Abn logo
Sep 25 2021 @ 03:31AM

డిసెంబరు నుంచి నెలక కోటి డోసుల కొవాగ్జిన్‌ ముడి ఔషధం

ఇప్పటికే 20 లక్షల డోసులకు సరిపడా అందజేత: ఐఐఎల్‌  

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): 20 లక్షల కొవాగ్జిన్‌ టీకా డోసుల తయారీకి సరిపడా ముడి ఔషధ పదార్థాలను భారత్‌ బయోటెక్‌కు సరఫరా చేసినట్లు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఇండియన్‌ ఇమ్యునోలాజికల్స్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. వాటితో ఇప్పటికే వ్యాక్సిన్‌ డోసులు కూడా తయారైనట్లు సమాచారం అందిందని పేర్కొంది. శుక్రవారం ఐఐఎల్‌ను కేంద్ర మత్స్య, పశు, డెయిరీ శాఖ మంత్రి పురుషోత్తమ్‌ రూపాలా సందర్శించారు. ఈసందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఐఎల్‌ ఉత్పత్తి చేసిన కొవాగ్జిన్‌ ముడి ఔషధాన్ని భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లాకు ఆయన లాంఛనంగా అందజేశారు. భవిష్యత్తులో ఐఐఎల్‌కు అన్ని రకాల మద్దతును అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇకపై ప్రతినెలా 30 లక్షల డోసుల తయారీకి సరిపోయేంత ముడి ఔషధాన్ని ఉత్పత్తి చేస్తామని ఐఐఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.ఆనంద్‌ కుమార్‌ తెలిపారు. డిసెంబరు నుంచి ప్రతినెలా కోటి కొవాగ్జిన్‌ డోసుల తయారీకి సరిపడా ముడి సరుకును అందిస్తామన్నారు.