సరైన తీర్పు

ABN , First Publish Date - 2021-11-27T08:04:53+05:30 IST

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసానికి సంబంధించి మద్రాస్ హైకోర్టు వెలువరించిన తీర్పు విశేషమైనది. పోయెస్‌గార్డెన్‌ను స్మారక స్థలంగా మార్చుతూ గత అన్నాడీఎంకె ప్రభుత్వం జారీచేసిన ...

సరైన తీర్పు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసానికి సంబంధించి మద్రాస్ హైకోర్టు వెలువరించిన తీర్పు విశేషమైనది. పోయెస్‌గార్డెన్‌ను స్మారక స్థలంగా మార్చుతూ గత అన్నాడీఎంకె ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. ఈ ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి ఏ హక్కూ లేదనీ, స్మారకంగా మార్చడం వెనుక ప్రజాప్రయోజనాలు లేవనీ కోర్టు నొక్కివక్కాణించింది. మూడువారాల్లోగా వేదనిలయం తాళాలను జయలలిత వారసులైన దీప, దీపక్ లకు అందజేయాలన్న ఈ తీర్పు రాజకీయ ప్రభావం కూడా విస్తృతమైనదే. 


జయలలిత వారసులుగా తమను న్యాయస్థానం గుర్తించినందున, ఆమె నివాసాన్ని ప్రభుత్వం ఎలా స్వాధీనం చేసుకుంటుందని దీప, దీపక్ లు కోర్టులో పిటిషన్ వేశారు. పన్నీరు-పళని ప్రభుత్వం తీసుకున్న ఈ హడావుడి నిర్ణయం వెనుక వేగంగా మారుతున్న అప్పటి రాజకీయపరిణామాలు కారణమని తెలిసిందే. జయలలితకు అత్యంత సన్నిహితురాలూ, ఈ ఉభయులకూ అనంతరకాలంలో శత్రువుగా మారిన శశికళ చేతుల్లోకి వేదనిలయం పోతుందేమోనన్న భయంతో కరోనా లాక్‌డౌన్ కాలంలో 2020 మే నెలలో ఒక ఆర్డినెన్సు ద్వారా తమిళనాడు ప్రభుత్వం ముఖ్యమంత్రి పళనిస్వామి చైర్మన్‌గా ఉన్న జయలలిత మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోకి దీనిని తెచ్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందు నిమిత్తం 67కోట్ల రూపాయలు కోర్టులో డిపాజిట్ చేసింది కూడా. బెంగుళూరు జైలునుంచి వచ్చిన శశికళ ఈ భవనంలో కూర్చుని రాజకీయం చేసే అవకాశాలు ఏ మాత్రం ఇవ్వకూడదన్నది లక్ష్యం. ఈ భవనాన్ని జయలలిత తల్లి నటి సంధ్య కొనుగోలు చేసిన విషయం దీప, దీపక్‌లు న్యాయస్థానానికి గుర్తుచేశారు. శశికళ మేనల్లుడైన సుధాకరన్‌ను జయలలిత దత్తపుత్రుడుగా స్వీకరించిన తరువాత జయలలితకు వీరు దూరమైనారు. శశికళ కుటుంబంతో దీపక్‌కు కాస్త సాన్నిహిత్యం ఉన్నందున ఇప్పుడు మద్రాస్ హైకోర్టు తీర్పుతో వారసుల చేతికి వచ్చిన వేదనిలయాన్ని శశికళ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో స్వాధీనం చేసుకోవచ్చునని కొందరి అనుమానం. ఈ భవనం కేవలం జయనివాసమే కాదు, అధికార కేంద్రం కూడా. శశికళను జయలలిత కొంతకాలం దూరం పెట్టిన విషయాన్ని అటుంచితే, ఇరువురూ దశాబ్దాలుగా కలసివున్నదీ, కష్టసుఖాలు పంచుకున్నదీ, రాజ్యం చేసింది ఇక్కడనుంచే. చెన్నయ్ మెరీనా బీచ్‌లో ఇప్పటికే 80కోట్ల మేరకు ఖర్చుచేసిన జయలలిత భారీ స్మారకం ఎలాగూ ఉన్నప్పుడు, అతికొద్దిదూరంలోనే మరొకటి ఎందుకని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. జనం సొమ్మును కాస్తంత జాగ్రత్తగా ఖర్చుపెడుతూండండి అని హితవు చెబుతూ, రాజ్యం ఆస్తిపాస్తులు రాజువేనని భావించే గతకాలపు రోజులు గతించాయనీ, అవి ప్రజలవన్న విషయం ఇప్పటి పాలకులు గుర్తుపెట్టుకోవాలని జస్టిస్ ఎన్.శేషసాయి వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్‌ను తమ నిర్ణయానికి ఆదర్శంగా అన్నాడీఎంకె ప్రభుత్వం చూపడాన్ని న్యాయమూర్తి చక్కని వ్యాఖ్యలతో తిప్పికొట్టారు. గాంధీ, ఆయన సమకాలికుల స్మారకాలు రాబోయే తరాలకు సైతం ఎలా స్ఫూర్తినిస్తాయో చెబుతూ, ఈ రెండింటి మధ్యా పోలిక ఏయే కారణాలవల్ల సరైనదో కాదో వివరించారు. జయలలితకు విస్తృతమైన ప్రజాదరణ ఉన్నదనీ, ఆమె ఎన్నో ఉచిత పథకాలతో ప్రజలను ఆదుకున్నారనీ ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో, వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ప్రజల సంక్షేమం చూడటం ప్రభుత్వాల విధికాదా అని న్యాయస్థానం ప్రశ్నించింది. వృత్తిపరంగా సాధించిన విజయాలు, కూడగట్టుకున్న చరిష్మా, సదరు నేతపై ఆయా పార్టీలకు ఉన్న ఆరాధనాభావం ఇత్యాదివి మెమోరియల్ ఏర్పాటుకు ప్రాతిపదికలు కాబోవనీ, ఏదైనా ప్రైవేటు ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే, ప్రజోపయోగమే దాని పరమార్థం కావాలని న్యాయమూర్తి అన్నారు. ఒక నాయకుడి విలువ సాపేక్షమై, అందరికీ కాక కొందరికే పరిమితమైనప్పుడు సదరు స్మారకాలు వారి అనుచరగణానికి సంబంధించినవే అవుతాయి కానీ, విస్తృత ప్రజానీకానివి కావని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 


ప్రజల సొమ్ము రాళ్ళపాలవుతుంటే ధృతరాష్ట్ర పాత్ర వహించలేమంటూ మద్రాస్ హైకోర్టు వెలువరించిన ఈ ఘాటైన తీర్పు ఇష్టారాజ్యంగా వ్యవహరించే నాయకులకు బలమైన హెచ్చరిక. 

Updated Date - 2021-11-27T08:04:53+05:30 IST