కాలనీ సంఘాలలో ‘కార్పొరేటర్ల పెత్తనం’..!

ABN , First Publish Date - 2021-05-10T05:26:16+05:30 IST

ప్రజా ప్రతినిధులు, కాలనీల సంక్షేమ సంఘం నాయకులు సమన్వయంతో కలిసి పనిచేసి అభివృద్ధి చేయాలి. కానీ, మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పరిస్థితి అందుకు విరుద్దం. ఇక్కడ కాలనీ సంక్షేమ సంఘాల సొంత వ్యవహరాల్లోనూ కొందరు కార్పొరేటర్లు పెత్తనం చెలాయిస్తూ, అన్ని విషయాలూ తమకు చెప్పాలంటూ హుకుం జారీ చేస్తున్నారు.

కాలనీ సంఘాలలో ‘కార్పొరేటర్ల పెత్తనం’..!

 పలు డివిజన్లలో మహిళా కార్పొరేటర్‌ల భర్తల ఆధిపత్యం

  కరోనా కాలంలోనూ పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తం

సరూర్‌నగర్‌, మే 9 (ఆంధ్రజోతి): ప్రజా ప్రతినిధులు, కాలనీల సంక్షేమ సంఘం నాయకులు సమన్వయంతో కలిసి పనిచేసి అభివృద్ధి చేయాలి. కానీ, మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పరిస్థితి అందుకు విరుద్దం. ఇక్కడ కాలనీ సంక్షేమ సంఘాల సొంత వ్యవహరాల్లోనూ కొందరు కార్పొరేటర్లు పెత్తనం చెలాయిస్తూ, అన్ని విషయాలూ తమకు చెప్పాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. పలు డివిజన్లలో మహిళా కార్పొరేటర్ల భర్తలు సంక్షేమ సంఘాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నట్టు తెలిసింది. ఇన్నాళ్లూ స్వతంత్రంగా వ్యవహరించి ప్రజాప్రతినిధుల సహకారంతో పలు అభివృద్ధి పనులు చేయించుకున్న కాలనీ సంక్షేమ సంఘాలు.. ప్రస్తుతం ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి. తమ అంతర్గత విషయాలు(కాలనీ/అపార్ట్‌మెంట్‌ నిర్వహణ కోసం వసూలు చేసే డబ్బుల విషయం వగైరా) సైతం చెప్పాలంటూ తమపై ఒత్తిడి తేవడం ఎంత వరకు సమంజసమని వారు వాపోతున్నారు. ఇదే విషయాన్ని జనప్రియ మహానగర్‌లోని పలు బ్లాకులకు చెందిన ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సబితారెడ్డి దృష్టికి సైతం తీసుకువెళ్లినట్టు తెలిసింది.

సమావేశాలకు ఆహ్వానించాల్సిందే..

సాధారణంగా ఏ కాలనీలోనైనా నెలకోసారిగానీ, వారికి అనుకూలమైన సమయంలోగానీ సంక్షేమ సంఘం సమావేశం ఏర్పాటు చేసుకుని కాలనీలోని సమస్యలు, అప్పటి వరకు చేసిన అభివృద్ధి, చేపట్టాల్సిన పనులు, నిర్వహణ ఖర్చుల తదితర విషయాలపై చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రధాన సమస్యలు ఉంటే స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్తుంటారు. అయితే మీర్‌పేట్‌లోని ఒక చోట కాలనీ అసోసియేషన్ల సమావేశాలకు సైతం తమను పిలవాల్సిందేనంటూ కార్పొరేటర్లు హుకుం జారీ చేస్తున్నట్టు తెలిసింది. నిర్వహణ నిమిత్తం చేసిన వసూళ్లు, ఖర్చుల వివరాలు కూడా తమ ముందుంచాలని బెదిరిస్తున్నట్టు సమాచారం. కాగా మహిళా కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లలో వారి భర్తలు సదరు ‘డ్యూటీ’ చేస్తున్నట్టు తెలిసింది. దాంతో ఏం చేయాలో తోచక సంక్షేమ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.

‘జనప్రియ’లో పెరిగిపోతున్న జోక్యం..

జనప్రియ మహానగర్‌ అపార్ట్‌మెంట్లలో కార్పొరేటర్ల జోక్యం ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. ఇక్కడ బ్లాకుల వారీగా అసోసియేషన్లు ఉంటాయి. బ్లాకుల్లోని లిఫ్ట్‌, వాచ్‌మన్‌, పారిశుధ్య నిర్వహణ వంటి వాటి కోసం ఒక్కో ప్లాటు నుంచి కొంత మొత్తాన్ని నిర్వహణ ఖర్చుల కింద వసూలు చేస్తుంటారు. ఇలా వసూలైన మొత్తానికి సంబంధించిన లెక్కలు అసోసియేషన్‌ సమావేశంలో చర్చించుకుని తీర్మానం చేసి బ్లాకు నోటీసు బోర్డులో పెడుతుంటారు. ఇక్కడి ఓ బ్లాకుకు చెందిన ప్రతినిధి ఒకరు అధ్యక్ష, కార్యదర్శులకు, ఇతర ప్రతినిధులకు చెప్పకుండానే వసూలు చేసి, ఖర్చుల వివరాలు వారికి చెప్పకుండానే నోటీసు బోర్డుపై పెట్టినట్టు సమాచారం. ఈ విషయమై అధ్యక్ష, కార్యదర్శులు సదరు ప్రతినిధిని ప్రశ్నించగా, తనకు కార్పొరేటర్‌(భర్త) అండదండలు ఉన్నాయని, ఏం చేస్తారో చేసుకోండంటూ వారిని బెదిరించినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని సదరు బ్లాకు ప్రతినిధులు ఇటీవల మంత్రి సబితారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆమె తాను మాట్లాడతానని చెప్పి పంపించినట్టు సమాచారం. ఏ బ్లాకులో సమావేశం జరిగినా, ఎలాంటి మీటింగైనా తమకు చెప్పాల్సిందేనని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఓ కార్పొరేటర్‌ భర్త తీవ్ర స్థాయిలో బెదిరించినట్టు తెలిసింది. వసూలు చేసిన డబ్బు వివరాలు చెప్పకపోవడంతో పారిశుద్య సిబ్బందిని పనులు చేయడానికి రాకుండా అడ్డుకుంటున్నట్టు సమాచారం. దాంతో జనప్రియ మహానగర్‌లోని పలు బ్లాకుల పరిసరాలు చెత్తాచెదారంతో అధ్వానంగా తయారయ్యాయని స్థానికులు వాపోతున్నారు. పలు డివిజన్లలో కార్పొరేటర్లు, ఇంకొన్ని డివిజన్లలో మహిళా కార్పొరేటర్ల భర్తల పెత్తనం కారణంగా అభివృద్ధి కుంటుపడుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-05-10T05:26:16+05:30 IST