ఆయనపై లెక్కలేనన్ని ఆరోపణలు.. రైల్వే పరువు పోతున్నా..

ABN , First Publish Date - 2021-09-13T06:34:44+05:30 IST

బెజవాడ రైల్వే..

ఆయనపై లెక్కలేనన్ని ఆరోపణలు.. రైల్వే పరువు పోతున్నా..

అక్రమాలకు పచ్చజెండా!

రైల్వే కమర్షియల్లో అవినీతి మేట! 

అక్రమ మద్యం, గోల్డ్‌ స్మగ్లింగ్‌లో ఉద్యోగుల పాత్ర 

ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి అందలం 

మజ్దూర్‌ సంఘ నేతపై లెక్కలేనన్ని ఆరోపణలు 

సూత్రధారుడేనని భావిస్తున్న పోలీసులు 

రైల్వే పరువు పోతున్నా పట్టించుకోని అధికారులు 

ఉన్నతాధికారుల పాత్రపైనా సందేహాలు


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): బెజవాడ రైల్వే కమర్షియల్‌ విభాగంలో అవినీతి మేటలు వేస్తోంది. నిన్న మద్యం.. నేడు బంగారం.. అక్రమ రవాణాకు ఈ విభాగంలోని రన్నింగ్‌ స్టాఫ్‌ ద్వారాలు తెరిచారా? ఇందుకు బాధ్యులెవరు? అనే ప్రశ్నలకు అన్ని వేళ్లూ ఈ విభాగంవైపే చూపిస్తున్నాయి. రన్నింగ్‌ స్టాఫ్‌లో కొందరు తమ ఉద్యోగాలను అడ్డంపెట్టుకుని సొంత వ్యాపారాలను నడపడం సంచలనం సృష్టిస్తోంది. వేతనాల మీద ఆధారపడిన ఉద్యోగులు బంగారం కొనేందుకు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకు వచ్చి వెచ్చిస్తున్నారు? అవినీతికి పాల్పడే వారి సంగతి తెలిసి కూడా ఉన్నతాధికారులు ఎందుకు ఉపేక్షిస్తున్నారు? పైగా ఇలాంటి వారికి టార్గెట్స్‌ నిర్దేశించటంలోని ఔచిత్యమేమిటి? కేసులు ఉన్న వారిని అందలం ఎక్కించడం, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఉపేక్షించటంలోని మతలబు ఏమిటి? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. 


రైల్వే కమర్షియల్‌ విభాగంలో పనిచేస్తున్న రన్నింగ్‌ స్టాఫ్‌ మాఫియా శక్తులకు సహకరిస్తున్నారనే ఆరోపణ వినిపిస్తోంది. కొద్ది నెలల క్రితం రైళ్లలో తెలంగాణ మధ్యం అక్రమ రవాణాలో రన్నింగ్‌ స్టాఫ్‌ కీలకపాత్ర పోషించారన్నది వెలుగు చూసింది. తాజాగా గోల్డ్‌ స్మగ్లింగ్‌ వ్యవహారం కూడా అంతే స్థాయిలో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో రన్నింగ్‌ స్టాఫ్‌లో అనేక మంది పాత్ర వెలుగులోకి వచ్చింది. వీరిలో కొందరు బాధితులు కూడా ఉన్నారు. బాధితుల ముసుగులో పాత్రధారులూ ఉన్నారు. నాగమణి అనే మహిళ ద్వారా తక్కువ ధరకు బంగారం వస్తుందని చెప్పటానికి ముందుగా తాము పెట్టుబడులు పెట్టి, అనేక మంది రన్నింగ్‌ స్టాఫ్‌ ద్వారా పెట్టుబడులు పెట్టించారు. ఈ వ్యవహారంలో రైల్వే మజ్దూర్‌ సంఘ్‌ డివిజనల్‌ నేత కూడా ఉన్నారు.


దీనిని సెటిల్‌ చేయటానికి ప్రయత్నించిన ఆయన ఆసుపత్రిలో ఉండగా, పోలీసుల విచారణలో తాను కూడా బాధితుడినేనని చెప్పటం కొసమెరుపు. ఈ వ్యవహారంలో పాతిక మంది వరకు ఉద్యోగులు బాధితులుగా ఉన్నారు. కొందరు పాత్రధారులుగానూ ఉన్నారు. తక్కువ ధరకు బంగారం వస్తుందని చెబితే నమ్మి, ఆశతో లక్షలకు లక్షలు చెల్లించారు. అది మొత్తం కోట్లకు చేరుకుంది. కమర్షియల్‌ డిపార్ట్‌మెంట్‌ పరిధిలో పనిచేసే సీటీఐ, టీటీఐ, టీఐలు వేతనాల మీద ఆధారపడి జీవించేవారే. వారు బంగారం కోసం లక్షలాది రూపాయలను పెట్టుబడులుగా ఎలా పెట్టారన్నది అంతుబట్టని విషయం.


టికెట్‌ లేని ప్రయాణమే వీరి ఆదాయమార్గం

రైల్వే టికెట్‌ స్క్వాడ్‌‌కు సంబంధించిన వారి విధి టికెట్‌ లేకుండా ప్రయాణించే వారిపై దృష్టి సారించటం, అన్‌ రిజర్వ్‌డ్‌ ప్రయాణికులను నియంత్రించటం. అయితే తనిఖీల సమయంలో అన్‌ రిజర్వ్‌డ్‌ ప్రయాణికుల నుంచి అంతో, ఇంతో వసూళ్లు చేసి, చూసీచూడనట్టు వ్యవహరించటం వీరికి పరిపాటిగా మారిపోయింది. డబ్బులు తీసుకుని రిజర్వ్‌డ్‌ బోగీల్లోకి టికెట్‌ లేని వారిని అనుమతించటం కూడా జరుగుతోంది. ఇవన్నీ వీరికి ఆదాయ వనరులుగా మారాయి. ఇటువంటి కొందరికి జీతం కంటే ఈ పక్క ఆదాయమే ఎక్కువగా ఉంటుందన్నది వాస్తవం. ఈ అక్రమ సంపాదనే బంగారానికి పెట్టుబడులు పెట్టడానికి కారణమైంది. ఇలా తక్కువ ధరకు కొన్న బంగారాన్ని ఎక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకోవాలన్నదే వీరి ఆలోచనగా కనిపిస్తోంది. 


అక్రమార్కులకు ఆదాయ టార్గెట్లు! 

రన్నింగ్‌ స్టాఫ్‌ శ్రేణిలో స్క్వాడ్‌ టీమ్స్‌ అక్రమ సంపాదన వ్యవహారాలు కమర్షియల్‌ విభాగాధికారులకు కూడా తెలుసు. తనిఖీల సందర్భంగా స్క్వాడ్‌ టీమ్స్‌కు ఆదాయ టార్గెట్స్‌ విధించడం ద్వారా ఈ వ్యవహారాన్ని కూడా సొమ్ము చేసుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. రైళ్లలో అక్రమ ప్రయాణాలను నిరోధించే క్రమంలో ఆదాయం కోసం జరిమానాల రూపంలో టార్గెట్లు నిర్దేశించటంలోని ఆంతర్యం ఏమిటో రైల్వే అధికారులకే తెలియాలి. స్క్వాడ్‌ టీమ్స్‌ అవినీతికి పాల్పడకుండా విజిలెన్స్‌ తనిఖీలు చేయించాల్సిన రైల్వే అధికారులు ఇలా టార్గెట్లు నిర్దేశించటంతో.. అవినీతికి రెడ్‌ కార్పెట్‌ పరిచినట్టు అయింది. టార్గెట్లు వరకు వసూలు చేసి సంస్థకు ఇచ్చి, మిగిలినది తమ జేబుల్లో వేసుకోవటం వారికి పరిపాటిగా మారుతోంది. 


కేసులున్న వారికి అందలాలు! 

కమర్షియల్‌ విభాగంలో అవినీతి పరులను, ఆరోపణలు ఎదుర్కొనేవారిని అందలాలు ఎక్కించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. గోల్డ్‌ స్కామ్‌లో సూత్రధారిగా అనుమానిస్తున్న రైల్వే మజ్దూర్‌ సంఘ్‌ నేత రాఘవేంద్రరావుపై పోలీసులు దృష్టి సారించిన క్రమంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయన్నది తెలుస్తోంది. రాఘవేంద్రరావు 2008లో యాసిడ్‌ దాడి కేసులో ఉన్నాడు. ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. యాసిడ్‌ దాడి కేసుకు సంబంధించి రైల్వేలో అంతర్గత విచారణ జరిపి, అతనికి చార్జిషీట్‌ ఇచ్చి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఉన్నతాధికారులు ఇప్పటి వరకు అంతర్గత విచారణను పూర్తి చేయలేదు. దీనిని బట్టి ఉన్నత స్థాయిలో కూడా సహాయ సహకారాలు అందుతున్నాయన్నది తెలుస్తోంది. కమర్షియల్‌ విభాగంలో నల్ల అనే అటెండర్‌ కూడా గోల్డ్‌  స్కామ్‌లో ఇరుక్కున్నాడు. ఆయన చేసేది అటెండర్‌ ఉద్యోగమే అయినా, రైళ్లలో ప్రయాణికులను ఎక్కించటం ద్వారా బాగా వెనకేసుకున్నట్టు పోలీసులు గుర్తించినట్టు సమాచారం.

 

అక్రమాదాయం కోసం పోస్టింగ్‌ మార్పించుకుని..

మజ్దూర్‌ సంఘ్‌ నేత రాఘవేంద్రరావు టీటీ కాగా, ఉన్నతాధికారుల అండదండలతో స్క్వాడ్‌ టీమ్‌కు మార్పించుకోవడం కొసమెరుపు. ఈయనపై కేసు నడుస్తున్న దశలోనే మూడు ప్రమోషన్లు అందుకోవటం గమనార్హం. కేసులు కొనసాగుతున్నప్పుడు ప్రమోషన్లు ఇవ్వకూడదు. ఎలా ఇన్ని ప్రమోషన్లు ఇచ్చారన్నది ఉన్నతాధికారులకే ఎరుక.  రాఘవేంద్రరావు తన ఉద్యోగానికి సంబంధించిన సమర్పించిన విద్యార్హతల ధ్రువపత్రాలపై కూడా వివాదం నెలకొంది. ఆయన రైల్వే స్కూల్‌లో చదివారు. కేబీఎన్‌లో ఇంటర్‌ చదివారు. రైల్వేకు మాత్రం, ఢిల్లీ ఓపెన్‌ స్కూల్‌లో చదివినట్టు సర్టిఫికెట్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇలా చేయటం వల్ల ఆయన ఉద్యోగ విరమణకు మరికొంత సమయం అందివచ్చినట్టు అయింది.


ఇవన్నీ రైల్వే అధికారులకు తెలియవనుకోవాలా? స్పోర్ట్స్‌ కోటాలో ముఖ్యంగా కబడ్డీ కేటగిరీలో ఉద్యోగాన్ని పొందిన ఈ నేత, అథ్లెటిక్‌ అసోసియేషన్‌ నేతగా వ్యవహరించటం మరో విశేషం. రైల్వే ఉద్యోగి అథ్లెటిక్‌ అసోసియేషన్‌లలో పనిచేయకూడదు. ఉన్నతాధికారుల అనుమతి మేరకు ఒకసారి పనిచేయవచ్చు. కానీ దఫాలుగా పనిచేయటం ఆయనకే చెల్లింది. ఇలా ఒక నేత మీదే ఇన్ని ఆరోపణలు ఉన్నా కూడా రైల్వే అధికారులు చర్యలు తీసుకోకపోగా.. కార్మిక సంఘ నేతగా కమర్షియల్‌ విభాగంలో ఆయన చెప్పిన వారికి అధికారులు బదిలీలు చేయటం, పదోన్నతులు కల్పించటం వంటివి కూడా చేస్తున్నారు.


చర్యలు శూన్యం  

కొందరి అవినీతి బాహాటంగానే తెలిసినా చర్యలు తీసుకోకపోవడం, ఆరోపణలు వచ్చిన వారికి పెద్ద పీట వేయటం, అంతర్గత విచారణలు జరపకపోవటంపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. రైల్వే విజిలెన్స్‌, నిఘా బృందాలు ఈ వ్యవహారాలపై దృష్టి సారిస్తే అనేక విషయాలు వెలుగులోకి వ చ్చే అవకాశం ఉంటుంది. గోల్డ్‌ స్కీమ్‌ వ్యవహారంతో అయినా అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగుతారో, లేదో చూడాల్సిందే.

Updated Date - 2021-09-13T06:34:44+05:30 IST