పత్తి ధర.. తగ్గేదేలే!

ABN , First Publish Date - 2022-02-05T09:40:17+05:30 IST

పత్తి ధర.. తగ్గేదేలే!

పత్తి ధర.. తగ్గేదేలే!

క్వింటా రూ.10వేల పైనే!.. నాణ్యమైన దిగుబడితో డిమాండ్‌

జోరుగా పత్తి నిల్వల విక్రయం


అమరావతి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): పత్తి మద్దతు ధర తగ్గేదేలే అన్నట్లు కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా క్వింటా రూ.10వేలపైనే పలుకుతోంది. దేశంలో కేంద్ర ప్రభుత్వ మద్దతు ధరను మించి ధర లభిస్తోంది. గత డిసెంబరు నుంచి కనీస ధర రూ.6వేలకు ఏమాత్రం తగ్గలేదు. ఏపీ, తెలంగాణ, మహరాష్ట్రలోనూ రోజురోజుకూ ధర పెరుగుతూనే ఉంది. కోస్తాంధ్రలో క్వింటాకు రూ.ఐదారొందలు తక్కువగా ఉన్నా.. రాయలసీమలో గరిష్ఠ ధర రూ.10వేలకు తగ్గకుండా కొనసాగుతోంది. శుక్రవారం ఆదోని మార్కెట్‌లో రికార్డు స్థాయిలో క్వింటా గరిష్ట ధర రూ.10,791 పలకగా, సగటు ధర రూ.9,189, కనిష్ట ధర రూ.7,009 పలికింది. అతికొద్ది వ్యత్యాసంతో ఇవే ధరలతో రోజుకు 2-3వేల క్వింటాళ్ల పత్తి ఆదోని మార్కెట్‌లో అమ్ముడుపోతోంది. అయితే రాష్ట్రంలో రైతుల వద్ద పంట చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం ధర బాగుండటంతో కొన్నాళ్లుగా నిల్వ చేసిన పత్తిని రైతులు ఇంత కన్నా ధర వస్తుందో.. రాదోనన్న భావనతో ఇప్పుడు అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. ఇక, దేశవ్యాప్తంగా ఈ ఏడాది 3.35కోట్ల బేళ్ల పత్తి ఉత్పత్తి అంచనాలో ఇప్పటికే 1.85లక్షల బేళ్ల క్రయవిక్రయాలు జరిగాయని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. మిగిలిన పత్తి స్థానిక వ్యాపారుల ద్వారా మిల్లుల్లో కొంత, రైతుల వద్ద మరికొంత నిల్వ ఉన్నట్లు భావిస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 20లక్షల బేళ్లు పత్తి మాత్రమే ఎగుమతయినట్లు సమాచారం. తెలంగాణలో 350, ఏపీలో ప్రస్తుతం 200దాకా జిన్నింగ్‌ మిల్లులు పని చేస్తుండగా, ఎగుమతి ఆర్డర్లు లేక 20రోజుల నుంచి పత్తి జిన్నింగ్‌ పెద్దగా సాగటం లేదని తెలుస్తోంది.


Updated Date - 2022-02-05T09:40:17+05:30 IST