పంద్రాగస్టుకు కోవ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2020-07-04T07:15:15+05:30 IST

కొవిడ్‌-19కు అడ్డుకట్ట వేసే దేశీ వ్యాక్సిన్‌ కోవ్యాక్సిన్‌ను ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి తేవాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) లక్ష్యంగా పెట్టుకుంది. ఈమేరకు.. క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణకు అవసరమైన

పంద్రాగస్టుకు కోవ్యాక్సిన్‌

  • ప్రభుత్వానికిది ప్రాధాన్య ప్రాజెక్టు
  • అనుమతులు త్వరగా తెచ్చుకోండి
  • జూలై 7కల్లా నమోదు ప్రారంభించండి
  • క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణకు ఎంపికైన
  • 12 ఆస్పత్రులకు ఐసీఎంఆర్‌ లేఖ
  • వాటిలో మన నిమ్స్‌, విశాఖ కేజీహెచ్‌
  • ఇంత ‘తొందర’గా ఎలా సాధ్యం?
  • కొందరు వైద్యనిపుణుల ఆందోళన


న్యూఢిల్లీ, జూలై 3: కొవిడ్‌-19కు అడ్డుకట్ట వేసే దేశీ వ్యాక్సిన్‌ కోవ్యాక్సిన్‌ను ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి తేవాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) లక్ష్యంగా పెట్టుకుంది. ఈమేరకు.. క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణకు అవసరమైన అనుమతులను తెచ్చుకునే ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా సంబంధిత వైద్య సంస్థలకు సూచించింది. క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించి 12 వైద్య సంస్థలు, ఆస్పత్రులకు అనుమతులిచ్చిన ఐసీఎంఆర్‌.. ఈ ట్రయల్స్‌లో పాల్గొనడానికి ముందుకువచ్చేవారిని నమోదు చేసుకునే ప్రక్రియను (సబ్జెక్ట్‌ ఎన్‌రోల్‌మెంట్‌) జూలై 7కల్లా మొదలుపెట్టాలని సూచించింది. పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ), ఐసీఎంఆర్‌తో కలిసి హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ రూపొందించిన కోవ్యాక్సిన్‌ను మానవులపై పరీక్షించేందుకు  భారత డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ (డీసీజీఐ) ఇటీవలే అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.


హైదరాబాద్‌లో నిమ్స్‌, విశాఖలోని కేజీహెచ్‌ సహా 12 ఆస్పత్రుల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ఆస్పత్రులకు ఐసీఎంఆర్‌ డీజీ డాక్టర్‌ బలరామ్‌ భార్గవ లేఖ రాశారు. కోవ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఒకటిగా భావించి, అత్యున్నతస్థాయిలో పర్యవేక్షిస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘‘కొవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రజారోగ్య అత్యవసర స్థితిని, వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని.. క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించడానికి కావాల్సిన అనుమతుల పనులను వేగంగా పూర్తిచేసి జూలై 7లోగా సబ్జెక్ట్‌ ఎన్‌రోల్‌మెంట్‌ను ప్రారంభించండి’’ అని సూచించారు. ‘‘అన్ని క్లినికల్‌ ట్రయల్స్‌నూ ముగించి ప్రజావినియోగానికి వీలుగా ఆగస్టు 15కల్లా వ్యాక్సిన్‌ను ప్రారంభించాలని భావిస్తున్నాం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి భారత్‌ బయోటెక్‌ నిర్విరామంగా కృషి చేస్తోంది. అయితే, తుదిఫలితాలు మాత్రం ట్రయల్స్‌ నిర్వహిస్తున్న ఆస్పత్రుల సహకారంపైనే ఆధారపడి ఉంటాయి’’ అని కూడా పేర్కొన్నారు.


తొందర వద్దు..

ఎంత వేగంగా ప్రయోగాలు చేసినా ఒక వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి కనీసం 12 నుంచి 18 నెలల సమయం పడుతుందని, మరి క్లినికల్‌ ట్రయల్స్‌ను అంత వేగంగా జరిపి ఆగస్టు 15కల్లా వ్యాక్సిన్‌ను ఎలా అందుబాటులోకి తెస్తారని కొందరు వైద్యనిపుణులు ప్రశ్నిస్తున్నారు. ‘‘నాకు తెలిసినంతలో ఇప్పటివరకూ ఏ తరహా వ్యాక్సిన్‌నూ ఇంత వేగంగా అభివృద్ధి చేయలేదు. వేగవంతమైన ట్రయల్స్‌ అనుకుందామనుకున్నా కూడా.. ఇది మరీ ‘తొందర’గా కనపడుతోంది. దీనివల్ల చాలా ప్రమాదాలుంటాయి.’’ అని కస్తూర్బా మెడికల్‌ కాలేజ్‌ ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగానికి చెందిన డాక్టర్‌ అనంత్‌ భాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వేగవంతమైన ట్రయల్స్‌ జరిపి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తామని వాగ్దానం చేయడం హర్షణీయమేగానీ.. మనం మరీ తొందరపాటుగా వ్యవహరిస్తున్నామేమో కూడా ఆలోచించుకోవాలని ప్రముఖ వైరాలజిస్టు ఉపాసన రే  సూచించారు. ఈ ప్రాజెకు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, అదనపు ఒత్తిడి వల్ల సరైన ఉత్పత్తులు రావని అభిప్రాయపడ్డారు. అయితే, ‘‘ఫలితాలు  సంతృప్తికరంగా ఉంటేనే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తాం. లేకపోతే విడుదల చేయం’’ అని ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్త ఒకరు వివరణ ఇచ్చారు.


జైడ్‌సకూ..

భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌తోపాటు.. జైడస్‌ క్యాడిలా రూపొందిస్తున్న ‘జైకొవ్‌-డి’ వ్యాక్సిన్‌ను కూడా మానవులపై పరీక్షించేందుకు డీసీజీఐ అనుమతిచ్చింది. ‘జైకొవ్‌-డి’ వ్యాక్సిన్‌ను జైడస్‌ సంస్థ అహ్మదాబాద్‌లోని తన ‘వ్యాక్సిన్‌ టెక్నాలజీ సెంటర్‌’లో అభివృద్ధి చేసింది. ఎలుకలు, కుందేళ్లపై చేసిన ప్రయోగాల్లో ఈ వ్యాక్సిన్‌ సానుకూల ఫలితాలను ఇచ్చిందని, ఈ వ్యాక్సిన్‌తో వాటిలో రోగనిరోధక శక్తి ఉత్తేజితమైందని, ఆ సమయంలో ఉత్పన్నమైన యాంటీబాడీలు కరోనా వైర్‌సను పూర్తిగా అచేతనం చేయగలిగాయని జైడస్‌ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెలలో దేశంలోని ఏడు చోట్ల 1000 మందికి ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వడానికి ప్రణాళికలు రచించినట్లు వెల్లడించింది.


నిమ్స్‌లో కసరత్తు షురూ..

కోవ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణకు ఆస్పత్రి వర్గాలు కసరత్తు ప్రారంభించాయి. ఇందులో భాగంగా శనివారం 12 మంది సభ్యులతో కూడిన నిమ్స్‌ ఎథిక్స్‌ కమిటీ సమావేశం కానుంది. వైద్యులు, లాయర్లు, సామాజిక వేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కూడిన ఈ కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన తర్వాత.. సోమవారం నుంచి క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించాలని భావిస్తున్నారు. ట్రయల్స్‌లో భాగంగా.. షుగర్‌, బీపీ, హృద్రోగం, కిడ్ని, ఊపిరితిత్తులు తదితర అనారోగ్య సమస్యలు లేని 22 నుంచి 55 మధ్య వయసున్న 60- 70 మంది ఆరోగ్యవంతులను (వెల్త్‌ వాలంటీర్లు) ఎంపిక చేస్తారు. వారికి ఈ వ్యాక్సిన్‌ ఇస్తారు.

Updated Date - 2020-07-04T07:15:15+05:30 IST