కుంభోత్సవ నిర్వహణపై సమావేశం

ABN , First Publish Date - 2020-04-05T09:55:20+05:30 IST

ఈ నెల 10వ తేదీన భ్రమరాంబదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం నిర్వహించనున్నారు.

కుంభోత్సవ నిర్వహణపై సమావేశం

శ్రీశైలం, ఏప్రిల్‌ 4: ఈ నెల 10వ తేదీన భ్రమరాంబదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం నిర్వహించనున్నారు. కుంభోత్సవ నిర్వహణపై శనివారం శ్రీశైల దేవస్థాన పరిపాలన భవనంలో దేవస్థాన ఈవో కేఎస్‌ రామారావు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. మండల తహసీల్దార్‌ బి.రాజేంద్రసింగ్‌, శ్రీశైలం సీఐ రవీంద్ర, ఎస్‌ఐ హరిప్రసాద్‌, దేవస్థాన ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, అసిస్టెంట్‌ కమిషనర్‌ కోదండరామిరెడ్డి, ఏఈవో కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా భక్తులను దర్శనానికి అనుమతించడం పూర్తిగా నిలిపివేశారు. ఆయా కైంకర్యాలన్నీ అర్చకస్వాములు ఏకాంతంగా నిర్వహిస్తారు. 


సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు

లాక్‌డౌన్‌ అమలులో ఉన్న కారణంగా కుంభోత్సవం రోజున భక్తులను ఎవరిని కూడా ఆలయానికి అనుమతించేది  లేదు. ఉత్సవం రోజున ఆలయ కైంకర్యాలన్నీ పరిమిత సంఖ్యలో అర్చకస్వాములే ఏకాంతంగా నిర్వహిస్తారు. 


ఉత్సవ నిర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బంది పరిమితంగానే హాజరవుతారు. 


కుంభోత్సవం ‘క్షేత్ర రక్షణ కోసం’ నిర్వహించే ఉత్సవంగా (ఊరి పండుగగా) పేరొందిన కారణంగా కుంభోత్సవం రోజు వేకువజామునుంచే అమ్మవారికి పూజాదికాలు నిర్వహిస్తారు. సాయంత్రం స్వామివారికి అన్నాభిషేకం, ఆచారాన్ని అనుసరించి పురుషుడు స్త్రీ వేశాన్ని ధరించి అమ్మవారికి కుంభహారతి సమర్పణ కార్యక్రమాలన్నీ సంప్రదాయబద్ధంగా యథావిధిగా నిర్వహణ కోసం ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులకు పలు సూచనలు చేశారు. 


దేవదాయ చట్టాన్ని అనుసరించి క్షేత్ర పరిధిలో జంతు, పక్షి బలులు, జీవహింస పూర్తిగా నిషేధించారు. రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు జంతు బలుల నిషేదం కట్టుదిట్టంగా అమలు చేయాలని ఈవో ఆదేశాలు. 


జంతు, పక్షి బలి నిషేధాన్ని గురించి భక్తుల్లో అవగాహన కల్పించేందుకు ఆలయ మైక్‌ ద్వారా ప్రచారం, క్షేత్రంలో ఫ్లెక్సీలు ఏర్పాటుకు ఆదేశాలు.


కరోనా వైరస్‌ నివారణ చర్యలలో భాగంగా క్షేత్ర పరిధిలో 144 సెక్షన్‌ అమలులో ఉండడంతో క్షేత్రంలో ఊరేగింపు కూడా నిషేదం.  

Updated Date - 2020-04-05T09:55:20+05:30 IST