కోర్ట్‌ సూట్‌

ABN , First Publish Date - 2021-06-02T04:56:55+05:30 IST

ఆఫీస్‌వేర్‌... పార్టీవేర్‌... రకరకాల డ్రెస్‌లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. మరి కోర్టుకు వెళ్లే యువ న్యాయవాదుల మాటేమిటి! ఇప్పటివరకూ ఏ ఫ్యాషన్‌ హౌసూ దానిపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. ఈ లోటు భర్తీ చేయడానికే ‘సేవ్‌ ది లూమ్‌’ సంస్థ ‘విధి’ పేరుతో సరికొత్త కలెక్షన్‌ విడుదల చేసింది.

కోర్ట్‌ సూట్‌

ఆఫీస్‌వేర్‌... పార్టీవేర్‌... రకరకాల డ్రెస్‌లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. మరి కోర్టుకు వెళ్లే యువ న్యాయవాదుల మాటేమిటి! ఇప్పటివరకూ ఏ ఫ్యాషన్‌ హౌసూ దానిపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. ఈ లోటు భర్తీ చేయడానికే ‘సేవ్‌ ది లూమ్‌’ సంస్థ ‘విధి’ పేరుతో సరికొత్త కలెక్షన్‌ విడుదల చేసింది. కోర్టు విధులకు హాజరయ్యే మహిళల కోసం ప్రత్యేకించి దీన్ని రూపొందించింది. కేరళ సంప్రదాయ శ్వేతవర్ణం చీర ‘కసవు’ను స్ఫూర్తిగా తీసుకుని, బార్‌ కౌన్సిల్‌ సూచించిన మార్గదర్శకాలను అనుసరించి వీటిని డిజైన్‌ చేసింది. ముఖ్యంగా యువ మహిళా లాయర్ల కోసం! కోర్టుల్లో, బయట కేసు పనుల్లో గంటలకు గంటలు నిమగ్నమై ఉంటారు. కనుక అటు సౌకర్యాన్నిచ్చేలా, హుందాగా కనిపించేలా, అన్నిటికీ మించి ఈజీవేర్‌గా ఉండాలి. ఆ కాన్సెప్ట్‌తో మార్కెట్‌లోకి వచ్చిన ఈ కలెక్షన్‌కు మంచి ఆదరణ కూడా లభిస్తోంది.


వరుస లాక్‌డౌన్లతో కేరళలో చాలామంది నేత పనివారికి ఉపాధి పోయింది. పూట గడవక ఇబ్బంది పడుతున్న వారిని కొంతైనా ఆదుకొనే ప్రయత్నంగా ‘సేవ్‌ హ్యాండ్‌లూమ్‌’ ఈ ప్రాజెక్ట్‌ చేపట్టింది. ఇది పూర్తిగా మహిళా చేనేత కళాకారులే తయారు చేసిన కలెక్షన్‌. ధారాళంగా గాలి ఆడే, తేలికగా ఉండే, చమట పీల్చే సున్నితమైన ఫ్యాబ్రిక్‌తో చేసిన చీరలివి. భారత తొలి మహిళా న్యాయవాది జస్టిస్‌ అన్నా చాందీ జయంతి సందర్భంగా ఇటీవల ఈ కలెక్షన్‌ను విడుదల చేసింది సంస్థ. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోలు అవే!  

Updated Date - 2021-06-02T04:56:55+05:30 IST