Advertisement
Advertisement
Abn logo
Advertisement

అవినీతిని ఉపేక్షించకూడదు

  • అవినీతిపరులపై సత్వర చర్యలు తీసుకోవాలి
  • అన్ని స్థాయిల్లో జవాబుదారీతనం తేవాలి
  • సత్ప్రవర్తన కోసం విలువలతో కూడిన శిక్షణ అవసరం: ఉప రాష్ట్రపతి 


న్యూఢిల్లీ, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): అవినీతికి పాల్పడిన అధికారులను, ప్రజాప్రతినిధులను ఉపేక్షించరాదని, వారిపై సత్వర చర్యలు తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. కేంద్ర కేబినెట్‌ మాజీ కార్యదర్శి ప్రభాత్‌ కుమార్‌ రచించిన ‘పబ్లిక్‌ సర్వీస్‌ ఎథిక్స్‌- ఏ క్వెస్ట్‌ ఫర్‌ నైతిక్‌ భారత్‌’  పుస్తకాన్ని వెంకయ్య ఆదివారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిపాలన అన్ని స్థాయిల్లో సంపూర్ణమైన పారదర్శకత, జవాబుదారీతనం అవలంబించాలని సూచించారు.  ప్రజాస్వామ్యానికి అవినీతి చెద పడితే సామాన్య మానవుడికే తీరని నష్టం జరుగుతుందన్నారు. విస్తృత ప్రజా ప్రయోజనాల రీత్యా సదుద్దేశంతో సాహసోపేతంగా క్రియాశీలక చర్యలు తీసుకున్న అధికారులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ‘‘సమాజంలో నైతిక విలువలు సార్వత్రికంగా పడిపోతున్నాయి. ఈ పరిణామాన్ని అరికట్టేందుకు నైతిక భారతం అవతరణకు విశాల ప్రాతిపదికగా సామాజిక ఉద్యమం అవసరం. నిజాయితీగల అధికారులను ప్రోత్సహిస్తే ఇతరులు కూడా అదే దారిలో నడుస్తారు. మీడియా కూడా వారిని ప్రోత్సహించాలి. సత్ప్రవర్తనతో వ్యవహరించేలా అధికారులందరికీ శిక్షణ అవసరం. ఇందుకోసం సమగ్రమైన నైతిక స్మృతిని రూపొందించాలి. సకాలంలో ప్రజా సేవలందించేందుకు మన సంస్థలను పునర్‌ వ్యవస్థీకరించాలి’’ అని వెంకయ్య అన్నారు. టెక్నాలజీని అధికంగా ఉపయోగిస్తే పని నాణ్యత పెరిగి.. వివక్షకు, స్వప్రయోజనాలకు వీలు ఉండదన్నారు. ప్రజల ఆధునిక ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలనా నమూనాలు మారాలని చెప్పారు. సులభంగా, పారదర్శకంగా, చురుగ్గా పనిచేసే వ్యవస్థలు అవసరమన్నారు. 

Advertisement
Advertisement