స్వస్థలానికి నడచి వెళుతూ...రోడ్డుపైనే కుప్పకూలి వలస కార్మికుడి మృతి

ABN , First Publish Date - 2020-03-29T12:28:52+05:30 IST

లాక్ డౌన్ విధించడంతో ఓ వలస కార్మికుడు 300 కిలోమీటర్ల దూరంలో తన స్వగ్రామానికి నడచివెళుతూ రోడ్డుపైనే ఛాతీనొప్పితో కుప్పకూలిపోయి మరణించిన విషాద ఘటన....

స్వస్థలానికి నడచి వెళుతూ...రోడ్డుపైనే కుప్పకూలి వలస కార్మికుడి మృతి

ఆగ్రా (ఉత్తరప్రదేశ్): దేశంలో ప్రబలుతున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించడంతో ఓ వలస కార్మికుడు 300 కిలోమీటర్ల దూరంలో తన స్వగ్రామానికి నడచివెళుతూ రోడ్డుపైనే ఛాతీనొప్పితో కుప్పకూలిపోయి మరణించిన విషాద ఘటన ఢిల్లీ -ఆగ్రా రహదారిపై వెలుగుచూసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మొరెనా జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన రణవీర్ సింగ్ (38) ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్ లో కార్మికుడిగా పనిచేసేవాడు. లాక్‌డౌన్‌తో తాను పనిచేస్తున్న రెస్టారెంట్ మూతబడటంతో రణవీర్ సింగ్ 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్వగ్రామానికి చేరుకునేందుకు నడక ప్రారంభించాడు.


రణవీర్ సింగ్ ఇప్పటికే 200 కిలోమీటర్ల దూరం నడచి ఆగ్రా నగర శివారు ప్రాంతానికి చేరుకున్నాడు. వలసకార్మికుడు రణవీర్ సింగ్ నడుస్తూనే ఛాతీనొప్పితో రోడ్డుపైనే కుప్పకూలిపోయి మరణించాడు. ఆగ్రా పోలీసులు వచ్చి రణవీర్ సింగ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.మొరెనా జిల్లా అంబా ప్రాంతంలోని బాడ్ కాపురా గ్రామానికి చెందిన రణవీర్ సింగ్ తన స్వగ్రామానికి చేరుకోవడానికి మరో వంద కిలోమీటర్ల దూరం ఉండగా మరణించాడని పోలీసులు చెప్పారు. పోలీసులు మృతుడి కుటుంబానికి సమాచారం అందించారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో నడచివెళుతూ వలసకార్మికుడు మృత్యువాత పడటం అందరినీ కలిచివేసింది.

Updated Date - 2020-03-29T12:28:52+05:30 IST