దేశంలోని తొలి మహిళా సైకియాట్రిస్ట్ డాక్టర్ శారదా మీనన్ కన్నుమూత

ABN , First Publish Date - 2021-12-06T21:12:12+05:30 IST

దేశంలోనే తొలి మానసిక వ్యాధి నిపుణురాలిగా పేరు గాంచిన డాక్టర్ శారదా మీనన్ కన్నుమూశారు. ఆమె వయసు 98 సంవత్సరాలు. వయసు..

దేశంలోని తొలి మహిళా సైకియాట్రిస్ట్ డాక్టర్ శారదా మీనన్ కన్నుమూత

చెన్నై: దేశంలోనే తొలి మానసిక వ్యాధి నిపుణురాలిగా పేరు గాంచిన డాక్టర్ శారదా మీనన్ కన్నుమూశారు. ఆమె వయసు 98 సంవత్సరాలు. వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న డాక్టర్ శారద చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.


మంగళూరులో పుట్టిన డాక్టర్ శారద.. మద్రాస్ మెడికల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. బెంగళూరులోని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్’ సైకియాట్రీలో శిక్షణ పొందారు. ఆ తర్వాత అదే సంస్థకు సుదీర్ఘకాలం హెడ్‌‌గా పనిచేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. 1992లో భారత ప్రభుత్వం డాక్టర్ శారదను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 


సైకియాట్రిస్ట్ ఆర్.తారతో కలిసి 1984లో డాక్టర్ శారద షిజోఫ్రీనియా రీసెర్చ్ ఫౌండేసన్ (ఎస్‌సీఏఆర్ఎఫ్ ఇండియా)ను స్థాపించారు. ఆమె మృతి తమకు తీరని లోటని డాక్టర్ తార పేర్కొన్నారు. 1978 నుంచి ఆమె తనకు తెలుసని, 35 ఏళ్లపాటు ఆమెతో కలిసి పనిచేశానని గుర్తు చేసుకున్నారు. ఆమె ఎంతోమందికి రోల్ మోడల్ అని, తమలాంటి ఎందరికో స్ఫూర్తిదాత అని అన్నారు. మూడు నెలల క్రితం కూడా ఆమె తన అభిరుచులను పంచుకున్నారని డాక్టర్ తార గుర్తు చేసుకున్నారు. 


డాక్టర్ శారద స్టూడెంట్ అయిన లక్ష్మీ విజయ్ కుమార్ ఆమెతో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆమెను అరుదైన వ్యక్తిగా అభివర్ణించారు. డాక్టర్ మీనన్ రిటైరైనప్పటికీ సైకియాట్రీ క్లాసులు తీసుకునేవారని గుర్తు చేసుకున్నారు. ఆత్మహత్యల నివారణ కోసం ‘స్నేహ’ అనే స్వచ్ఛంద సంస్థను డాక్టర్ లక్ష్మీ విజయ్‌కుమార్ స్థాపించారు. ఈ రోజు సైకియాట్రీలో తమిళనాడు దేశంలోనే అగ్రస్థానంలో ఉందంటే దానికి డాక్టర్ శారదనే కారణమన్నారు. 


డాక్టర్ శారద మృతి విషయం తెలిసి ప్రముఖ నటుడు కమలహాసన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మానసిక రోగుల అభ్యున్నతి కోసం ఆమె ఎంతగానో పాటుపడ్డారని గుర్తు చేసుకున్నారు. మానసిక వ్యాధిగ్రస్థుల సంరక్షణ, పునరావాసం కోసం ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ఆమె మృతికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

Updated Date - 2021-12-06T21:12:12+05:30 IST