప ఐడియా ఇచ్చారు.


వినాయకరావు



Updated Date - 2020-04-05T05:40:11+05:30 IST