ఇక ‘కార్పొరేట్‌’ ఇసుక

ABN , First Publish Date - 2021-05-14T07:00:56+05:30 IST

జిల్లాలో ప్రస్తుతం 38 ఓపెన్‌ ర్యాంపులు ఉన్నాయి. వాటిలో శుక్రవారం నుంచి వేమగిరి-కడియపులంక ర్యాంపును ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 21వ తేదీ నాటికి ఏపీఎండీసీ ఇసుక వ్యాపార బాధ్యతల నుంచి మొత్తం తప్పుకుంటుంది. అప్పటి నుంచి మొత్తం ర్యాంపులన్నీ కొత్త సంస్థ ద్వారా మొదలవుతాయి.

ఇక ‘కార్పొరేట్‌’ ఇసుక

  • వేమగిరి-కడియపులంకతో ప్రారంభం
  • ఈ నెల 21 నుంచి మొత్తం ర్యాంపులన్నీ జేపీ సంస్థ ఆధీనంలోకి
  • ప్పటి నుంచి ర్యాంపుల్లోనే  ఇసుక విక్రయాలు
  • పెండింగులో 12 వేల టన్నుల ఆనలైన బుకింగ్‌లు
  • వారి ఖాతాల్లో సొమ్ము జమ చేయనున్న ఏపీఎండీసీ
  • లోకల్‌ ఇసుక కాంట్రాక్టర్లకుభారీ షాక్‌

 (రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ప్రస్తుతం 38  ఓపెన్‌ ర్యాంపులు ఉన్నాయి. వాటిలో శుక్రవారం నుంచి వేమగిరి-కడియపులంక ర్యాంపును ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 21వ తేదీ నాటికి ఏపీఎండీసీ ఇసుక వ్యాపార బాధ్యతల నుంచి మొత్తం తప్పుకుంటుంది. అప్పటి నుంచి మొత్తం ర్యాంపులన్నీ కొత్త సంస్థ ద్వారా మొదలవుతాయి. ఒప్పందం ఖరారు కావడంతో ప్రస్తుతం జిల్లాలో ర్యాంపులు నిర్వహిస్తున్న వారందరికీ ఏపీఎండీసీ డీఎస్‌వో నోటీసులు ఇచ్చి వారి ఒప్పందాన్ని రద్దు చేస్తారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీఎండీసీ ద్వారా ఇసుక విక్రయాలకు తెరతీసిన సంగతి తెలిసిందే. ర్యాంపులు, స్టాక్‌ పాయింట్ల ద్వారా ఏపీఎండీసీ ఇసుక అమ్మకాలు చేసింది. దీనికోసం పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు, వేయింగ్‌ మిషన్లు, అన్ని లారీలకు జీపీఎస్‌లు అమర్చే ప్రయత్నం చేశారు. అయితే ఇది పెద్దగా సక్సెస్‌ కాలేదు. నెమ్మదిగా గాడిలో పడుతున్న సమయంలో ప్రభుత్వం  మొత్తం ఇసుక విధానాన్ని కార్పొరేట్‌ సంస్థకు అప్పగించింది. ఇక తవ్వకాలు, అమ్మకాలు ఈ సంస్థ ఇష్టానుసారమే జరుగుతాయి. పర్యవేక్షణ, ర్యాంపులను గుర్తించే బాధ్యతను మైన్స్‌ శాఖకు అప్పగించనున్నారు. ఈ నెల 21 నుంచి వారికి పూర్తి అధికారాలు ఉంటాయి. ఏపీఎండీసీ అధికారులు తమ సొంతగూటికి వెళ్లిపోతున్నారు. రాజమహేంద్రవరంలో డీఎస్‌వో కార్యాలయం ఉంది. దీనిని కొత్త సంస్థ తీసుకునే అవకాశం ఉంది.  అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సుమారు 250 మంది పని చేస్తున్నారు. వారంతా ఇంటికి వెళ్లిపోవలసిందే. వారిలో కొంత మందిని కొత్త సంస్థ తీసుకుంటున్నట్టు కూడా సమాచారం ఉంది. ప్రస్తుతం 12వేల టన్నుల ఇసుకను వినియోగదారులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నారు. వారంతా డబ్బు చెల్లించారు.కానీ వారికి ఇసుక చేరలేదు. ఏపీఎండీసీ నుంచి కొత్త సంస్థకు ఇసుక వ్యాపారం వెళ్లడంతో ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న ఆర్డర్లన్నీ రద్దయినట్టే. ఆ సొమ్మును వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని ఏపీఎండీసీ అధికారులు చెప్తున్నారు. ఎన్ని రోజులకు పడుతుందో ఇంకా స్పష్టత లేదు.

జిల్లాలో చాలా కాలం నుంచి ఇసుక వ్యాపారం చేస్తున్న కాంట్రాక్టర్లందరికీ ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. కార్పొరేట్‌ సంస్థకు అప్పగించడంతో వారంతా తట్టాబుట్టా సర్దుకోవలసిందే. వీరిని ఇసుక ర్యాంపుల వైపు కూడా కన్నెత్తి చూడనిచ్చే పరిస్థితి లేదు. జిల్లాలో వందలాది మంది వ్యాపారులు ఉన్నారు. బిల్డర్లకు కూడా గతంలో ప్రభుత్వం ప్రత్యేక ర్యాంపులను ఇచ్చేది. ఇక అందరూ కొనుక్కోవలసిందే. పట్టా భూముల ఒప్పందాలన్నీ రద్దయ్యాయి. అనేక సొసైటీలు పడవల ద్వారా ఇసుక తీసేవి. ఇవాళ కొత్త సంస్థ పడవల ద్వారా తానే తీస్తుందో లేక సొసైటీలకు అప్పగిస్తుందో అనేదానిపై స్పష్టత వచ్చేసరికి కొంత సమయం పట్టవచ్చు.

 ప్రస్తుతం ఇసుక కొరత విపరీతంగా ఉంది. కొత్త సంస్థ శుక్రవారం నుంచి ఇసుక తవ్వకాలు మొదలెడుతుంది. ఇది పూర్తిగా వ్యాపార సంస్థ కాబట్టి కొరత ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎంత అమ్ముకుంటే అంత లాభం వస్తుంది. ర్యాంపుల వద్దే విక్రయాలు ఉంటాయి. సొంత వాహనల్లో వచ్చి  కొనుక్కోవచ్చు. అక్కడ ఏమైనా వాహనాలుంటే కిరాయికి కూడా మాట్లాడుకోవచ్చు. ఎవరు డబ్బు ఇస్తే వారికి ఇసుక కావలసినంత  ఉంటుంది. ఇంతవరకూ జిల్లాలో ఇసుక వ్యాపారులతో పాటు ఆయా ర్యాంపుల పరిధిలోని రాజకీయనేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు బాగా దండుకునేవారు. ఇక నుంచి అటువంటి అవకాశాలు ఉండవు. ఎంత లాభం ఉన్నా, కొత్త సంస్థకే దక్కుతుంది. ప్రస్తుతం ర్యాం పుల నిర్వాహకులకు,పట్టా భూముల లీజుదారులకు ఏపీ ఎండీసీ భారీ మొత్తంలోనే బిల్లుల బకాయి ఉంది. వారంతా వెంటనే బిల్లులు క్లియర్‌ చేయించుకోకపోతే సమస్యల్లో పడతారు.

Updated Date - 2021-05-14T07:00:56+05:30 IST