మత్స్యశాఖలో అవినీతి చేపలు

ABN , First Publish Date - 2021-08-04T08:18:59+05:30 IST

ఉభయ గోదావరి జిల్లాల మత్స్యశాఖ పరిధిలో అవినీతి తిమింగలాలు చెలరేగాయి. ఈ శాఖ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను కొల్లగొట్టాయి. ఇప్పటివరకు ప్రాథమిక విచారణలోనే ఏడు కోట్లు మాయం చేసినట్టు తేలింది.

మత్స్యశాఖలో అవినీతి చేపలు

గోదావరి జిల్లాల్లో భారీ కుంభకోణం

ఫిక్సిడ్‌ డిపాజిట్లు రూ.ఏడు కోట్లు గల్లంతు

ఉన్నతస్థాయి అధికారుల సంతకాలు ఫోర్జరీ

కిందిస్థాయి ఉద్యోగులకు బహుమానాల ఎర

పోలీసులకు ఫిర్యాదు, శాఖాపరమైన విచారణ


(ఏలూరు-ఆంధ్రజ్యోతి): ఉభయ గోదావరి జిల్లాల మత్స్యశాఖ పరిధిలో అవినీతి తిమింగలాలు చెలరేగాయి. ఈ శాఖ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను  కొల్లగొట్టాయి. ఇప్పటివరకు ప్రాథమిక విచారణలోనే ఏడు కోట్లు మాయం చేసినట్టు తేలింది. ఉన్నతాధికారుల సంతకాల ఫోర్జరీ ద్వారా గత మూడున్నరేళ్లుగా ఇష్టానుసారంగా వ్యవహరించి, కోట్ల రూపాయల కుంభకోణానికి తెరతీశారు.  శాఖాపరమైన ఆడిట్లో తూర్పు గోదావరిలో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఆ తరువాత తీగ లాగితే పశ్చిమానికీ పాకింది.


ఏం జరిగింది? 

ఉభయ గోదావరి జిల్లాల్లోని మత్స్యశాఖలోని ఓ  కీలక అధికారి ఈ అవినీతి పర్వానికి తెరలేపారు. శాఖాపరంగా లభించే ఆదాయాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తారు. చెరువులకు అనుమతులు, ల్యాబ్‌ల నిర్వహణకు, మెయింటినెన్సుకు వీలుగా వచ్చిన సొమ్మును డిపాజిట్‌ చేస్తారు. ఈ సొమ్ముపై వచ్చిన వడ్డీని శాఖ నిర్వహణకు వీలుగా వాడుకోవాలి. ఒకసారి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసిన తరువాత ఆ సొమ్మును కమిషనర్‌ అనుమతి లేకుండా వినియోగించకూడదు. రూ.50 వేల లోపు నిర్వహణ ఖర్చులను మత్స్యశాఖ జేడీ, ఏడీ పరిధిలో వాడుకోవచ్చు. అంతకంటే ఎక్కువ అవసరమైతే జిల్లా కలెక్టర్‌ అనుమతి తీసుకోవాలి. అంతకు మించి అవసరమైతే మత్స్యశాఖ కమిషనరేట్‌ అనుమతి అత్యవసరం. కానీ కొన్నాళ్ల క్రితం ఇదే శాఖలో పనిచేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఉద్యోగి.. తూర్పు గోదావరి ఏడీ కార్యాలయానికి బదిలీ అయ్యారు.


లొసుగులను కనిపెట్టి నలుగురిని కలుపుకొని భారీ కుంభకోణానికి తెరతీశారు. ఒక్క తూర్పు గోదావరి జిల్లా పరిధిలోనే దాదాపు రూ.రెండు కోట్లకుపైగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఆరగింజేశారు. మూడో కంటికి తెలియకుండా ఉన్నతస్థాయి అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి మరీ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఆడిట్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు సంబంధించి అవకతవకలను గుర్తించారు. దీని వెనుక సూత్రధారులు, పాత్రధారులు ఎవరనేది ఆరా తీశారు. నాలుగు నెలల క్రితమే ఈ బాగోతం బయటపడగా అప్పట్లో అక్కడ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు కారణమంటూ అనుమానించి ఆ మేరకు దృష్టి పెట్టారు. అప్పటికే సదరు ఉద్యోగి మత్స్యశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ హోదాలో తూర్పు నుంచి పశ్చిమ గోదావరికి బదిలీ అయ్యారు.  


తేలిగ్గా తీసుకున్నారు

మూడున్నరేళ్లుగా ఈ తంతు సాగుతున్నా బయటకు పొక్కకపోవడంతో బ్యాంకుల పాత్రపైనా సందేహాలు న్నా యి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల దారి మళ్లించి, అక్రమంగా వాడుకుంటున్నా బ్యాంకర్లు నిరోధించలేకపోయారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పులో రూ.2కోట్లు, పశ్చిమలో రూ.4.12కోట్లు అవకతవకలకు పాల్పడినట్టు తేల్చారు.


‘పశ్చిమ’లో 4.12 కోట్ల అవకతవకలు 

నాగలింగాచార్యులు, జెడీ మత్స్యశాఖ 

ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే రూ.4.12కోట్లు అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏలూరు పోలీసులకు ఫిర్యాదుచేశాం. ఇంతకుముందే ఈ వ్యవహారం ఆడిట్‌లో వెలుగుచూసింది. దీనిపై శాఖా పరమైన విచారణా కొనసాగుతోంది. ఏడీ స్థాయి ఉద్యోగి ఒకరు ఈ అవకతవకలకు పాల్పడ్డారనే కోణంలో విచారణ కొనసాగుతోంది.


విచారణ సాగుతోంది జేడీ బీఆర్‌ అంబేడ్కర్‌

మత్స్యశాఖలో డిపాజిట్లు గల్లంతుపై శాఖాపరమైన విచారణ సాగుతోంది. ఎంత మొత్తంలో అవకతవకలు జరిగాయి. కారకులు ఎవరనే దానిపై సంబంధిత అధికారులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసు దర్యాప్తు పూర్తయితే ఎంత మొత్తం గల్లంతైంది తేలనుంది. 


ఇక్కడా రెండింతల అవినీతి

తూర్పులో చేతివాటం ప్రదర్శించిన సదరు ఉద్యోగికి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఉద్యోగి భర్త సహకరించారనే అనుమానాలు ఉన్నాయి. తూర్పు గోదావరిలో రెండు కోట్ల అవకతవకలు జరగ్గా.. ఇక్కడ ఏకంగా నాలుగు కోట్లకు పైగా కుంభకోణం జరిగింది. దీని వెనుక అనేక మంది హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా దిగువ స్థాయి ఉద్యోగులందరికీ ‘బహుమానాలు’ పంచారు. ‘ఇది అందరి సొమ్ము నా ఒక్కడి సొంతం కాదు. నాలుగు రాళ్లు వస్తే మూడు రాళ్లు మీకే పంచి పెడతాం. ఇదిగో మీ కావాల్సింది తీసుకోండి. మీ అవసరాలకు సరిపెట్టుకోండి’ అంటూ సదరు అధికారి కిందస్థాయి అధికారులకు గీతోపదేశం చేశావారట. ఈ మధ్యనే ఆయన కరోనాతో కన్నుమూశారు. 

Updated Date - 2021-08-04T08:18:59+05:30 IST