కరోనా నిలిపింది బంధాన్ని!

ABN , First Publish Date - 2020-08-09T07:45:24+05:30 IST

అనూ-ప్రవీణ్‌ (పేరుమార్చాం) దంపతులు. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. షిఫ్టులవారీ విధులు కావడంలో ఒకరు ఇంట్లో ఉంటే.. మరొకరు ఆఫీసులో ఉండేవారు. వారాంతాల్లో కలిసి ఉన్నా ఆ రెండు రోజులూ కీచులాటలు...

కరోనా నిలిపింది బంధాన్ని!

  • దంపతుల్లో పెరుగుతున్న అన్యోన్యత
  • బిజీలై్‌ఫకు విరామం.. ఇద్దరూ ఇంట్లోనే
  • వర్క్‌ఫ్రం హోంతో తొలగిపోతున్న అపార్థాలు
  • కలిసికట్టుగా ఇంటి పనులు.. పిల్లల పెంపకంలోనూ భాగస్వామ్యం
  • విడాకుల దాకా వెళ్లిన భార్యాభర్తల్లోనూ మార్పు.. సంసారంలో మధురిమలు

అనూ-ప్రవీణ్‌ (పేరుమార్చాం) దంపతులు. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. షిఫ్టులవారీ విధులు కావడంలో ఒకరు ఇంట్లో ఉంటే.. మరొకరు ఆఫీసులో ఉండేవారు. వారాంతాల్లో కలిసి ఉన్నా ఆ రెండు రోజులూ కీచులాటలు, కస్సుబుస్సులతోనే సరిపోయేది. పరస్పరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నా ‘ఛీ.. జీవితం’ అనుకునే స్థాయికి వచ్చేశారు. ఏదో ఒకటి తేల్చుకుందాం అనుకున్న సమయంలో వచ్చినపడిన లాక్‌డౌన్‌ ఇద్దరినీ దగ్గరకు చేసింది. ఇద్దరూ ఇంట్లో నుంచే ఆఫీసు పని చేస్తుండటంతో బంధం మళ్లీ చిగురించింది. అనూ మనసును ప్రవీణ్‌ అర్థం చేసుకుంటే, ప్రవీణ్‌ కష్టాన్ని అనూ గుర్తించింది. 


నిన్నటి వరకూ వీరేనా విడిపోతాం అంటూ హంగామా చేసింది అంటూ ముక్కున వేలేసుకోవడం పక్కింటి వారి వంతైంది. ...ఇలాంటి జంటలు చాలానే కనబడుతున్నాయిప్పుడు. నగర వాసి జీవనశైలిని కరోనా ఏ స్థాయిలో మార్చేసిందో చూస్తున్నాం. ఆప్యాయంగా కరచాలనానికి దూరం చేసి.. భౌతిక దూరాన్ని నిబంధనగా  మార్చేసిన వైరస్‌, దంపతుల మధ్య మాత్రం అనుబంధం పెంచింది. ఉరుకుల పరుగుల జీవితాల్లో పడి, జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడలేక మనస్పర్థలు, కలతలతో కొందరికి వైవాహిక జీవితం దుర్భరంగా ఉండేది. వ్యష్టి కుటుంబాలు పెరగడం, దంపతుల మధ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి, సరిచేసేందుకు పెద్దవారెవరూ లేకపోవడంతో కొన్ని కేసులు విడాకులదాకా వెళుతున్నాయి. ఇలాంటివారిలో 81-96 మధ్య పుట్టిన వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పుడు వీరంతా సంసారంలోని మధురిమలను ఆస్వాదిస్తున్నారు.

ఇదంతా లాక్‌డౌన్‌, కరోనా, వర్క్‌ ఫ్రం హోమ్‌ తెచ్చిన మార్పే..! ఒకరు డే.. మరొకరు నైట్‌ డ్యూటీతో ముఖాలు చూసుకునే అవకాశం కూడా ఉండని బహుళజాతి సంస్థల్లో పనిచేసుకుంటున్న దంపతుల్లో చాలామంది ఇప్పుడు ఆనందంగా ఉంటున్నామని చెప్పారు. ఒకరి బాధ్యతలను మరొకరు పంచుకోవడంతోనే బంధం బలోపేతం అవుతుందనే విషయాన్ని ఈ తరం దంపతులు గుర్తించేలా కరోనా చేసిందని.. ఇది కచ్చితంగా శుభ పరిణామమేనని శేఖర్‌ అనే మానసిక నిపుణుడు విశ్లేషించారు.  దంపతుల్లో ఒకరంటే ఒకరికి నమ్మకం.. అనుక్షణం తోడుంటారనే భరోసా.. మాటకు విలువ, గౌరవం లభిస్తుందనే విశ్వాసం ఉంటే ఆ బంధం చెరిగిపోదు. పైగా ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటూ బలోపేతమై వర్ధిల్లుతుంది. ‘నేనీదరినీ.. నువ్వాదరినీ..’ అన్నట్లుగా ఉండే దంపతులు కూడా గత నాలుగు నెలల్లో గొప్ప మార్పు వచ్చిందని.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి వచ్చిందని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.


నిజానికి కరోనా కాలంలో తాము రెండురకాల బంధాలను చూస్తున్నామంటున్నారు మనస్తత్వ నిపుణుడు రమణ. ఆయన విశ్లేషణ ఫ్రకారం.. లాక్‌డౌన్‌ కాలంలో ఎక్కువగా గొడవలు పడిన  దంపతుల్లోనూ ఇప్పుడు చాలామంది కలిసిపోతున్నారు.  లాక్‌డౌన్‌ వచ్చిన కొత్తలో అకస్మాత్తుగా మారిన పరిస్థితులను ఆకళింపు చేసుకోవడం, సర్దుబాటు కావడం వంటి విషయాల్లో ఇబ్బందులొచ్చాయి. ఇప్పుడు మాత్రం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఒకప్పటిలా భర్తలు.. మేం ఇది చేయం అది చేయం అని అనడం లేదు. ఇంటి పనుల్లో భార్యకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఇదే విషయాన్ని మోతీనగర్‌కు చెందిన ఫణీంద్ర కూడా ఒప్పుకొంటున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘మేం ఇద్దరం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తుండటంతో  పాపను చూసుకోవడానికి ఓ ఆయాను పెట్టాం. లాక్‌డౌన్‌, కరోనా భయంతో ఆమెను రావొద్దన్నాం. అయితే ఇంటి పనులు, వర్క్‌ ఫ్రం హోమ్‌ బాధ్యతలు నెరవేర్చడం, పాపను చూసుకోవడం కష్టమని ఊరు నుంచి అత్తగారిని తీసుకురావడానికి ప్రయత్నించాం. అది కుదరలేదు. ఇదే తమకు బాధ్యతలను పంచుకోవడంలో కలిగే ఆనందం తెలిపింది. గతంలో నేనెన్నడూ గిన్నెలు తోమడం ఎరుగను. ఇప్పుడు అంట్లు తో మడమే కాదు.. వంట కూడా చేస్తున్నా. ఈ నాలుగు నెలల్లో మా ఇద్దరి మధ్య గొడవ జరిగిన సందర్భం లేనే లేదు’’ అని చెప్పారు.


సంతోషకరమైన వైవాహిక జీవితం కావాలంటే భార్య సంతోషంగా ఉండటం చాలా అవసరమన్నది అనుభవజ్ఞుల మాట. ప్రేమ, గౌరవంతోనే వైవాహిక బంధం బలోపేతమవుతుందని 57 ఏళ్ల వైవాహిక జీవితం గడిపిన సత్యనారాయణ చెప్పారు. భార్య సంతోషమే తన సంతోషమని భర్త భావిస్తే ఆ సంసారంలో గొడవలకు ఆస్కారమే ఉండదని నవ్వేశారు. ఆయనే మాట్లాడుతూ ‘‘ఒకరు ఎక్కువ కాదు, మరొకరు తక్కువ కాదు అని గుర్తించడంతో పాటుగా తమకు ఏం కావాలో నిజాయితీగా భార్యకు చెప్పాలి, భర్తకు ఏం అవసరమో గుర్తించి, అందుకు అనుగుణంగా భార్య ప్రవర్తిస్తే చాలా వరకూ సమస్యలు వచ్చే అవకాశాలుండవు’’ అని అన్నారు.

- హైదరాబాద్‌సిటీ, (ఆంధ్రజ్యోతి)



భార్యాభర్తల బంధం బలపడాలంటే దంపతులు కొన్ని అంశాల పట్ల జాగ్రత్త వహించాల్సిందేనంటున్నారు సైకాలజిస్ట్‌లు రమణ, శేఖర్‌. వారు ఏం సూచిస్తున్నారంటే..


సంసారంలో సరిగమలు


భర్త ఎలా ఉండాలంటే..

ఇంటికి యజమాని ఎలా ఉండాలో భర్తా అలాగే ఉండాలి. అలాగని కమాండింగ్‌ పనిచేయదు. అందరినీ కలుపుకొనిపోయేవాడే నాయకుడు. భరించే వాడనే కాదు.  

ఆధునిక ప్రపంచంలో భార్య ఇంటి పనులనే కాదు.. ఆఫీసు బాధ్యతల్లోనూ తలమునకలై ఉంటుంది. ఈ ఒత్తిడి నుంచి తేరుకునే సాంత్వన, ఆనందం జీవిత భాగస్వామి  దగ్గర లభిస్తుందనే నమ్మకం కలిగేలా భర్త వ్యవహరించాలి.  

స్వార్థం లేని ప్రేమకు విలువ ఎక్కువ. ఒక్కోసారి మీ భార్య వ్యక్తీకరించే భావాలు తమాషాగా అనిపించొచ్చు. కానీ వాటిలోనూ వాస్తవాలు ఉండి ఉండొచ్చు. వాటిని స్వీకరించాలి. ఆమె అభిప్రాయాలకు విలువనివ్వాలి. 

నీకు నేను.. నాకు నువ్వు అనేలా నాణ్యమైన సమయం భార్యతో గడపాలి. వీలైనంత వరకు చిన్న చిన్న సాయం చేయడం కూడా మీ బంధం బలోపేతం చేయడంలో పెద్ద మార్పునే తీసుకొస్తాయి. ఎప్పుడూ వంటగది ముఖం చూడని వ్యక్తి భార్య కోసం ఆమె నిద్ర లేవక ముందే కాఫీ పెట్టి గుడ్‌ మార్నింగ్‌ చెబితే ఆ ఆనందమే వేరు! 


భార్య ఎలా ఉండాలంటే..

ఫ భర్తపై షరతుల్లేని ప్రేమ ఉండాలి. భర్త అభిప్రాయాలను గౌరవించాలి. ఒకవేళ అంగీకరించని పక్షంలో భర్తకు అర్థమయ్యేలా మృదువుగా చెప్పాలి. అప్పటికీ  వినకపోతే నిశ్శబ్దంగా ఉండాలి. మౌనమే చాలా సమస్యలకు పరిష్కారం చూపుతుంది.

ఫ భర్త ఎప్పుడూ తన పక్కనే ఉండాలని కోరుకోవడం తప్పులేదు. దీన్నే భర్త కూడా కోరుకుంటాడని గుర్తించాలి. 

ఎన్నో సమస్యలతో ఇంటికి వచ్చే ఆయనకు మీరు ఓ సమస్య కాకూడదు. నిజానికి తన సమస్యను మీ దగ్గర ధైర్యంగా చెప్పగలిగే రీతిలో ఉండేలా మీరుండాలి. మీరిచ్చే సలహా పట్ల వారికి గురి కుదిరితే మీరు అడగకపోయినా ప్రతి అంశం మీతో పంచుకుంటారు.

భార్యాభర్తల బంధంలో చిన్న చిన్న కలతలు సహజం. అంత మాత్రాన మూడోవ్యక్తికి ఆస్కారం కలిగించకూడదు. ఎదుటి వ్యక్తి ముందు భర్త గురించి చెడుగా చెప్పొద్దు. 


Updated Date - 2020-08-09T07:45:24+05:30 IST