1991లో దాఖలైన పిటిషన్‌పై వారణాసి కోర్టు కీలక ఆదేశాలు

ABN , First Publish Date - 2021-04-09T00:34:01+05:30 IST

కాశీ విశ్వనాథ్ ఆలయం-జ్ఞాన్‌వపీ మసీదు ఆవరణలో పురావస్తు శాఖ సర్వేకి వారణాసి కోర్టు గురువారం అనుమతి

1991లో దాఖలైన పిటిషన్‌పై వారణాసి కోర్టు కీలక ఆదేశాలు

లక్నో: కాశీ విశ్వనాథ్ ఆలయం-జ్ఞాన్‌వపీ మసీదు ఆవరణలో పురావస్తు శాఖ సర్వేకి వారణాసి కోర్టు గురువారం అనుమతి ఇచ్చింది. ఆవరణ మొత్తం కాశీవిశ్వనాథ్ ఆలయానిదేనని, జ్ఞాన్‌వపీ మసీదు అందులో భాగం మాత్రమేనంటూ 1991లో విజయ్ శకర్ రస్తోగీ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఆవరణలో పురావస్తు శాఖ సర్వేకు ఆదేశించింది.


ఆదేశాలను గతవారం రిజర్వు చేసిన సివిల్ జడ్జ్ అశుతోష్ తివారీ నేడు ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)కి ఆదేశాలు జారీ చేశారు. ఏఎస్ఐకి చెందిన ఐదుగురు సభ్యుల బృందం ఆవరణలో అధ్యయనం నిర్వహించాలని ఆదేశించారు. సర్వేకు అయిన ఖర్చులను ప్రభుత్వమే భరించాలని సూచించారు.


ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారని తన పిటిషన్‌లో పేర్కొన్న రస్తోగి ఏఎస్ఐ సర్వేకు ఆదేశించడం ద్వారా సమస్యను పరిష్కరించాలని కోర్టును అభ్యర్థించారు. కాశీవిశ్వనాథ ఆలయాన్ని 2 వేల సంవత్సరాలకు పూర్వం నిర్మించారని, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో ఆలయాన్ని కూల్చివేశారని రస్తోగి తన పిటిషన్‌లో ఆరోపించారు. కాగా, ముస్లింలు మాత్రం 15 ఆగస్టు 1947 నాటి స్థితిని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను తాము హైకోర్టులో సవాలు చేస్తామని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు తెలిపింది. 

Updated Date - 2021-04-09T00:34:01+05:30 IST