పత్తి కొనుగోళ్ల.. ప్రహసనం

ABN , First Publish Date - 2020-11-20T05:50:56+05:30 IST

ఈ ఏడాది పత్తి తొలితీత సమయంలో వచ్చిన భారీ వర్షాలతో రైతులు పెద్దఎత్తున నష్టపోయారు. చివరికి పత్తి అమ్ముకుందామనుకుంటున్న రైతులకు చుక్కలు కనపడుతున్నాయి.

పత్తి కొనుగోళ్ల.. ప్రహసనం

జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రహసనంగా మారాయి... అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకా కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోగా.. మొదలైన చోట కూడా నెమ్ము పేరుతో కొర్రీలు పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. బయట మార్కెట్‌లో దళారులు ప్రవేశించి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రైతులకు అందడం లేదు. 


రైతు భరోసా కేంద్రాల ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని  అధికారులు చెబుతున్నారు. ఈ పంట నమోదులో రైతులు వివరాలున్నా.. మరలా దీనికోసం ప్రత్యేక యాప్‌లో పేర్లు నమోదు చేయాలంటున్నారు. అక్కడ సర్వర్లు మొండికేస్తున్నాయి.  పత్తి అమ్మకాలకు సంబంధించి టోకెన్లు ఎలా ఇవ్వాలో ఫార్మేట్‌ రాలేదని అధికారులు చెబుతున్నారు. జిన్నింగ్‌ మిల్లుల్లో పత్తిని కొనుగోలు చేయటం వల్ల తమకు వచ్చే ఆదాయం పోయిందని మార్కెటింగ్‌ శాఖ అధికారులు అసంతృప్తితో ఉన్నారు. 


పూర్తి స్థాయిలో ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు 

ఆర్‌బీకేలో టోకెన్లు.. మిల్లులో కొనుగోళ్లు

మార్కెటింగ్‌, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయ లోపం 

నెమ్ము పేరుతో కొర్రీలు..

బయటి మార్కెట్‌లో దళారుల ప్రవేశం

రైతు భరోసా కేంద్రాల్లో మొండికేస్తున్న సర్వర్లు

తెల్ల బంగారం రైతులకు అందని మద్దతు ధర 



  (గుంటూరు - ఆంధ్రజ్యోతి)

ఈ ఏడాది పత్తి తొలితీత సమయంలో వచ్చిన భారీ వర్షాలతో రైతులు పెద్దఎత్తున నష్టపోయారు. చివరికి పత్తి అమ్ముకుందామనుకుంటున్న రైతులకు చుక్కలు కనపడుతున్నాయి. కనీస మద్దతు ధరను అమలు చేయాల్సిన సీసీఐ, మార్కెటింగ్‌, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయం లేదు. రైతు భరోసా కేంద్రాల్లో పత్తి రైతుల పేర్లు నమోదు చేసుకోవాలని మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ- పంట నమోదులో పత్తి రైతుల వివరాలున్నాయి. మరలా ప్రత్యేకంగా దీనికోసం మరో యాప్‌లో పేర్లు నమోదు చేయాలంటున్నారు. అనేక ఇబ్బందులతో కొనుగోలు కేంద్రాలకు వెళితే సీసీఐ బయ్యర్లు అనేక కొర్రీలు వేస్తున్నట్లు రైతులు ఆదేదన వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేట, సత్తెనపల్లి, తాడికొండ, క్రోసూరు యార్డుల్లోనే పత్తిని కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు ప్రకటించారు. ఇక్కడనుంచి కొనుగోలు చేసిన పత్తిని వెంటనే జిన్నింగ్‌ మిల్లులకు తరలించాలి. రవాణా వ్యవహారాలు తమ పరిధిలోనే ఉండాలని అధికార పార్టీ నేతలు పట్టుపడుతున్నారు. జిల్లా స్థాయిలో రెవెన్యూ, రైతుభరోసా కేంద్రాల జేసీలు పత్తి కొనుగోళ్లను పర్య వేక్షిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. జేసీ దినేష్‌కుమార్‌ ఇంతవరకు పత్తి కొనుగోళ్లపై సమీక్షించలేదు. ఆర్‌బీకేలలో సర్వర్లు పనిచేయటం లేదని, ఈ పంటలో తమపేర్లు లేవని అనేకమంది పత్తి రైతులు లబోదిబో మంటున్నారు. ఆర్‌బీకే అధ్యక్షుల సిఫార్సులతో అధికార పార్టీ మద్దతుదారులకు వెంటనే పర్మిట్లు ఇస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


గందరగోళంగా టోకెన్ల వ్యవహారం

సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్మటానికి ప్రవేశపెట్టిన  టోకెన్ల పద్ధతి గందరగోళంగా ఉంది. టోకెన్ల కోసం రైతు భరోసా కేంద్రాలకు వెళితే సరిపోతుందని మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆర్‌బీకేలలో సీసీఐ కొనుగోళ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదని వ్యవసాయశాఖ తెలిపింది. జిన్నింగ్‌ మిల్లుల్లో పత్తిని కొనుగోలు చేయటం వలన తమకు వచ్చే ఆదాయం పోయిందని మార్కెటింగ్‌ శాఖ అధికారులు అసంతృప్తితో ఉన్నారు. టోకెన్ల పంపిణీ యార్డుల్లో ఉంటే తమ పరపతి పెరుగుతుందని, జిన్నింగ్‌ మిల్లుల్లో కొనుగోళ్లు, ఆర్‌బీకేలలో టోకెన్లు ఇస్తే చైౖర్మన్లకు పనేముందని పాలక వర్గాలు పెదవి విరుస్తున్నాయి. జిల్లా స్థాయిలో కొనుగోళ్ల నిబంధనలు ఇంతవరకు ప్రకటించలేదు. క్షేత్రస్ధాయిలో ఈ - పంట నమోదుతో తమపని పూర్తయిందని వ్యవసాయశాఖ భావిస్తోంది.  


అందని మద్దతు ధర

కేంద్రం ప్రకటించిన  క్వింటా రూ.5,825 కనీస మద్దతు ధర పత్తి రైతులకు అందటం లేదు.   సీసీఐ ప్రకటించిన కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించ లేదు. దీంతో బయట దళారులకు అమ్ముకున్న రైతులు  క్వింటా రూ.వెయ్యి చొప్పున నష్టపోతున్నారు.  మార్కెట్‌లో క్వింటాపత్తి రూ.4,500 నుంచి రూ.4,700కు కొనుగోలు చేస్తున్నారు.


అద్దెకు జిన్నింగ్‌ మిల్లులు 

ఈ ఏడాది జిన్నింగ్‌ మిల్లులను కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేశారు. సీసీఐ అధికారులు ఎన్ని జిన్నింగ్‌ మిల్లులు అద్దెకు తీసుకొన్నారు. వాటి వివరాలను యార్డు  చైర్మన్లు, కార్యదర్శులు, బయ్యర్లు ఇంతవరకు ప్రకటించ లేదు. అధికారపార్టీ నేతలు తమ అనుచరుల జిన్నింగ్‌ మిల్లులను అద్దెకు తీసుకోవాలని సీసీఐ అధికారులపై వత్తిడి తెస్తున్నట్లు సమాచారం.   


క్వింటా రూ.4వేలకు విక్రయించా..

నేను రెండెకరాలు కౌలుకు తీసుకొని పత్తి వేశా.. అధిక వర్షాలతో తొలి తీతపోయింది. సత్తెనపల్లిలో సీసీఐ కేంద్రాన్ని ఇంతవరకు ప్రారంభించలేదు. దీంతో ఊళ్లో క్వింటా రూ.4వేలకు విక్రయించా. సీసీఐ కేంద్రం ప్రారంభించక పోవటంతో మా ఊళ్ళో వ్యాపారులు క్వింటా రూ.4వేల నుంచి రూ.4,500కు కొంటున్నారు. కేంద్రం ప్రకటించిన రూ.5,825 ధర రైతులకు ఇవ్వటం లేదు. 

  - తాళ్ళూరి కోటేశ్వరరావు, కౌలురైతు, మాదల 


నెమ్ము పేరుతో ఐదు కిలోలు కోత..

చిలకలూరిపేట యార్డు పరిధిలో మర్రిపాలెంలో సీసీఐ కొనుగోలు    కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వారం క్రితం పత్తి తీసుకెళ్లా.. నెమ్ము ఉందని క్వింటాకు ఐదు కిలోలు కోతవేశారు. రైతులు సీసీఐ కేంద్రాలకు రావాలంటే భయపడే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. అదే వ్యాపారులు బినామీలుగా రైతుల పేర్లతో వస్తే కోత లేకుండా బయ్యర్లు కొంటారు. నాణ్యత పేరుతో అధికారులు చేసే హడావుడితో రైతులు గ్రామాల్లో దళారులకు అమ్ముతున్నారు.

     - పోపూరి శివరామకృష్ణ, యడ్లపాడు


మార్కెటింగ్‌శాఖ నుంచి ఫార్మేట్‌ రాలేదు..

రైతు భరోసా కేంద్రాల్లో పత్తి అమ్మకాలకు సంబంధించి ఏ రూపంలో టోకెన్లు ఇవ్వాలో ఫార్మేట్‌ రాలేదు. ఈ - పంట నమోదు పూర్తయింది. సీసీఐలో పత్తి అమ్మే రైతులు ఆర్‌బీకేలకు వస్తే పేర్లు నమోదు చేస్తున్నాం. మార్కెటింగ్‌ శాఖ సీసీఐ అమ్మకాలపై ఏ రూపంలో పర్మిట్లు ఇవ్వాలో స్పష్టం చేయలేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 5వేల మంది పత్తి రైతులు తమ పేర్లు నమోదు చేసుకొన్నారు.

- విజయ భారతి, వ్యవసాయశాఖ జేడీ


నాలుగు చోట్లే కొనుగోళ్లు

నరసరావుపేట, తాడికొండ, సత్తెనపల్లి, క్రోసూరు మార్కెట్‌ యార్డుల్లోనే పత్తిని కొనుగోలు చేస్తాం. ఇప్పటివరకు గుంటూరు, నడికుడి, నరసరావుపేట, ఫిరంగిపురం, పిడుగురాళ్ళ యార్డుల పరిధిలో కొనుగోళ్లు ప్రారంభించాం. కేంద్రం ప్రకటించిన క్వింటా కనీస మద్దతు ధర రూ.5,825 రైతులకు వచ్చే విధంగా కృషిచేస్తున్నాం. రైతు భరోసా కేంద్రాల్లో అన్ని వివరాలు అందుబాటులో ఉన్నాయి.

- జీఎస్‌ ఆదిత్య, సీసీఐ జీఎం



Updated Date - 2020-11-20T05:50:56+05:30 IST