త్వరలో పుర నగారా

ABN , First Publish Date - 2021-04-11T05:45:55+05:30 IST

త్వరలో పుర నగారా

త్వరలో పుర నగారా

ఖిల్లాపై గురిపెట్టిన రాజకీయ పార్టీలు

అభివృద్ధి వ్యూహంతో అధికారపక్షం దూకుడు

ఎన్నికల కార్యాచరణలో విపక్షాలు 

ఖమ్మం, ఏప్రిల్‌ 10(ప్రతినిధి): ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలకు నగారా మోగబోతోంది. నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాగర్‌ ఎన్నికలు ముగియగానే రాజకీయపార్టీలు ఖమ్మం కార్పొరేషన్‌పై దృష్టిపెట్టబోతున్నాయి. నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసే లక్ష్యంతో అధికారయంత్రాగం కూడా డివిజన్ల విభజన పూర్తిచేసింది. ప్రస్తుతం రిజర్వేషన్ల కేటాయింపుపై కసరత్తు జరుగుతోంది. ఖమ్మం కార్పొరేషన్‌లో గతంలో 50డివిజన్లు ఉండగా వాటిని 60కి పెంచారు. అయితే ఎన్నికలు మేనెల చివరలో కానీ జూన్‌ మొదటివారంలో ఉంటాయని తొలుత భావించినా పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రండుచోట్ల టీఆర్‌ఎస్‌ గెలవడం, బీజేపీ దూకుడు కొంత తగ్గడం వంటి పరిణామాలను అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అనుకూలంగా మలుచుకుంటోంది. ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్లతోపాటు పలుచోట్ల జరగాల్సిన మునిసిపాలిటీలకు త్వరితగతిన నోటిఫికేషన్‌ విడుదల చేసి ఈనెల 30లోగానే ఎన్నికలు జరిపించే ఆలోచనతో ఎన్నికల ప్రక్రియ వేగవంతం చేసింది. సాగర్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ముందే ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రయోజనం సాధించవచ్చని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఈ వ్యూహంతోనే ఇటీవల మంత్రి కేటీఆర్‌ను ఖమ్మం రప్పించి సుమారు రూ.400కోట్ల విలువైన అభివృద్ధి పనులను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభింపజేశారు.

విజయమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ కార్యాచరణ

ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ఇప్పటికే మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కార్యచరణ సిద్ధంచేశారు. ఈ క్రమంలో తాజామాజీ కార్పొరేటర్లలో ప్రజా వ్యతిరేకత ఉన్న వారిని పోటీకి దూరంగా ఉంచుతున్నారు. ఆయా నేతలు టికెట్లు ఆశించవద్దని స్పష్టంచేశారు. దీంతో  సగంమందికిపైగా టికెట్లు లభించే అవకాశంలేదు. గెలుపు అవకాశాలున్న వారి జాబితాను సర్వేల ద్వారా సిద్ధంచేశారు. అయితే రిజర్వేషన్ల ప్రక్రియలో జనాభా నిష్పత్తి ఆధారంగా ఎక్కడా ఏ వర్గానికి సీటు కేటాయింపు అవుతుందనే విషయం అనధికారికి సమాచారం ఉండడంతో దానికి అనుగుణంగా టీఆర్‌ఎస్‌ గెలుపు గుర్రాలను దించబోతోంది. గత కార్పొరేన్లలో 50డివిజన్లకు గాను టీఆర్‌ఎస్‌ 34గెలిచింది. కాంగ్రెస్‌ 10, సీపీఎం, సీపీఐ, వైసీపీలు రెండుచొప్పున ఆరుస్థానాలు గెలిచాయి. ఆ తర్వాత రాజకీయపరిణామాల్లో వైసీపీకి చెందిన ఇద్దరు, కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఖమ్మం కార్పొరేషన్‌లో తొలిపాలకవర్గం టీఆర్‌ఎస్‌జెండా ఎగురవేసి ఐదేళ్లపాలన ముగించింది. ఈసారి కూడా గతకంటే ఎక్కువస్థానాలు గెలిపించేందుకు మంత్రి పువ్వాడ పట్టుదలతో ఉన్నారు. టీఆర్‌ఎస్‌తో సీపీఐ మిత్రపక్షంగా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. గతంలో సిట్టింగ్‌ ఉన్న రెండుస్థానాలతో పాటు మరోస్థానం అదనంగా సీపీఐకి కేటాయించే అవకాశం ఉంది.

ఎన్నికల కార్యాచరణలో విపక్షాలు 

విపక్షాలు కూడా కార్పొరేషన్‌ ఎన్నికలకోసం కార్యచరణలోకి దిగాయి. ఖమ్మం బీజేపీ ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి చింతల రామచంద్రారెడ్డి ముఖ్యనాయులతో సమావేశం నిర్వహించారు. 60 డివిజన్లలో పోటీచేస్తామని ప్రకటించారు. అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. ఖమ్మంలో కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎం, కూటమిగా బరిలో దిగే అవకాశం ఉంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇప్పటికే ఖమ్మంలో కార్పొరేషన్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కమిటీలు ఏర్పాటుచేశారు. అన్నిడివిజన్లలో కేడర్‌ను సమాయత్తం చేశారు. అధికార టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు సీపీఎం, కాంగ్రెస్‌, టీడీపీ కూటమిగా బరిలో దిగితే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని భావిస్తున్నాయి. ఖమ్మంకార్పొరేషన్‌లో తాముకూడా పోటీచేస్తామని జనసేన ప్రకటించింది. మొత్తంమీద నెలాఖరులోగా కార్పొరేషనర్‌ ఎన్నికలు ఉంటాయన్న ప్రచారంతో అన్నీ రాజకీయపార్టీలు కార్పొరేషన్‌ ఎన్నికపై గురిపెట్టి కార్యక్రమాలు సాగిస్తున్నాయి. 


Updated Date - 2021-04-11T05:45:55+05:30 IST