కాటేజీ ఖర్చు ఎవరి ఖాతాలో..

ABN , First Publish Date - 2020-10-30T06:15:05+05:30 IST

అసలే కరోనా ప్రభావంతో వరాహలక్ష్మీనృసింహస్వామి ఖజానాకు ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు సుమారు రూ.20 కోట్లకు పైగా ఆదాయం పడిపోయింది.

కాటేజీ ఖర్చు ఎవరి ఖాతాలో..
కార్తీక్‌ సుందర్‌రాజ్‌ (ఫైల్‌)

- సింహగిరి అన్నపూర్ణమ్మ సదన్‌లో 

139 రోజుల పాటు అనధికార వ్యక్తి బస

- అద్దె రూపంలో ఖజానాకు 

రూ.4.1 లక్షల నష్టం

- సౌకర్యాల కల్పనకు మరో రూ.లక్ష

- ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని సర్వత్రా చర్చ

సింహాచలం, అక్టోబరు 29: అసలే కరోనా ప్రభావంతో వరాహలక్ష్మీనృసింహస్వామి ఖజానాకు ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు సుమారు రూ.20 కోట్లకు పైగా ఆదాయం పడిపోయింది. అదిఅసలే కరోనా ప్రభావంతో వరాహలక్ష్మీనృసింహస్వామి ఖజానాకు ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు సుమారు రూ.20 కోట్లకు పైగా ఆదాయం పడిపోయింది. అది చాలదన్నట్టు సింహగిరిపై దేవస్థానానికి చెందిన అన్నపూర్ణమ్మ సదన్‌(కాటేజీ)లో అనధికార వ్యక్తి ఉన్నతాధికారుల అనుమతి లేకుండా బస చేసినందుకు సుమారు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు అధికారుల అంచనా. దేవస్థానం పాలకమండలి చైర్‌పర్సన్‌ ఓఎస్‌డీగా ప్రచారం చేసుకుని 139 రోజుల పాటు సింహగిరిపై అన్నపూర్ణమ్మ సదన్‌లో బస చేసిన కార్తీక్‌ సుందర రాజన్‌ పలు పత్రికల్లో వరుస కథనాలు రావడంతో ఎట్టకేలకు ఈ నెల 16న ఖాళీ చేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి దేవస్థానం అధికారులు దానిని భక్తులకు అద్దెకు ఇవ్వడం ప్రారంభించారు. జీఎస్టీతో కలిపి రోజుకు అద్దె రూపంలో రూ.2950లు వస్తోంది. కార్తీక్‌ ఉన్న రోజులన్నింటికీ లెక్కిస్తే అద్దె రూపంలో సుమారు రూ.4.1 లక్షలు అప్పన్న ఖజానాకు చెల్లించాల్సి ఉంది. అద్దె మాత్రమే కాకుండా కార్తీక్‌కు రక్షణగా మూడు షిఫ్ట్‌ల్లో సెక్యూరిటీ గార్డులు, ఇద్దరు వంటవారు, అటెండర్లు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు అతని ప్రయాణానికి సింహాచల దేవస్థానం భూ పరిరక్షణ విభాగానికి చెందిన వాహనం వంటి సదుపాయాలను దేవస్థానం ఎటువంటి అనుమతులు లేకుండానే ఏర్పాటు చేసింది. వాటి అన్నింటికి సొమ్ము రూపంలో లెక్కిస్తే సుమారు మరో రూ.లక్షకు పైగా అప్పన్న ఖజానాకు నష్టం వస్తోంది. కార్తీక్‌ను చైర్‌పర్సన్‌ సంచయితా ఓఎస్‌డీగా నియమించడానికి ట్రస్టుబోర్డుపై తీవ్ర ఒత్తిడి చేసినా నిబంధనల మేరకు నియామకం జరపాలంటూ సభ్యులు తీర్మానించడంతో బ్రేక్‌ పడింది. ఈ మధ్య కాలంలో కార్తీక్‌ కాటేజీలో ఉంటూ సంచయితా ఆదేశాల మేరకు సింహాచల దేవస్థానానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, భూముల సమగ్ర వివరాలను సేకరించడానికి దేవస్థానం కంప్యూటర్లు ఉపయోగిం చడం, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా రికార్డులు పరిశీలించడం కూడా వివాదాస్పదమైంది. వీటన్నింటిపై దేవస్థానం ఈవోగా పనిచేసిన దర్భముళ్ల భ్రమరాంబ చైర్‌పర్సన్‌కు లేఖ రాయగా, తర్వాత దేవదాయశాఖ జాయింట్‌ కమిషనర్‌ (ఎస్టేట్స్‌) చంద్రశేఖర్‌ ఆజాద్‌ తమ నివేదికను దేవదాయశాఖ కమిషనర్‌కు అందజేసినట్టు సమాచారం. కార్తీక్‌ కాటేజీలో ఉన్నన్ని రోజులకు అయిన ఖర్చును అతను భరిస్తాడా? లేక సంచయితా మౌఖిక ఆదేశాల మేరకు కాటేజీలో బస కల్పించిన అప్పటి ఈవో మారెళ్ల వెంకటేశ్వరరావు చెల్లిస్తారా? అనేది తేలాల్సి ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.

Updated Date - 2020-10-30T06:15:05+05:30 IST