సంకెళ్లు వేసుకొని మరీ ప్రేమించుకున్నారు.. వాటిని కట్ చేయగానే విడిపోయారు!

ABN , First Publish Date - 2021-06-19T12:03:10+05:30 IST

ప్రేమించుకున్న వాళ్లందరూ జీవితాంతం కలిసి ఉండరు. కానీ చాలా మంది తమ ప్రేమను సక్సెస్ చేసుకోవడానికే ప్రయత్నిస్తారు. వ్యాలంటైన్స్ డే రోజు తమ ప్రేమను రకరకాలుగా తమ భాగస్వామికి తెలియజెప్పుకుంటారు.

సంకెళ్లు వేసుకొని మరీ ప్రేమించుకున్నారు.. వాటిని కట్ చేయగానే విడిపోయారు!

ప్రేమించుకున్న వాళ్లందరూ జీవితాంతం కలిసి ఉండరు. కానీ చాలా మంది తమ ప్రేమను సక్సెస్ చేసుకోవడానికే ప్రయత్నిస్తారు. వ్యాలంటైన్స్ డే రోజు తమ ప్రేమను రకరకాలుగా తమ భాగస్వామికి తెలియజెప్పుకుంటారు. ఇలాగే ఓ జంట తమ ప్రేమను వింతగా ప్రపంచానికి చెప్పుకోవాలని అనుకుంది. వాళ్లే ఉక్రెయిన్‌కు చెందిన అలెగ్జాండర్ ‘సాషా’ కుడ్లే, విక్టోరియా ‘వికా’ పుస్తోవిటోవా. 33 ఏళ్ల అలెగ్జాండర్ ఆన్‌లైన్‌లో కార్ల సేల్స్‌మ్యాన్ కాగా, 29 ఏళ్ల విక్టోరియా బ్యుటీషియన్. వీళ్లు తమ జీవితాల్లో పలుమార్లు బ్రేకప్‌లు ఎదుర్కొన్నారు. ఈ బాధ నుంచి బయటపడటం కోసం కొత్త ప్రయోగం చేయాలని నిర్ణయించుకున్నారు.


సంకెళ్లతో 123 రోజులు..

తమ ప్రేమను అందరికీ తెలిసేలా చేయడం కోసం ఈ జంట తమ చేతులకు సంకెళ్లు వేసుకొంది. రోజులో 24 గంటలూ కలిసే ఉంది. షాపింగ్ నుంచి బాత్‌రూం వరకూ అన్ని పనులూ కలిసే చేసింది. తొలుత ఈ ప్రయోగం వారిని దగ్గర చేసినా ఆ తర్వాత సమస్యలు మొదలయ్యాయట. దీంతో తామిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారీ ప్రేమికులు. తమ 123 రోజుల సంకెళ్ల బంధానికి ఉక్రెయిన్ రాజధాని కైయివ్‌లో వీడ్కోలు పలికారు. ఇన్ని రోజులు సంకెళ్లతో జీవించిన రికార్డు సృష్టించిన వీరిద్దరూ సంకెళ్లు తెగగానే ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోవడం గమనార్హం. ‘‘మా బాంధవ్యంలో ఒక ప్లస్ కనిపించింది అనుకుంటే, ఆ వెంటనే రెండు మైనస్‌లు కనిపించాయి’’ అని అలెగ్జాండర్ అన్నాడు. సంకెళ్లు తెంచుకున్న అనంతరం తనకు స్వేచ్ఛ లభించిందని, తాను స్వతంత్రమైన వ్యక్తిగా బతకాలని అనుకుంటున్నానని విక్టోరియా తెలిపింది. ఏది ఏమైనా వీళ్లిద్దరి జీవితాల్లో ఈ ప్రేమ కూడా ఎక్కువ కాలం నిలవలేదన్నమాట. ఇలా సంకెళ్లతో ఉన్న సమయంలో తమ కష్టాలపై డాక్యుమెంటరీ తీయాలని అలెగ్జాండర్ అనుకుంటున్నాడట.



Updated Date - 2021-06-19T12:03:10+05:30 IST