దేశమా! దారికి రా!

ABN , First Publish Date - 2021-04-15T07:35:31+05:30 IST

ప్రస్తుతం మనదేశం మూడు అంశాలను జాగ్రత్తగా, లోతుగా అధ్యయనం చేసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమయిందని విజ్ఞులు...

దేశమా! దారికి రా!

ప్రస్తుతం మనదేశం మూడు అంశాలను జాగ్రత్తగా, లోతుగా అధ్యయనం చేసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమయిందని విజ్ఞులు, అనుభవజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.


ఆ మూడు అంశాలు ఇవి.

1) రాజకీయ పరిస్థితులు 2) ఆర్థిక పరిస్థితులు 3) అంతర్జాతీయ పరిస్థితులు. దేశభద్రత, అభివృద్ధి, సంక్షేమం ఈ మూడు అంశాల మీదనే ప్రధానంగా ఆధారపడి ఉన్నాయని అనుకోవడంలో తప్పు లేదు. కొన్ని సంవత్సరాలుగా దేశంలో జరుగుతున్న అనేక సంఘటనలు ఈ రకమైన చింతనకు, అనుమానాలకు తావిస్తున్న మాటను ఎవరూ కాదనలేని పరిస్థితి.


కోవిడ్‌ నేపథ్యంలో కలికాలం వచ్చేసిందని జాతకాలరాయుళ్ళు, నాడీగ్రంథ పండితులే కాకుండా దేశాల జ్యోతిష్యాలను గూడా రెప్పవేయకుండా చెప్పేవాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేనే లేదు. కానీ వాస్తవిక దృక్పథంతో ఒక్కొక్క అంశాన్ని విశ్లేషించి, పరిస్థితులను అవగాహన చేసుకుని, దేశం కోసం కొన్ని కఠినమైన దిద్దుబాటు చర్యలను, పాలకులు, ప్రజలు, తీసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయన్న విషయాన్ని విస్మరించే రోజులు గడిచిపోయాయన్న నగ్నసత్యాన్ని పరిగణనలోకి తీసుకోక తప్పదు.


ప్రజాస్వామ్యాన్ని మనసా వాచా పాటించాలని కోరుకుంటున్న మన ప్రజలూ, దేశమూ, అంబేడ్కర్‌ నేతృత్వంలో రూపొందిన అద్భుతమైన రాజ్యాంగాన్ని పాటించక తప్పదు. రాజకీయంగా పార్టీలు, ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ మార్గదర్శక సూత్రాన్ని విస్మరిస్తున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. అంతేకాదు రాజ్యాంగం ఏర్పరిచిన వ్యవస్థలు కొన్ని ఇప్పటికే కూలిపోయాయి, మరికొన్ని బీటలు వారాయి. ఇంకొన్ని నామమాత్రంగా మిగిలిఉన్నాయి. వెంటిలేటర్‌ మీద లేకుండా జీవిస్తున్న ఒకే ఒక అంగం, న్యాయవ్యవస్థ! ఆ వ్యవస్థ కొంతలో కొంత కట్టుదిట్టంగా పనిచేస్తుండడం వల్లనే, లెజిస్లేచర్‌, పరిపాలనా వ్యవస్థ నామమాత్రంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నాయి.


ప్రజల అభ్యున్నతి కోసం ఏ ప్రభుత్వమైనా పాటుపడక తప్పదు. కానీ సంక్షేమ సాధన పేరుతో ప్రజలను అధోగతి పాలు చేస్తూ, రాజకీయ ఆధిపత్యాన్ని ప్రజాస్వామ్య ముసుగులో అన్ని రకాలుగా ప్రదర్శిస్తూ, తాము ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాం అని మాయ మాటలు చెప్పే పాలకులను ‘అన్ని రకాల సౌకర్యాలను మేము సమకూరుస్తాం. ఎలా నమ్మాలి? కేవలం మీరు ఇంట్లో కూర్చుని తినిపెడితే చాలు’ అని నమ్మబలికే ప్రభుత్వాలను ఏం చేయాలి? కూడు, గూడు, బట్ట అనే చిన్నపాటి సూత్రం ఈవిధంగా ప్రజాస్వామ్యం పేరిట ఎన్నుకోబడ్డ పాలకుల నోళ్ళలో నాని, నాని, చివరకు ప్రజలు మాకు అన్నీ కావాలి అని అడిగే పరిస్థితిని తెచ్చిపెట్టాయా? అధికారం ముఖ్యం అనే ధోరణితో నిజమైన అభివృద్ధిని నీరుగార్చి ప్రజల స్వయంశక్తులను హరించే పరిస్థితిని ఈనాటి ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాలలో కావాలనే కల్పిస్తున్నాయా? కష్టాన్ని కూడా ఇష్టంగా భరించే శక్తిని ప్రజల పరిధిలోంచి కావాలనే దూరం చేస్తున్నాయా?


రాజకీయంగా ఇది అన్ని రాష్ట్రాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న విచిత్రమైన, క్లిష్టమైన సమస్య. దీనికి తోడు దేశంలో ఎన్నికల తతంగం కేవలం పార్టీలు అధికారంలోకి రావడం కోసమే. ప్రజల అభ్యున్నతి పేరుతో అధికారంలోకి వచ్చి ఆ తర్వాత అధికారం నిలుపుకోవడానికే పాలన. ప్రజల అభ్యున్నతి కోసం కాదు అనే వింతధోరణి ఈ మధ్య విచిత్రంగా బలపడుతున్నది. సామ, దాన, భేద, దండోపాయాలతో అధికారం కోసం ఏదైనా చేయొచ్చు, వాగ్దానాలు కేవలం నీటి మూటల్లాంటివే, మానిఫెస్టోల్లో మాటల గారడీకి మాత్రమే అనే విచిత్ర ధోరణి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నది. ప్రభుత్వం ఇంతకు పూర్వం ఏదైనా మాట చెబితే అది శాసనంగా రూపుదిద్దుకుని ప్రజలకు సంతృప్తిని కలిగించేది. అనుమానం లేశమైనా కలిగించకపోయేది! ఇప్పుడు ఆ వాగ్దానాలను జ్ఞాపకం చేయబోతే ముగిసిపోయిన అధ్యాయమని అధికారికంగానే చెబుతున్నారు. ఇలా ముగిసిపోయిన అధ్యాయాలు పుస్తకం తెరవకుండానే కనబడుతున్నాయి. రాజకీయాన్ని రసవత్తరంగా నడపటం అంటే ఇదే. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ ధోరణికి అతీతం కాదు! అన్ని పార్టీలూ ఈ విషయంలో ఏకగ్రీవంగానే ఉండడం విశేషం, బహు విచిత్రం!


ఎన్నికలు సక్రమంగా జరిగితేనే ప్రజాస్వామ్యం నాలుగు కాలాలు నాలుగు కాళ్ళ మీద నిలబడుతుంది. ‘నీతోటి నేను ఏకీభవించను. కానీ నీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను’ అనే ధోరణి ఇంతకుపూర్వం అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోగ్యకరంగా పరిఢవిల్లుతుండేది. ‘శత్రుత్వాలు మనుషుల మధ్య కాదు, పార్టీల మధ్యనే’ అన్న సూత్రం కూడా అప్పట్లో రాజకీయ నాయకులు, పాలక, ప్రతిపక్షాలు పాటిస్తుండేవి. చూడముచ్చటగా ఉండే ఆ రోజులు పోయాయి. మూర్ఖంగా, బాహాబాహీగా, రాజకీయ పోరాటాలు, ప్రజల బాగు కోసం కాకుండా, వ్యక్తుల బాగు కోసం, పార్టీల పేరిట ఈ దేశంలో జరుగుతున్నాయి. పెద్ద సమస్య పాలకవర్గం ఖాతాలో ఉద్భవిస్తే, చిన్న సమస్యగా రూపుదిద్దుకుంటున్నది. పాలకుల వల్ల ఏర్పడే చిన్న సమస్యను కూడా ప్రతిపక్షం భూతద్దంలో చూపించి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నది. అందుకే ఈ రాజకీయ పరిణామాలను ప్రజలు, ఓటర్లు పరిగణనలోకి తీసుకొని, స్వంత నిర్ణయాలు తీసుకునే ధోరణిలో పరిష్కరించుకోలేకపోతే అంబేడ్కర్‌ రాజ్యాంగం, భారతదేశ ప్రజాస్వామ్యం మాటలకే పరిమితం కాక తప్పదు.


కొవిడ్‌ విపత్తు ఆర్థికంగా మనదేశాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఎన్నికల కోసం ప్రజల అవసరాలను తీర్చే వస్తువుల ధరల తగ్గుదల, ఎన్నికలు ముగియగానే ఆ ధరల పెరుగుదల నిత్యమూ చూడటానికి అలవాటు పడ్డాం. ఓటు అయిదేళ్ళకొకసారి ఉపయోగించే ఆయుధం. ఇలాంటి విషయాల్లో బహిర్గతపరిచే ఆందోళన ప్రజలు నిత్యమూ తలపెట్టినప్పుడే పాలకులు దిగిరాక తప్పదు. ఆ అవగాహనను మీడియా కొంతవరకే కల్పించడానికి అవకాశం ఉంది. విద్యావంతుల సంఖ్య పెరిగిన ఈ తరుణంలో విద్యాధికులు, మేధావులు, సంఘజీవులుగా ఉండడం మానేసినట్లుంది. కేవలం బుద్ధిని నమ్ముకున్న పాతకాలం వారు ఇలాంటి విషయాల్లో ‘ఫోకస్‌డ్‌’గా ఉండేవారు. ప్రస్తుతం ఆ ఫోకస్‌ ఈనాటి వారిలో మృగ్యమైంది. అందుకే ఎవరో ఒకరు తట్టి లేపాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఎవరు తట్టిలేపుతారో చూడాలి! కర్మభూమి అయిన మనదేశం అవసరం ఏర్పడినప్పుడు శక్తిగా మారి పరిష్కారం చూపించిన అనుభవాలు కోకొల్లలు. అందుకే ఆశగా ఉంది, ఆ శక్తి ప్రదర్శన క్రమేపీ జరుగుతుందని. ప్రజలకు ఆర్థిక తాయిలాలు తాత్కాలికం! ప్రజలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం శాశ్వతమార్గం. కొన్ని రాష్ట్రాల్లో, ముంబై లాంటి ప్రముఖ ప్రదేశాల్లో పరిపాలనా వ్యవస్థలు, ముఖ్యంగా పోలీసు వ్యవస్థలు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాయి. మన దేశ పోలీసు వ్యవస్థ అంతర్జాతీయంగా ముందు వరుసలో పనితీరుకు చిహ్నంగా భాసిల్లింది! ఆ పేరు పోగొట్టుకోదని ఆశపడటంలో తప్పు లేదు!


అంతర్జాతీయంగా పొరుగు దేశాల వైఖరి మనదేశానికి అననుకూలంగా మారుతున్నదేమోనన్న అనుమానాలు ప్రబలుతున్నాయి. విదేశీ వ్యవహారాల్లో శత్రుదేశాలు, మిత్రదేశాలు పరిగణనలో ఉన్నా, ఒకప్పటి మిత్రదేశాలు శత్రుదేశాలుగా మారొచ్చు! అందుకే విదేశాంగ వ్యవహారాల్లో పరిణతి చెందిన రాజకీయ విజ్ఞత ప్రదర్శించక తప్పదు. ఆ వివేకం కొరవడుతున్న పరిస్థితులను చక్కదిద్దుకోవాలి.


పైన పేర్కొన్న అంశాల్లో పరిష్కార మార్గాలు తప్పక కనపడతాయని ఆశించటంలో తప్పు లేదు!

రావులపాటి సీతారాంరావు

Updated Date - 2021-04-15T07:35:31+05:30 IST