Abn logo
May 26 2020 @ 15:52PM

మహారాష్ట్ర నుంచి ‘వైరస్‌ వలస’.. మనకూ పొంచి ఉన్న ముప్పు..!

గ్రామీణంలో నమోదైన రెండు కేసులు అక్కడి లింకే..

ఇతర ప్రాంతాల నుంచి ఖమ్మం జిల్లాకు 2,689మంది రాక

ఇతర రాష్ట్రాల నుంచి 925మంది


ఖమ్మం(ఆంధ్రజ్యోతి): ఏపీలోని కృష్ణా జిల్లాకు మహారాష్ట్ర నుంచి వచ్చిన 15మందికి అక్కడి ప్రభుత్వం కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. వారిలో 14మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇక అదే మహారాష్ట్ర నుంచి ఖమ్మం జిల్లాలోని మధిర మండలం మహదేవపురం వచ్చిన ఓ వ్యక్తి, పెనుబల్లి మండలం వీఎం బంజరకు చెందిన మహిళకు కూడా కరోనా నిర్ధారణైంది. దీంతో మనపై మహా ముప్పు పొంచిఉందన్న ఆందోళన అటు అధికారులు, ఇటు ప్రజల్లో కనిపిస్తోంది. కరోనా ప్రభావం ప్రారంభమైన కొద్దిరోజులకు ఖమ్మం నగరంలో మాత్రమే ఎనిమిది పాజిటివ్‌ కేసులు రాగా.. వారంతా కోలుకున్నారు. ఆ తర్వాత కేసులేవీ నమోదవకపోవడంతో.. అంతూ ఊపిరిపీల్చుకున్నారు. జిల్లా సేఫ్‌జోన్‌లోనే ఉందని భావించారు. కానీ అనూహ్యంగా లాక్‌డౌన్‌ కంటే ముందు జిల్లా నుంచి పలు పనుల కోసమని ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు లాక్‌డౌన్‌ సడలింపులతో జిల్లాకు రావడం ప్రారంభించారు. ఈ క్రమంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి పాజిటివ్‌ రావడంతో మళ్లీ కరోనా భయం పట్టుకుంది. అంతేకాక ఇప్పటి వరకు నగరం వరకే పరిమితమైన కరోనా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా రావడం, అవి కూడా మహారష్ట్రతో లింకు ఉన్నవే కావడంతో ప్రజలు బిక్కుబిక్కు మంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎప్పుడు ఎవరు వస్తారో..? ఎవరి ద్వారా కరోనా వ్యాప్తి జరుగుతుందోనని అనుమా నాలు వ్యక్తం చేస్తున్నారు. 


ఇప్పటికే 2,689మంది జిల్లాకు రాక

లాక్‌డౌన్‌ సడలింపు రావడంతో ప్రజారవాణా మొదలవడంతో గత వారం రోజులుగా జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి ఖమ్మం జిల్లాకు ఇతర రాష్ట్రాలు, పక్క జిల్లాల నుంచి మొత్తం 2,689మంది చేరుకున్నారు. వీరిలో 925మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కాగా ఒక్క మహరాష్ట్ర నుంచే 262మంది వచ్చారు. ఇక పక్కనే ఉన్న జిల్లాల నుంచి 1,769మంది స్వగ్రామాలకు చేరుకున్నారు. వీరిలో కరోనా నిర్దారణ కోసం కలెక్టర్‌ కర్ణన్‌ ప్రత్యేక చొరవ తీసుకొని ర్యాండమ్‌గా నిర్వహించిన కరోనా పరీక్షల్లో  మహారాష్ట్ర నుంచి మహదేవపురానికి చెందిన వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. అలాగే పెనుబల్లి మండలంలోనూ మహారాష్ట్ర నుంచి వచ్చిన మహిళకు వ్యాధి లక్షణాలు కనిపించాయి. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఖచ్చితంగా చేయాలన్న డిమాండ్‌ ప్రజలనుంచి వినిపిస్తోంది.


మండలాల వారీగా మహారాష్ట్ర నుంచి వచ్చిన వారు.. 

మహారాష్ట్ర నుంచి ఖమ్మం జిల్లాకు మొత్తం 262 మంది చేరుకున్నారు. వారిలో బోనకల్లు 10 మంది, చింతకాని 4, ఏన్కూరు 7, కల్లూరు 13, కామేపల్లి 4, ఖమ్మం రూరల్‌ 6, ఖమ్మం అర్బన్‌ 0, కొణిజర్ల 6, కూసుమంచి 3, మధిర 51, ముదిగొండ 2, నేలకొండపల్లి 4, పెనుబల్లి 104,రఘనాదపాలేం 1, సత్తుపల్లి 13, సింగరేణి 10, తల్లాడ 2, తిరుమలాయపాలెం 3, వేంసూరు 3, వైరా 9, ఎర్రుపాలెం ఏడుగురు తమ స్వగ్రామాలకు చేరుకున్నారు. 


ఫలితాన్నిచ్చిన పెనుబల్లి ప్రయోగం

జిల్లాలో అత్యధికంగా పెనుబల్లి మండలానికి ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చారు. ఇక్కడ రెవెన్యూ, పోలీసు, వైద్యశాఖ అధికారులు క్వారం టైన్‌ ప్రయోగం చేశారు. ఇతర మండలాల్లో వలస వచ్చిన వారిని నేరుగా ఇంటికి పంపగా ఒక్క పెనుబల్లి మండలంలో మాత్రం ప్రభుత్వ పాఠశా ల లు, వసతిగృహాల్లో ఉంచారు. వారిలో ఒకరికి పాజిటివ్‌ రాగానే ఆదే సెంటర్‌ లో ఉన్న వారిని వెంటనే జిల్లాలోని క్వారంటైన్‌కు పంపారు. దీంతో కరోనా పాజిటివ్‌ ప్రైమరీ కాంటాక్టు కేసులను తగ్గించగలిగారు. ఫలితంగా గ్రామాన్ని కట్టడి ప్రాంతంగా ప్రకటించే అవసరం లేకుండా పోయిందని తెలుస్తోంది. 


భయపడాల్సిన పనిలేదు: డాక్టర్‌ మాలతి, జిల్లా వైద్యాధికారి, ఖమ్మం జిల్లా

జిల్లాలో కరోనా వైరస్‌పై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారిని ప్రత్యేకంగా క్వారంటైన్‌లో ఉంచుతున్నాం. ఇప్పటి వరకు మహారాష్ట్ర నుంచి వచ్చిన వారిలో 124మంది ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉన్నారు. వీరిలో 14మంది నమూనాలను కరోనా నిర్దారణ పరీక్షలకు పంపగా నూరుశాతం నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది. కరోనా పరీక్షలపై ఎలాంటి ఆంక్షలు, ఆపోహలు లేవు. దశల వారీగా అవసరం మేరకు మిగతా వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తాం.

Advertisement
Advertisement