తేమ కొర్రీ.. రైతు వర్రీ

ABN , First Publish Date - 2021-01-09T04:47:48+05:30 IST

పత్తి రైతులను కష్టాలు, సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అకాల వర్షాలు, తెగుళ్లు వంటి సమస్యలే కాకుండా

తేమ కొర్రీ.. రైతు వర్రీ
చేవెళ్లలోని జిన్నింగ్‌ మిల్లులో నిల్వ ఉన్న పత్తి

  • పెరిగిన పత్తి సాగు.. తగ్గిన దిగుబడి
  • తేమ నిబంధనతో గుబులు 
  • నష్టపోతున్న రైతులు


పత్తి రైతులను కష్టాలు, సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అకాల వర్షాలు, తెగుళ్లు వంటి సమస్యలే కాకుండా చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు తేమశాతం అడ్డుపడుతోంది. దీంతో పత్తిరైతులు దిక్కుతోచని స్థితిలో ఆందోళన చెందుతున్నారు. సీసీఐ కేంద్రాల్లో పత్తి నిల్వ చేసుకోవడానికి స్థలం లేకపోవడం, సీసీఐ కేంద్రం విధించిన నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారాయి. దీంతో చేసేదేమీ లేక పత్తిని దళారులకు తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోతున్నారు. 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : నియంత్రిత సాగు విధానం అమలుతో ఈ సారి రంగారెడ్డి జిల్లాలో పత్తి సాగు గణనీయంగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఖరీ్‌ఫలో 18శాతం పత్తి సాగు పెరిగింది. వానాకాలం సాగు అంచనా 2,48,357 ఎకరాలు కాగా 2,54,832 ఎకరాలు సాగైంది. పెరిగిన సాగుకు అనుగుణంగా 15 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడివస్తుందని అంచనా వేశారు. దానికి అనుగుణంగా జిల్లాలో 15 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. షాద్‌నగర్‌ ఎఎంసీ పరిధిలో 12, చేవెళ్ల, ఆమగనల్లు, ఇబ్రహీంపట్నం ఎఎంసీ పరిధిలో ఒక్కో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల పరిధిలోని జిన్నింగ్‌ మిల్లుల్లో సీసీఐ పత్తిని కొనుగోలు చేస్తుంది. ఇప్పటివరకు 9,24,463.28 క్వింటాళ్ల పత్తిని సేకరించారు. ఇందులో ప్రైవేట్‌గా 23,563.09 క్వింటాళ్లు సేకరించగా సీసీఐ (కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) ద్వారా 9,00,900.19 క్వింటాళ్లు సేకరించారు. 

పత్తి పంటను భారీ వర్షాలు వెంటాడాయి. ఏపుగా పెరిగిన తర్వాత, పూత, కాత సమయంలో భారీ వర్షాలు కురవడంతో దిగుబడి తగ్గిపోయింది. ఎకరం పత్తి సాగుకు పంట పెట్టుబడిగా రూ.30 వేల వరకు ఖర్చు వస్తుంది. ఈసారి అతివృష్టి కారణంగా దిగుబడి తగ్గింది. ఎకరం సాగులో 8 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా 4 క్వింటాళ్లు మాత్రమే వచ్చిందని రైతులు చెబుతు న్నారు. ఈ ఏడాది పురుగు మందుల ధరలు, డీజిల్‌ ధరలు, ట్రాక్టర్ల కిరాయి పెరిగింది. పత్తి తీసేందుకు కూలీలు కిలోకి రూ.10 నుంచి రూ.12 వరకు తీసుకుంటున్నారు. పెరిగిన పెట్టుబడులకు మద్దతు ధర లభించక తీవ్ర నష్టాలు మిగిలాయి.


తేమ కొర్రీ...

సీసీఐ 8 నుంచి 12 తేమ, దూది పింజ పొడవు, తదితర నిబంధనలతో రైతుల కంటే వ్యాపారులకే ఎక్కువగా మేలు జరుగుతోంది. పత్తి రైతుకు ఈ ఏడాది మద్దతు ధర రూ. 5,525 దక్కడం రైతులకు కష్టంగానే ఉంది. వర్షాలకు పత్తి రంగు మారడంతో మద్దతు ధరను తగ్గించారు. క్వింటాలు పత్తికి రూ. 5,700 మద్దతు ధర చెల్లిస్తున్నారు. సీసీఐ 12శాతం తేమ దాటితే కొనుగోలు చేయకపోవడంతో రైతులు వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. పత్తి పింజ పొడవు 29.5 నుంచి 30.5, మైక్రోనీర్‌ విలువ 3.5-4.3 ఉండాలని నిబంధన పెట్టారు. తేమ ఒక్కో శాతానికి రూ.58.25 ధరలో తగ్గింపు, 12 శాతానికి ఎక్కువగా ఉంటే కొనుగోలు చేయమని సీసీఐ అధికారులు చెబుతున్నారు. 


పేరుకు పోయిన పత్తి నిల్వలు..

సీసీఐ కేంద్రాలకు పత్తి లోడ్‌తో వచ్చిన వాహనాలు బారులు తీరాయి. ఇప్పటివరకు రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తి నిల్వలు కేంద్రాల్లో కుప్పలుగా ఉండటంతో కొత్తగా కొనుగోలు చేసిన పత్తిని నిల్వ చేయడానికి స్థలం లేదు. దీంతో వాహనాల్లోని పత్తిని ఖాళీ చేసేందుకు రెండు మూడు రోజులు పడుతుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు చేవెళ్ల మండలంలోని జిన్నింగ్‌ మిల్లు సామర్థ్యం 20 వేల క్వింటాళ్లు కాగా, రోజుకు 2,600 క్వింటాళ్ల పత్తిని సేకరిస్తున్నారు. పత్తి బేళ్లు తయారు చేస్తున్నప్పటికీ సామర్థ్యానికి మించి నిల్వలు పేరుకుపోతున్నాయి. దీంతో రోజుల తరబడి పత్తి వాహనాలు క్యూలైన్లో నిలిచి ఉంటున్నాయి. 


ఇబ్బంది లేకుండా చూడాలి..

ప్రభుత్వం రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి. పత్తి అమ్మేందుకు జిన్నింగ్‌ మిల్లు వద్దకు  వస్తే రెండు రోజులు పట్టింది. దీంతో రెండు రోజుల ఆటో కిరాయి రెండు వేలు అదనపు ఖర్చు వచ్చింది. వచ్చిన వాహనాలను వచ్చినట్లుగానే ఖాళీ చేసి పంపే విధంగా చర్యలు తీసుకోవాలి. 6 క్వింటాళ్ల పత్తిని అమ్మడం జరిగింది. వెయిటింగ్‌ లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. 

- కె. నారాయణ, రైతు, తల్లారం. 


మధ్దతు ధర ఇలా..

తేమశాతం     ధర

    8         రూ.5,825

    9         రూ.5,766.75

   10         రూ.5,708.50

   11         రూ.5,650.25

   12         రూ.5,592



Updated Date - 2021-01-09T04:47:48+05:30 IST