కరోనా పరీక్షలపై దాగుడుమూతలు

ABN , First Publish Date - 2020-04-07T11:45:42+05:30 IST

కరోనా లక్షణాలతో ఛాతీ ఆస్పత్రికి వెళుతున్న..

కరోనా పరీక్షలపై  దాగుడుమూతలు

ఐసోలేషన్‌కు.. క్వారంటైన్‌కు వక్రభాష్యాలు

వేల సంఖ్యలో పడకలు ఎవరి కోసం?

నమూనాలు సేకరించి... ఇంటికి పంపుతున్న వైనం

గాజువాక కేసుతో బండారం బట్టబయలు

ఎవరూ నోరు విప్పవద్దని ఉన్నతాధికారుల ఆంక్షలు

మీడియాకు కూడా సమాచారం అరకొరే 

ప్రశ్నలకు సమాధానాలు చెప్పే నాథుడే లేడు


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం):  విశాఖ జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో అధికారుల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వాస్తవాలను దాయడానికి యత్నిస్తున్నారనే విషయం ప్రజలకు అర్థమవుతోంది. కొందరు అధికారులు కింది స్థాయి వారికి బాధ్యతలు అప్పగించడమే తమ బాధ్యత అన్నట్టు వ్యవహరిస్తూ పర్యవేక్షణను గాలికి వదిలేస్తున్నారు. కొన్ని అంశాలపై స్పష్టమైన ఆరోపణలు, విమర్శలు వస్తున్నా... వాటిని సరిదిద్దే యత్నం చేయకుండా... అవి అలాగే వుంటాయంటూ సమాధానాలు ఇస్తున్నారు.


కరోనా లక్షణాలతో ఛాతీ ఆస్పత్రికి వెళుతున్న వారి పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారంటూ వారం రోజులుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ పారిశుధ్యం సరిగా లేదని, మంచి ఆహారం ఇవ్వడం లేదని, పాజిటివ్‌ కేసులతో కలిపి అనుమానితులను ఒకే దగ్గర వుంచుతున్నారంటూ బాధితులు ఆరోపిస్తుంటే... జిల్లా ఉన్నతాధికారి ఒకరు వాటిని విలేకరుల సమావేశంలో తోసిపుచ్చారు. అది కరోనా ఆస్పత్రి కాదని, సాధారణ టీబీ ఆస్పత్రి అని, అక్కడ వసతులు అలాగే ఉంటాయని సమర్థించుకున్నారు. అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ సత్యవతి  ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఛాతీ ఆస్పత్రి గురించి మాట్లాడుతూ, అక్కడ సరైన వసతులు లేవని, అందరినీ వార్డుల్లో కాకుండా ఐసోలేషన్‌ క్యూబికల్స్‌ (తెరల ఏర్పాటు ద్వారా)లో పెట్టాలని సూచించారు. దానిని ఇప్పటివరకు పరిగణనలోకి తీసుకోలేదు.


ఇక అసలు విషయానికి వస్తే... గాజువాక కుంచమాంబ కాలనీలో మాంసం విక్రయించే వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపిస్తే...ఈ నెల 2న ఛాతీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అతడి నుంచి నమూనాలు సేకరించి నిర్లక్ష్యంగా అతడిని ఇంటికి పంపించేశారు. అతడికి కోవిడ్‌-19 వుందని సోమవారం నిర్ధారణ అయింది. దాంతో హడావిడిగా అధికారులు కుంచమాంబ కాలనీకి వెళ్లి అతడిని తిరిగి ఛాతీ ఆస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డుకు తీసుకువెళ్లారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే...కరోనా లక్షణాలతో ఎవరైనా వస్తే...వారి నుంచి నమూనాలు సేకరించి, నివేదిక వచ్చేంత వరకు ఐసోలేషన్‌ వార్డులోనో, క్వారంటైన్‌ సెంటర్‌లోనో ఉంచాలి. ఈలోగా లక్షణాలను బట్టి చికిత్స అందించాలి. అదే నెగెటివ్‌ వస్తే జాగ్రత్తలు చెప్పి ఇంటికి పంపించాలి. కానీ గాజువాక యువకుడి నుంచి నమూనాలు సేకరించిన అనంతరం హోమ్‌ క్వారంటైన్‌ అని చెప్పి పంపించేశారు.


ఆ విషయాన్ని కనీసం సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఫలానా వ్యక్తి... ఫలానా డోర్‌ నంబరులో హోమ్‌ క్వారంటైన్‌ చేశామని చెబితే...జీవీఎంసీ సిబ్బంది ఆ ఇంటికి రోజూ వెళ్లి పరిశీలిస్తారు. ఇక్కడ ఈ రెండూ జరగలేదు. ఆస్పత్రిలో క్వారంటైన్‌ చేయలేదు. హోమ్‌ క్వారంటైన్‌పై స్థానిక సిబ్బందికి సమాచారం లేదు. దాంతో ఆ యువకుడు యథా ప్రకారం తన మాంసం వ్యాపారం చేసుకున్నాడు. ఆదివారం అతడి దుకాణంలో వందల మంది మాంసం కొన్నారు. అతడు మాంసం పెట్టి ఇచ్చిన కవర్లను ఇళ్లకు తీసుకువెళ్లారు. దీనివల్ల ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. ఇంకో 14 రోజులు ఆగితే గానీ ఏ విషయం బయటపడదు. ఈ ఘటనకు అధికారుల బాధ్యతారాహిత్యమే కారణం. 


ఎవరి కోసం వేల పడకలు?

జిల్లా కలెక్టర్‌ రోజూ ఐసోలేషన్‌ పడకల గురించి, క్వారంటైన్‌ పడకల గురించి  లెక్కలు చెబుతున్నారు. రోగ లక్షణాలతో వచ్చిన వారిని చేర్చుకోకుండా ఇళ్లకు పంపేస్తుంటే...ఆ పడకలన్నీ ఎవరి కోసం సిద్ధం చేసినట్టు? విశాఖలో ఐసోలేషన్‌ పడకలు 4,434 వున్నాయని, అలాగే క్వారంటైన్‌ పడకలు 5,502 ఉన్నాయని రోజూ ప్రకటన విడుదల చేస్తున్నారు. రోజుకు 50 మందికి మించి పరీక్షలకు రావడం లేదు. వారి నుంచి నమూనాలు సేకరించామని గొప్పగా చెప్పుకుంటున్న అధికారులు...వార్డుల్లో ఎందుకు వుంచడం లేదనేది ఇప్పుడు ప్రశ్న. అక్కడ వార్డులు నిర్వహించడానికి డబ్బులు లేవు. ఉన్నా ఖర్చు చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు. వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందికి సరైన రక్షణ పరికరాలు ఇవ్వడం లేదు. కనీసం మాస్కులు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో యంత్రాంగం ఉంది. ఈ వాస్తవాలను అంగీకరించడం లేదు. అన్నీ సరిపడినన్ని వున్నాయని  చెబుతున్నారు. నిజంగా వుంటే వాటిని వైద్య సిబ్బందికి ఎందుకు పంపిణీ చేయడం లేదో చెప్పాలి. 


ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికే క్వారంటైన్‌

విశాఖ జిల్లాలో ఎలమంచిలి, నర్సీపట్నం, గాజువాక వికాస్‌ కాలేజీ, రైల్వే ఆస్పత్రిలో 121 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. వాస్తవానికి వీరికి ఎవరికీ కరోనా లక్షణాలు లేవు. వీరంతా ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. వారిలో ఏమైనా లక్షణాలు వుంటాయేమోననే ఉద్దేశంతో ఆయా కేంద్రాల్లో ఉంచారు. వీరికి ఎవరికీ పరీక్షలు కూడా చేయలేదని సమాచారం.


ఐసోలేషన్‌లో కేవలం 36 మందే

కరోనా అనుమానంతో పరీక్షలు చేసిన వారిని ఐసోలేషన్‌ వార్డుల్లో వుంచితే వారి సంఖ్య వందల్లో ఉండేది. కానీ వారి నిర్వహణ బాధ్యత కష్టమనే ఉద్దేశంతో ఇంటికి పంపేస్తున్నారు. అదే ప్రమాదానికి కారణమవుతోంది. అలా వచ్చిన వారిలో పాజిటివ్‌ ఉన్నవారు కొందరు..అది గుర్తించేలోపే మరికొందరికి వైరస్‌ను అంటిస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా అనుసరిస్తున్న వైఖరి వల్ల విశాఖ నగర ప్రజలకు పెనుప్రమాదం ముంచుకువస్తోంది. వెంటనే దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం చాలా ఉంది. మంగళవారం నుంచి అనుమానంతో నమూనాలు సేకరించిన వారిని నివేదిక వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోను బయటకు పంపకూడదు. ఇది కచ్చితంగా అమలు చేయకుంటే... రాబోయే రోజుల్లో ఏం జరిగినా అందుకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.


Updated Date - 2020-04-07T11:45:42+05:30 IST