బకాయి బిల్లు కడితేనే బాడీ

ABN , First Publish Date - 2020-08-15T09:09:57+05:30 IST

బకాయి బిల్లు రూ. 8 లక్షలు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తాం అంటూ దాదాపు 40 గంటలపాటు ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి

బకాయి బిల్లు కడితేనే బాడీ

40 గంటలపాటు మృతదేహాన్ని  అప్పగించని కార్పొరేట్‌ ఆస్పత్రి

వైరల్‌ అయిన సమాచారం

క్రైస్తవ దళిత సంఘం సభ్యుల నిలదీత

దిగివచ్చిన యాజమాన్యం


రెజిమెంటల్‌బజార్‌, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): బకాయి బిల్లు రూ. 8 లక్షలు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తాం అంటూ దాదాపు 40 గంటలపాటు ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి మృతుడి కుటుంబ సభ్యులను ఒత్తిడి చేసింది. అప్పటికే రూ. 12 లక్షలు చెల్లించారు. మిగతా డబ్బు చెల్లించే పరిస్థితి లేదని చెప్పినా కనికరించలేదు. ఇదంతా సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం, క్రైస్తవ దళిత సంఘాల ప్రతినిధులు అక్కడికి  చేరుకోవడంతో మృతదేహాన్ని అప్పగించారు. సెక్యూరిటీ సంస్థలో పనిచేసే ముషీరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి(49)కి కరోనా సోకడంతో గతనెల 22వ తేదీన సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చేరాడు.


చికిత్స పొందుతూ ఈనెల 12వ తేదీ రాత్రి మృతి చెందాడు. రూ. 20 లక్షల బిల్లు వేయడంతో  ఇన్సూరెన్స్‌ ద్వారా రూ. 12 లక్షల చెల్లించారు. మిగతా డబ్బు చెల్లిస్తేనే మృతదేహాన్నిఅప్పగిస్తామని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. ఇంటిపెద్ద చనిపోయిన దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి ఏం చేయాలో తెలియలేదు. ఈ విషయం తెలిసి క్రైస్తవ సంఘం నాయకులు ఆస్పత్రికి వెళ్లి నిలదీశారు. ఆస్పత్రి యాజమాన్యం దిగివచ్చి.. ఈ విషయంతో తమ తప్పేమీ లేదని మృతుడి కుటుంబ సభ్యులతో లెటర్‌ రాయించుకుని మృతదేహాన్ని అప్పగించారు.  


డాక్టర్ల తప్పులేదు

కంపెనీ నిర్వాహకం వల్లనే మృతదేహం అప్పగించడంలో ఆలస్యం అయిందని మృతుడి సోదరి మీనా మీడియాకు వివరించారు. ఆస్పత్రి, వైద్యుల తప్పులేదని చెప్పింది. నిబంధనల ప్రకారం మృతదేహాన్ని అప్పగించడంలో ఆలసమైందని ఆమె తెలిపింది. 


ఆస్పత్రి యాజమాన్యం వివరణ 

సకాలంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు రాకపోవడంతో మృతదేహాన్ని అప్పగించడంలో జాప్యం అయిందని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. బకాయి చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని జరిగిన ప్రచారం వాస్తవం కాదన్నారు. అసత్య ఆరోపణలతో ప్రచారం జరిగిందని.. మృతుడి కుటుంబ సభ్యులు ఎవరూ ఆరోపణలు చేయలేదన్నారు. 


దళిత క్రైస్తవ సంఘాల జోక్యంతోనే..

దళిత క్రైస్తవ సంఘాలు, మీడియా ప్రతినిధుల జోక్యంతోనే ఆస్పత్రి వర్గాలు దిగి వచ్చి డబ్బు కట్టించుకోకుండా మృతదేహాన్ని అప్పగించారు. బిల్లు మాఫీ అయిందని కడుపులో ఉన్న బాధను అణుచుకుని బయటకు అంతా మంచే జరిగిందని సోదరితో చెప్పించారు. బాధితుల బంధువు అదే ఆస్పత్రిలో పనిచేస్తుండడంతో ఆమె భవిష్యత్‌ దృష్ట్యా వెనక్కి తగ్గాం.

- జెరూషలేం మత్తయ్య, క్రైస్తవ ధర్మ ప్రచార సమితి అధ్యక్షుడు

Updated Date - 2020-08-15T09:09:57+05:30 IST