కార్పొరేషన్‌ ఖాళీ..!

ABN , First Publish Date - 2021-05-18T05:28:51+05:30 IST

నగర పాలక సంస్థ ఖాళీగా దర్శనమిస్తోంది. అధికారుల్లో కొందరు ఇతర విధులతో బిజీ అయిపోగా.. మరికొందరు కరోనా బారినపడి సెలవులో వెళ్లారు.

కార్పొరేషన్‌ ఖాళీ..!
నగర పాలక సంస్థ కార్యాలయం

 నగరపాలక సంస్థలో పనులు నత్తన డక పెండింగ్‌లో ఫైళ్లు

కమిషనర్‌ ఉంటోంది రెండు గంటలే..

నోడల్‌ ఆఫీసర్‌ విధుల పేరుతో ఎక్కడో..

నెలరోజులుగా అదనపు కమిషనర్‌ సీటు ఖాళీ

విధులకు దూరంగా టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ

సెలవులో ఈఈ

మరో నెలలో రిటైర్‌ కానున్న ఎస్‌ఈ

ఎంహెచ్‌ఓకు వ్యాక్సినేషనే ఎక్కువ

ఎక్కువ విభాగాలకు డీసీకి కేటాయింపు


అనంతపురం కార్పొరేషన్‌, మే 17 : నగర పాలక సంస్థ ఖాళీగా దర్శనమిస్తోంది. అధికారుల్లో కొందరు ఇతర విధులతో బిజీ అయిపోగా.. మరికొందరు కరోనా బారినపడి సెలవులో వెళ్లారు. దీంతో పనులు ముందుకు కదలడం లేదు. ఫైళ్లు పేరుకుపోతున్నాయి. పాలకవర్గం ఏర్పడినా... ప్రభుత్వ పనులకు సంబంధించి ఏం జరగాలన్నా కిందిస్థాయి ఉద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు కీలకమవుతారు. అంటే పాలన అధికారుల పరిధిలో అధికారికంగానే జరగాలి. అనంతపురం కార్పొరేషన్‌లో ప్రస్తుత పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని చెప్పాలి. ఇదివరకట్లా పనులు వేగంగా జరగడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి కరోనా మహమ్మారే ప్రధాన కారణమైతే.. పలు నిర్ణయాలు కూడా కార్పొరేషన్‌కు ఇబ్బంది తెచ్చిపెట్టాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మురికికాలువ (సీసీ  డ్రెయిన్‌) సమస్య మొదలుకుని, ప్రధాన సమస్యల పరిష్కారం వరకు నగర కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తిదే తుది నిర్ణయం. ఎక్కువకాలం పనిచేసిన అనుభవమున్న ఆయన ఇప్పుడు కార్పొరేషన్‌ కార్యాలయంలో ఎక్కువ సమయం గడపడం లేదట. కారణం ఆయనను కరోనాకు సంబంధించి నోడల్‌ ఆఫీసర్‌గా నియమించడమే. ఆ తరువాత స్థానమైన అదనపు కమిషనర్‌ సీటు నెలరోజులుగా ఖాళీగానే ఉంది. కీలక విభాగమైన ఇంజనీరింగ్‌లో సుదీర్ఘ అనుభవమున్న ఓ అధికారి కరోనాతో విధులకు దూరంగా ఉన్నారు. టౌన్‌ప్లానింగ్‌లో అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ (ఏసీపీ) నెలరోజులుగా విధులకు దూరంగా ఉన్నారు. మరికొంతమంది కరోనాతో విధులకు హాజరు కావడం లేదు. డిప్యూటీ  కమిషనర్‌కు ఎక్కువ విభాగాల పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. వీటన్నింటి ప్రభావంతోనే పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఫైళ్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. ఇలా ప్రస్తుతం వివిధ రకాల సమస్యలతో నగరపాలక సంస్థ కొట్టుమిట్టాడుతోంది.


ఆయన ఉండేది రెండు గంటలే...

క్షేత్రస్థాయిలో తిరగకపోతే ఎక్కువ సమయం కార్పొరేషన్‌ కార్యాలయంలో గడిపే కమిషనర్‌ ఈ మధ్య సరిగా ఉండట్లేదు. సెలవులు తక్కువ తీసుకునే ఈయన ప్రస్తుతం రోజుకు కార్యాలయంలో రెండు గంటలు మాత్రమే గడుపుతున్నారట. నోడల్‌ ఆఫీసర్‌గా నియమించినప్పటి నుంచి ఆస్పత్రుల్లోనే ఎక్కువ సమయం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఉదయం 6 నుంచి 10.30 గంటల వరకు గడుపుతారు. కొంత గ్యాప్‌ తీసుకుని, మళ్లీ ఆస్పత్రిలోనే మధ్యాహ్నం 1.30 గంట వరకు మకాం. మళ్లీ 4.30 నుంచి 5.30 గంటల వరకు కార్పొరేషన్‌ కార్యాలయంలో, ఆ తరువాత రాత్రి 8.30 గంటల వరకు ఆసుపత్రిలో.. అక్కడి నుంచి మళ్లీ కార్పొరేషన్‌ కార్యాలయం. వీధిలైట్లు, తాగునీటి సరఫరా, అభివృద్ధి పనులు, పారిశుధ్యం, ఇలా అన్నింటినీ పరిశీలించాల్సిన కమిషనర్‌ కేవలం ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేయడం, ప్రధాన విషయాలు ఆరా తీయడంతోనే సరిపోతోంది. ఆస్పత్రిలో సైతం ఉన్నతాధికారులు అదనంగా సిబ్బందిని ఉంచాలని చెబుతారట, ఆస్పత్రి వాళ్లు తమ వాళ్లే ఉంటారని చెబుతారట. రెండు పనులతో కమిషనర్‌ తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలిసింది. నాలుగు రోజుల క్రితం ఆయనకు బీపీ బాగా పెరిగినట్లు సమాచారం. మరో వైపు ఆయన ఆఫీ్‌సకు తక్కువగా వస్తుండటంతో కొందరు అలసత్వం చూపుతున్నట్లు తెలుస్తోంది.


ఏసీపీ సుబ్బారావు ఎక్కడ...?

నగరపాలక సంస్థలో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే మరో విభాగం టౌన్‌ప్లానింగ్‌. ఇక్కడ ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న సుబ్బారావు నెలరోజులుగా అందుబాటులో లేరు. తొలుత రెండువారాలపాటు కరోనా సోకిందని హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పారట. ఆ తరువాత తన సమీప బంధువు మృతి చెందడంతో వెళ్లారని కార్పొరేషన్‌ వర్గాలంటున్నాయి. ఇప్పటికి ఆయన అందుబాటులోలేక నెలరోజులవుతోంది. ఆయన పరిధిలో పలు ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఆయన సంతకం చేస్తేగానీ అవి ముందుకు కదలవు. తాజాగా అదే విభాగంలో బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సూర్యనారాయణ కరోనాతో నాలుగు రోజులుగా విధులకు రావడం లేదు. 


ఇంజనీరింగ్‌దీ అదే పరిస్థితి..

కార్పొరేషన్‌ పరిధిలో అభివృద్ధి పనులకు సంబంధించి కీలక విభాగం ఇంజనీరింగ్‌. ఇక్కడ అనుభవమున్న ఈఈ నాగమోహన్‌ అనారోగ్య కారణంతో సెలవులో ఉన్నారు. మరో ఈఈ శేషసాయి బదిలీ కావడంతో రామమోహన్‌రెడ్డిని నియమించారు. కొత్తగా వచ్చిన సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ) రమేష్‌ జూన్‌ నెలాఖరులో ఉద్యోగ విరమణ చెందనున్నారు. ఆయన ఇక్కడ పరిస్థితి అర్థం కావాలంటేనే రెండునెలలైనా పడుతుంది. అలాంటి కీలకపోస్టుకు సంబంధించి ఆ యనను ఇక్కడకు ఈ సమయంలో నియమించడమేంటో...? ఓ డీఈ, మరో ఏఈ కూడా అనారోగ్యం, కరోనా కారణంగా సెలవులోనే ఉన్నా రు. ఈ క్రమంలో ఆఫీ్‌సకు సంబంధించిన ఫైళ్ల కదలికలో ఆలస్యమవుతోంది. ఇంజనీరింగ్‌ ఉన్నతాధికారులు కొత్తవారు కావడంలో పను లు కూడా నత్తనడకన సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.


నెలరోజులగా ఆ ప్రధాన సీటు ఖాళీ..

కమిషనర్‌ తరువాత కార్పొరేషన్‌ వ్యవహారాలు చూడాల్సిన బాధ్యత అదనపు కమిసనర్‌దే. ఆ సీటు నెలరోజులుగా ఖాళీగా ఉంది. ఇంకా ఎవరినీ నియమించలేదు. ఇదివరకు కేవలం రెవెన్యూ విభాగం మాత్రమే చూడాల్సిన డిప్యూటీ కమిషనర్‌ రమణారెడ్డికి సచివాలయాలు, పారిశుధ్యం తదితర విభాగాలు అప్పగించారు. సెక్రటరీ శ్రీనివాసులు తనకు అప్పగించిన పనులతోనే సరిపోతోంది. పారిశుధ్యం పర్యవేక్షించాల్సిన ఎంహెచ్‌ఓ రాజే్‌షకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియకే సమయం సరిపోవడం లేదట. మిగిలిన అధికారులు ఆయా విభాగాలకే పరిమితమవుతున్నారు. తాజాగా రెవె న్యూ విభాగానికి చెందిన ఓ అధికారి సెలవులోకి వెళ్లారు. మరికొందరు  సిబ్బందికి కరో నా సోకింది. సచివాలయాల్లో 40 మందికిపైగా కరోనా బారిన పడ్డారు. ఇప్పటికైనా కార్పొరేషన్‌ కార్యాలయంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే పనుల ఆలస్యంతో అభివృద్ధి దేవుడెరుగు... ప్రజల సమస్యలు కూడా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉండిపోయే ప్రమాదముంది.


Updated Date - 2021-05-18T05:28:51+05:30 IST