ఏపీలో అవినీతి కంపు

ABN , First Publish Date - 2021-08-13T17:03:13+05:30 IST

నంద్యాల సబ్‌ రిజిష్ట్రార్ కార్యాలయంలో చలానాల అవినీతి వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులపై వేటు పడింది.

ఏపీలో అవినీతి కంపు

కర్నూలు జిల్లా: నంద్యాల సబ్‌ రిజిష్ట్రార్ కార్యాలయంలో చలానాల అవినీతి వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులపై వేటు పడింది. ఉన్నతాధికారులు వారిని సస్పెండ్‌ చేస్తూ  ఉత్తర్వులను జారీ చేశారు. సబ్‌ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలకు అధికారులు స్పందించారు. ఐదు రోజులుగా జిల్లాలోని పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. నంద్యాల సబ్‌ రిజిష్ట్రార్ కార్యాలయంలో 54 డాక్యుమెంట్లలో రూ.7.39 లక్షలు గోల్‌మాల్‌ జరిగిందని రెండు రోజుల క్రితం వెల్లడైంది. చలానాల ద్వారా ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాలను ఫొటో ఎడిట్‌ ద్వారా మార్ఫింగ్‌ చేసి డాక్యుమెంట్లను రిజిష్టర్ చేయించినట్లు బట్టబయలైంది. ఈ వ్యవహారంలో నలుగురు స్టాంప్‌ రైటర్ల హస్తం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వ్యత్యాస సొమ్ము రూ.7,39,590 స్టాంప్‌ రైటర్ల నుంచి రికవరీ చేసి వారికి సహకరించిన అధికారులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. నంద్యాల సబ్‌ రిజిష్ట్రార్ సోఫియాబేగం, జూనియర్‌ అసిస్టెంట్‌ వీరన్నను సస్పెండ్‌ చేస్తూ రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అవినీతి వ్యవహారంలో మరో ఇద్దరు ఉద్యోగులపై రెండు, మూడు రోజుల్లో వేటు పడే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా నలుగురు స్టాంప్‌ రైటర్లపై క్రిమినల్‌ కేసుల నమోదుకు ఉన్నతాధికారులు నంద్యాల డిస్ట్రిక్ట్‌ రిజిష్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. స్టాంప్‌ రైటర్లు ఫైరోజ్‌, షేక్‌ అస్లాం బాషా, షేక్‌ మహమ్మద్‌ ఆరిఫ్‌, షేక్‌ మునీర్‌బాషాలపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. 

Updated Date - 2021-08-13T17:03:13+05:30 IST