జిల్లా ఆసుపత్రిలో అవినీతి రోగం

ABN , First Publish Date - 2020-10-13T06:17:37+05:30 IST

జాతీయ స్థాయిలో నాణ్యాతాప్రమాణాల అవార్డును కైవసం చేసుకున్న ఖమ్మం జిల్లా ఆసుపత్రిలోని కొందరు కిందిస్థాయిలోని

జిల్లా ఆసుపత్రిలో అవినీతి రోగం

రూ.1500 ఇస్తేనే బిడ్డ చేతికి

కరోనా సమయంలో పెరిగిన అమ్యామ్యాలు

నిరుపేదలకు భారంగా మారుతున్న కాన్పులు


ఖమ్మం సంక్షేమవిభాగం, అక్టోబరు 12: జాతీయ స్థాయిలో నాణ్యాతాప్రమాణాల అవార్డును కైవసం చేసుకున్న ఖమ్మం జిల్లా ఆసుపత్రిలోని కొందరు కిందిస్థాయిలోని ఉద్యోగులు లంచాల కోసం పీడిస్తున్నారు. కరోనా ప్రభావంతో కాన్పుల సంఖ్య తగ్గటంతో వచ్చిన వారి నుంచే క్యాష్‌ చేసుకుంటున్నారు. జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు విభాగంలో నిత్యం 30వరకు కాన్పులు జరుగుతాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో కాన్పులు సంఖ్య గణనీయంగా తగ్గింది. కరోనా వైరస్‌ వ్యాప్తికి ముందు మాతా శిశువిభాగంలో శిశువు జన్మించగానే నిర్ణీత మొత్తంలో కిందిస్థాయి ఉద్యోగులు డబ్బులు డిమాండ్‌ చేశారని బహిరంగా విమర్శలు ఉన్నాయి. ఆడశిశువుకు రూ.500, మగ శిశువుకు రూ.1,000 చొప్పున వసూళ్లు జరిగాయి. అయితే ఈ అమ్యామ్యాలను కరోనా సమయంలో రూ. 1500లకు పెంచి జలగల్లా పీడిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయం  జిల్లా ఆసుపత్రిలో డాక్టర్ల నుంచి ప్రతి అధికారికి తెలిసిన బహిరంగ రహస్యమే. కాన్పుల విభాగంలో పనిచేసే కొంతమంది కిందిస్థాయి ఉద్యోగులు నెలకు రూ.2లక్షల వరకు ఆదాయం వస్తోందనే చర్చ జరుగుతోంది. ఆసుపత్రి అధికారులకు ఎంతో సన్నిహితంగా ఉండే వారికి మాత్రమే కాన్పుల విభాగంలో విధులు కేటాయిస్తారనే విమర్శలున్నాయి.


రూ.1,500 ఇస్తేనే బిడ్డ చేతికి

జిల్లా ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో కరోనా వైరస్‌ ప్రభావంతో కాన్పులు సంఖ్య గణనీయంగా తగ్గింది. రోజుకు 8నుంచి 10 కాన్పులు జరుగుతున్నాయి. దీంతో కాన్పుల విభాగంలో విధులు నిర్వహించే ఉద్యోగులకు అవినీతి డబ్బులు తగ్గాయి. దీంతో వారు ఽఅవినీతి ధరలను సైతం పెంచారు. ఆడ శిశువుగా గతంలో తీసుకున్న రూ.500లను ఏకంగా రూ.1,500లు చేశారు. ఇక మగ శిశువుగా గతంలో తీసుకున్న రూ.1,000కి మరో రూ.వెయ్యి కలిపి రూ.2,000 వసూలు చేస్తున్నారు. ఈ విషయంపై ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలన జరపగా ఖమ్మం రూరల్‌ మండలానికి చెందిన ఓ మహిళ ఆదివారం సాధారణ కాన్పు జరిగి ఆడ శిశువుకు జన్మనివ్వగా రూ.1,500 తీసుకున్నట్టు శిశువు బంఽధువులు పేర్కొన్నారు. ఇన్ని డబ్బులు ఎందుకని ప్రశ్నించిన బంధువులకు శిశువు పుట్టగానే ఉమ్మనీరు తాగిందని , బాక్స్‌లో పెట్టామని మరీ డబ్బులు వసూళ్లు చేశారు. కరోనా కష్టసమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేదలు కాన్పుల కోసం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వస్తే ఇలా శిశువు అప్పగింతకు డబ్బులు వసూళ్లు చేయటంపై విమర్శలు వెలువడుతున్నాయి. కలెక్టర్‌ కర్ణన్‌ పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి జిల్లా ఆసుపత్రి అవినీతి రోగం కుదర్చాలని ప్రజలు కోరుతుతున్నారు.


విచారణ నిర్వహిస్తాం..డాక్టర్‌ బొల్లికొండ శ్రీనివాసరావు, ఆర్‌ఎంవో, జిల్లా ఆసుపత్రి

గర్భిణిగా నమోదు నుంచి శిశువు జన్మించి ఇంటికి వెళ్లే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వైద్యసేవలు, కేసీఆర్‌ కిట్‌, ప్రోత్సహకాలను అందజేస్తోంది. మాతాశిశు విభాగంలో శిశువులు అప్పగింతకు డబ్బులు తీసుకున్న విషయం మా దృష్టికి రాలేదు. పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2020-10-13T06:17:37+05:30 IST