భార్యను రెండు సార్లు పాముతో కాటేయించిన భర్త.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు

ABN , First Publish Date - 2021-10-13T19:38:47+05:30 IST

నాగు పాము చేత కరిపించి భార్యను హత్య చేసిన వ్యక్తికి కేరళలోని

భార్యను రెండు సార్లు పాముతో కాటేయించిన భర్త.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు

కొల్లం : నాగు పాము చేత కరిపించి భార్యను హత్య చేసిన వ్యక్తికి కేరళలోని కొల్లం అడిషినల్ సెషన్స్ కోర్టు బుధవారం రెండు జీవిత ఖైదులు, మరో 17 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై బాధితురాలి కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నత న్యాయస్థానంలో అపీలు చేస్తామని తెలిపారు. దోషికి మరణ శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరినప్పటికీ కోర్టు అంగీకరించలేదు.


ఉత్తర, సూరజ్ ఎస్ కుమార్ భార్యాభర్తలు. 2020 మే 7న ఆంచల్‌లోని భర్త ఇంట్లో ఆమె పాము కాటు వల్ల ప్రాణాలు కోల్పోయారు. సూరజ్ మొదట్లో ఓ వైపర్‌ను, ఆ తర్వాత ఓ కోబ్రాను కొని, ఉత్తరకు కాటు వేయించినట్లు రుజువైంది. ప్రాసిక్యూషన్ 87 మంది సాక్షులను, 286 దస్తావేజుల రూపంలోని సాక్ష్యాధారాలను, 40 ఇతర సాక్ష్యాలను విచారణలో ప్రవేశపెట్టింది. 


కోర్టు తీర్పు చెప్తూ, నిద్రపోతున్న ఉత్తరను ఆమె భర్త సూరజ్ పాము చేత కరిపించి, హత్య చేసినట్లు తెలిపింది. సానుభూతి పొందేందుకు దోషికి అర్హత లేదని తెలిపింది. ఐపీసీ 302 ప్రకారం  హత్యా నేరం రుజువుకావడంతో సూరజ్‌కు జీవిత ఖైదు, రూ.5 లక్షలు జరిమానా విధించింది. ఐపీసీ సెక్షన్ 307 ప్రకారం హత్యాయత్నం రుజువుకావడంతో మరొక జీవిత ఖైదు విధించింది. నేరానికి పాల్పడాలనే ఉద్దేశంతో విషం ఇవ్వడం ద్వారా గాయపరచినందుకు పదేళ్ళు, నేరానికి సంబంధించిన సాక్ష్యాధారాలను అదృశ్యం చేసినందుకు ఏడేళ్ళు జైలు శిక్ష విధించింది. దోషి తక్కువ వయసుగలవాడు కాబట్టి మరణ శిక్ష విధించడం లేదని తెలిపింది. 


బాధితురాలు ఉత్తర తల్లి మణిమేగలై మాట్లాడుతూ, తాను ఈ తీర్పు పట్ల అసంతృప్తిగా ఉన్నానని తెలిపారు. దోషికి మరణ శిక్ష విధించాలన్నారు. ఆయన చాలా క్రూరమైన నేరానికి పాల్పడినందువల్ల మరణ శిక్షకు అర్హుడని తెలిపారు. ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అపీలు చేస్తానని చెప్పారు. 



Updated Date - 2021-10-13T19:38:47+05:30 IST