దోచెయ్‌!

ABN , First Publish Date - 2021-10-26T06:31:07+05:30 IST

నగరపాలక సంస్థలో కొందరు కార్పొరేటర్లు వసూళ్లపర్వానికి తెరలేపారు. అవినీతికి ఆలవాలమైన టౌనప్లానింగ్‌ విభాగానికి సంబంధించిన అక్రమ కట్టడాలపై వీరు ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు సమాచారం.

దోచెయ్‌!

అక్రమ ఆదాయం కోసం కార్పొరేటర్ల పాకులాట

నగరపాలక సంస్థలో కొందరి కాసుల కక్కుర్తి

అక్రమ కట్టడాల విషయంలో జోక్యం

ఉత్తుత్తి పనులకే బిల్లులు

కొందరికే నామినేషన వర్క్‌లు

పూడికతీత పనుల్లో వ్యవహారం

ఎమ్మెల్యే, మేయర్‌పైనా ఒత్తిళ్లు

అనంతపురం కార్పొరేషన, అక్టోబరు25: నగరపాలక సంస్థలో కొందరు కార్పొరేటర్లు వసూళ్లపర్వానికి తెరలేపారు. అవినీతికి ఆలవాలమైన టౌనప్లానింగ్‌ విభాగానికి సంబంధించిన అక్రమ కట్టడాలపై వీరు ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. ప్రజాప్రతినిధిగా గెలిచి ఏడాది కూడా కాకముందే వాటాల కోసం పాకులాడటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. గత పాలకవర్గంలో సైతం అక్రమ భవనాలు, పింఛన్లు, తమ డివిజనలో చేసిన పనులకు కమీషన్లు ఇలా ఇష్టారాజ్యంగా కార్పొరేటర్లు వసూళ్లకు పాల్పడ్డారు. ప్రస్తుతం అదే తరహాలో కొందరు కార్పొరేటర్లు ఇలాంటి వ్యవహారాలకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే అక్రమ భవనాల విషయంలో ప్లానింగ్‌ సెక్రటరీలపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు సమాచారం. కొందరు ఇంజనీరింగ్‌ అధికారులతో కుమ్మక్కై తూతూమంత్రంగా చేసిన పనులకు సైతం బిల్లులు పెట్టేసుకుంటున్నారు. అవసరమైతే కొన్ని సందర్భాల్లో అధికారులకు ఆ విధమైన ఆదేశాలివ్వాలని ఎమ్మెల్యే, మేయర్‌పై కూడా ఒత్తిళ్లు తెస్తున్నట్లు తెలిసింది.


మా వాటా ఎంత...?

నగరంలో అక్రమ కట్టడాలు నిత్యకృత్యంగా మారాయి. అలాంటి వాటి విషయంలో సెట్‌బ్యాక్స్‌ లేవనీ, రోడ్డుపై వచ్చి కట్టారనీ, ఎలా అనుమతులిచ్చారని ప్రశ్నిస్తారట. ఆ తరువాత తమ (కార్పొరేటర్ల)ను కలవాలని చెప్తారట. తమ వాటా తమకు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. నగరంలోని గుల్జార్‌పేట ప్రాంతంలో గతంలో ఎప్పుడో నిర్మించిన సీసీ డ్రెయినపై ఓ భవనం నిర్మించినట్లు ఓ కార్పొరేటర్‌ దృష్టికొచ్చింది. వెంటనే ఆయన కొడుకు.. ఆ భవన యజమానిపై ఒత్తిడి తెచ్చాడట. ప్లానింగ్‌ సెక్రటరీతో నిబంధనల పేరు చెప్పి మరీ అడిగించి రూ.లక్ష డిమాండ్‌ చేయగా.. అంత ఇచ్చుకోలేమని రూ.50వేలు పంపినట్లు సమాచారం. ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా నిర్మించిన ఓ భవనంపై మరో కార్పొరేటర్‌ కన్ను పడింది. ఇలా అడ్డదిడ్డంగా కడితే ఎలా అని నిలదీశాడట. రూ.లక్షల్లో డిమాండ్‌ చేసినట్లు సమాచారం. ఇప్పటికే టౌనప్లానింగ్‌ అధికారులకు రూ.5 లక్షలు ఇచ్చామనీ, రూ.75వేలతో సరిపెట్టుకోవాలని ఆ మొత్తం పంపినట్లు తెలిసింది. సాయినగర్‌ ప్రధాన రహదారిలో (ఆరో క్రాస్‌కు ఎదురుగా) నూతనంగా పాత భవనం దెబ్బతినడంతో మళ్లీ కడుతున్నారు. మాస్టర్‌ ప్లాన ప్రకారం రోడ్డుకు ఖాళీ వదిలి భవనం నిర్మించాలి. అదే రోడ్డులో జడ్పీ ఆధ్వర్యంలో నిర్మించిన దుకాణాలు సైతం వెనుకగా నిర్మించారు. ఓ కార్పొరేటర్‌  సమీప బంధువులమని చెప్పి యథేచ్ఛగా ఎలాంటి గ్యాప్‌ లేకుండా నిర్మించే స్తున్నారు. అశోక్‌నగర్‌, జీస్‌సనగర్‌, సాయినగర్‌ పరిధిలోనే వైసీపీ నేతల పేర్లు చెప్పి, నాలుగు భవనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు. విద్యుతనగర్‌ సర్కిల్‌ పరిధిలోకి వచ్చే ఓ కార్పొరేటర్‌ తన పరిధిలో కొత్త భవనం నిర్మిస్తే చాలట.. వెంటనే వసూళ్లకు తెరలేపుతున్నట్లు సమాచారం. కొందరు కార్పొరేటర్లు నేరుగా ప్లానింగ్‌ సెక్రటరీల ద్వారానే వాటాల కోసం ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. రెండు నెలల క్రితం వార్డు అడ్మినపై దాడి చేసిన విషయంలో సైతం అక్రమ కట్టడాల విషయంలో డబ్బు తీసుకురావడం లేదనే కార్పొరేటర్‌ కుమారుడు దాడి చేశాడనే ఆరోపణలు వినిపించాయి.


పూడికతీత పనుల్లో కక్కుర్తి

తూతూమంత్రంగా పనులు చేయించి, బిల్లులు పెట్టుకోవడం నగరపాలక సంస్థలో పరిపాటిగా మారింది. కొందరు కార్పొరేటర్లు, కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా బిల్లులు పెట్టేస్తున్నారు. తమకు అనుకూలమైన వారికి నామినేషన వర్క్‌లు కేటాయించి, మరీ సొమ్ము చేసుకుంటున్నారు. పూడికతీత పనుల్లో సైతం కక్కుర్తి పడుతున్నారు. నెలరోజుల క్రితం నగరపాలక సంస్థ పరిధిలో పూడికతీత పనులు చేపట్టారు. అశోక్‌నగర్‌ బ్రిడ్జి సమీపంలో ఇద్దరు డీఈలు వేర్వేరేగా రూ.5 లక్షల వరకు నామినేషన వర్క్‌తో పూడికతీత పని చేయించారు. ఇక్కడ కార్పొరేటర్లను వాడుకున్నట్లు సమాచారం. ఆ పని వద్దే కనిపించని ఓ కాంట్రాక్టర్‌ పేరుతో బిల్లు పెట్టేయడం గమనార్హం. ఓ డీఈ రూ.3లక్షలు, మరో డీఈ రూ.2 లక్షలకు ఈ వర్క్‌ చేయించినట్లు తెలిసింది. టెండర్‌ కూడా పిలవకుండా నామినేషన పేరుతో చేయించడంలో ఆ ఇంజనీర్ల అత్యుత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. మరువవంకలో ఐరనబ్రిడ్జి పరిధిలో రూ.9.95 లక్షలతో టెండరు పిలిచారు. పూడిక తీయడానికి ఎక్స్‌కవేటర్‌కు గంటకు రూ.2500 అద్దె చెల్లించాలి. రోజుకు 15 గంటలపాటు పనిచేస్తే 37,500 అవుతుంది. ఆ మేరకు ఐదురోజులు పూడికతీత పనులు చేయించినట్లు సమాచారం. ఐదురోజులనుకుంటే రూ.1.87 లక్షలవుతుంది. ఇక ఆ పూడికను తొలగించడానికి టిప్పర్‌కు రూ.6000 చొప్పున ఖర్చు చేసినట్లు తెలిసింది. అంటే అది కూడా ఐదురోజులకు అంటే మొత్తం రూ.3 లక్షల కంటే ఎక్కువ కాదు. ఏకంగా రూ.9.95లక్షలకు బిల్లు పెట్టేయడం విమర్శలకు తావిస్తోంది. ఇక్కడ కాంట్రాక్టర్‌తోపాటు అధికార పార్టీకి చెందిన ఓ కీలక కార్పొరేటర్‌ భాగస్వామి అయినట్లు సమాచారం. చేసిన పనులకే బిల్లులు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే ఇలా చేయని పనులకూ బిల్లులు పెట్టుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Updated Date - 2021-10-26T06:31:07+05:30 IST