కర్ణాటకలో మరో నలుగురికి కరోనా

ABN , First Publish Date - 2020-03-27T07:35:13+05:30 IST

కర్ణాటకలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో..

కర్ణాటకలో మరో నలుగురికి కరోనా

55కి చేరిన వైరస్‌ బాధితుల సంఖ్య

బెంగళూరు/ చెన్నై, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఈ మేరకు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో బాధితుల సంఖ్య 55కి చేరినట్టయింది. నంజనగూడు ప్రాంతంలోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేసే మైసూరు యువకుడి(35)కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. అతడు పలువురు వైద్య నిపుణులతో కలిసినట్లు తెలుస్తోంది. జ్వరంతో బాధపడుతూ కొన్ని రోజులుగా ఇంట్లోనే గడిపాడు. కరోనా నిర్ధారణ కావడంతో అతడికి సన్నిహితంగా ఉండేవారిని ‘హోం క్వారంటైన్‌’లో ఉంచారు. చిక్కబళ్ళాపుర జిల్లా గౌరిబిదనూరుకు చెందిన 67 ఏళ్ల మహిళ కరోనాతో బుధవారం మృతి చెందింది. ఆమె ఈ నెల 14న మక్కా నుంచి బెంగళూరుకు వచ్చింది.  హృద్రోగం, మధుమేహంతో బాధపడుతున్న ఆమెకు మృతికి కరోనాయే కారణమని గురువారం విడుదల చేసిన నివేదికలో అధికారులు స్పష్టం చేశారు. అలాగే అనంతపురం జిల్లాకు చెందిన 64 ఏళ్ల వ్యక్తి ఫ్రాన్స్‌ నుంచి మార్చి 1న భారత్‌కు వచ్చాడు. ఆ తర్వాత హిమాచల్‌ ప్రదేశ్‌, పుట్టపర్తిలో పర్యటించి ఈ నెల 21న బెంగళూరుకు వచ్చాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 4 రోజుల క్రితం కరోనా నిర్ధారణ అయి న వ్యక్తితో సంబంధాలున్న బెంగళూరుకు చెందిన 45 ఏళ్ల సెక్యూరిటీ గార్డుకు కూడా పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం అతడు బెంగళూరు రాజీవ్‌గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.


తమిళనాట 27 కరోనా కేసులు

తమిళనాడులో కరోనా పాజిటివ్‌ కేసులు 27కి పెరిగాయి. దుబాయ్‌ నుంచి తిరుచ్చికి వచ్చిన 24 ఏళ్ల యువకుడికి కరోనా నిర్ధారణ అయ్యిందని, తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆ యువకుడిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్సలు అందిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి సి.విజయభాస్కర్‌ వెల్లడించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం స్థిరంగానే ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ఐసోలేషన్‌ పడకలను కూడా ప్రభు త్వం పెంచుతోంది. ప్రైవేటు ఆస్పత్రులు తప్పనిసరిగా కరోనా చికిత్సల కోసం 25 పడకలు కేటాయించాలని, ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 54 వేలమంది స్వీయనిర్బంధంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే లాక్‌డౌన్‌ను కూడా కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. 

Updated Date - 2020-03-27T07:35:13+05:30 IST