అవినీతి ఊట

ABN , First Publish Date - 2020-07-08T10:13:06+05:30 IST

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఊట పారుతోంది. పలు కార్యాలయాల్లో పైసా లేకుండా పనులు ముందుకు సాగడంలేదు.

అవినీతి ఊట

ఇష్టారాజ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు

‘పైసా’ లేనిదే ముందుకు సాగని పనులు

ఏసీబీ ఆశ్రయిస్తున్న బాధితులు 

వరుస దాడులతో అవినీతిపరుల్లో దడ


ఇల్లెందు, జూలై 7: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఊట పారుతోంది. పలు కార్యాలయాల్లో పైసా లేకుండా పనులు ముందుకు సాగడంలేదు. దాంతో పలువురు బాధితులు  ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపధ్యంలో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇల్లెందు ప్రాంతంలో వివిద ప్రభుత్వ శాఖల అధికారులు కాంట్రాక్టర్ల నుంచి వివిధ పనుల కోసం వచ్చే వారి నుంచి పెద్ద మొత్తాల్లో డబ్బులు దండుకుంటుండటంతో బాధితులు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయిస్తుండటం, ఏసీబీ దాడుల్లో పలువురు అధికారులు చిక్కుతుండటంతో అవినీతి అఽధికారులు హడలిపోతున్నారు. కొద్ది నెలల క్రితమే మున్సిపాలిటీలో రెండుసార్లు జరిగిన ఏసీబీ దాడుల్లో ఇద్దరు అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. సోమవారం ఇల్లెందు పట్టణంలోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో ఏఈ నవీన్‌కుమార్‌ గుండ్ల రమేష్‌ అనే క్లాస్‌-5 కాంట్రాక్టర్‌ నుంచి రూ.1.20లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటం సంచలనం కలిగించింది. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు కాంట్రాక్టర్ల నుంచి పెద్ద మొత్లాల్లో డబ్బులు వసూలు చేయడం, వివిధ స్థాయిల్లో అఽధికార, అనధికారులకు వాటాలుగా పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


అయితే లంచాలు ఇవ్వలేక అవేదన చెందుతున్న వారు అఽధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఒక్కరిద్దరు మాత్రమే ధైర్యంగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు చేస్తుండటంతో అవినీతి అక్రమాలు మూడు కాంట్రాక్టులు, ఆరు కాసులుగా వర్ధిల్లుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో నీటి పారుదల, గిరిజన సంక్షేమం, మున్సిపాలిటీ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ శాఖల్లో పని చేస్తున్న వివిఽధ స్థాయిల అఽధికారులపై అవినీతి నిరోధక శాఖకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంట్రాక్టర్ల బిల్లులు క్లియరెన్స్‌లు మొదలుకోని విత్తనాల అమ్మకాల వరకు ఇటీవల కాలంలో ఇల్లెందు ఏజేన్సీ ప్రాంతాల్లో అవినీతి పెచ్చుమీరిందన్న ప్రచారం సాగుతోంది. వివిఽధ స్థాయిల అధికార, అనధికారులకు భారీ మొత్తాల్లో పర్సంటెజీలు, కమీషన్లు ముట్టజెపుతూ నాణ్యత లేమితో పనులు చేయాల్సి వస్తుందని కొందరు కాంట్రాక్టర్లు బాహటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.   


లంచగొండుల సమాచారం ఇవ్వండి .. ఏసీబీ డీఎస్పీ మధుసూధన్‌

ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు లంచాల కోసం డిమాండ్‌ చేసినా, ఒత్తిడి చేసినా తమకు ఫిర్యాదు చేయాలని అవినీతి నిరోదక శాఖ (ఏసీబీ) వరంగల్‌ రేంజ్‌ డీఎస్పీ మధుసూధన్‌ వెల్లడించారు. తమకు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రభుత్వ శాఖల అధికారులు డబ్బుల కోసం ఒత్తిడి చేస్తే 9440446146కు కాల్‌ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. అంతేగాక ఏసీబీ టోల్‌ ప్రీ నెంబర్‌ 1064కు ఫోన్‌ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-07-08T10:13:06+05:30 IST