బహిరంగ మార్కెట్లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు

ABN , First Publish Date - 2022-01-27T22:55:12+05:30 IST

కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ టీకాలు ఇక బహిరంగ మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. అందుకు అవసరమైన అనుమతులను

బహిరంగ మార్కెట్లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు

న్యూఢిల్లీ: కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ టీకాలు ఇక బహిరంగ మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. అందుకు అవసరమైన అనుమతులను భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) జారీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ ట్విట్టర్ ద్వారా తెలిపారు.


న్యూ డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ రూల్స్-2019 ప్రకారం మార్కెట్లో విక్రయానికి ఈ రెండు వ్యాక్సిన్లకు అనుమతులు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఈ నిబంధనల ప్రకారం.. ప్రస్తుతం జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్, ప్రొగమాటిక్ సెట్టింగ్ కోసం సరఫరా చేసే టీకాల సమాచారాన్ని సమర్పించాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. అలాగే, ప్రతికూల ప్రభావాలపైనా పర్యవేక్షణ ఉంటుందన్నారు. 


అయితే, ఈ రెండు వ్యాక్సిన్లు మెడికల్ షాపుల్లో అందుబాటులో ఉండవు. ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లు కొనుగోలు చేసి ప్రజలకు టీకాలు వేయాల్సి ఉంటుంది. దేశంలో తయారవుతున్న టీకాల్లో 25 శాతం టీకాలను ప్రైవేటు ఆసుపత్రులు కొనుగోలు చేసుకునేందుకు గతంలో ప్రభుత్వం అనుమతించింది. అయితే, ఇకపై ఈ కోటా అందుబాటులో ఉండదు. 


కొవిషీల్డ్ టీకాను సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేయగా, కొవాగ్జిన్ టీకాను భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. ఇకపై ఈ రెండు ఆసుపత్రులు, క్లినిక్స్‌లలో అందుబాటులో ఉంటాయి. అయితే, టీకా కార్యక్రమం మాత్రం తప్పనిసరిగా కొవిన్ ప్లాట్‌ఫామ్ ద్వారానే జరగాలి. 

Updated Date - 2022-01-27T22:55:12+05:30 IST