'617 కొవిడ్ వేరియంట్ల'పై కోవాగ్జిన్‌ సమర్థంగా పని చేస్తుంది: ఫౌసీ

ABN , First Publish Date - 2021-04-28T19:05:31+05:30 IST

భారత్‌ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్‌.. 617 కొవిడ్ వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తుందని అమెరికా ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుణుడు, వైట్‌హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డా. ఆంథోనీ ఫౌసీ అన్నారు.

'617 కొవిడ్ వేరియంట్ల'పై కోవాగ్జిన్‌ సమర్థంగా పని చేస్తుంది: ఫౌసీ

వాషింగ్టన్: భారత్‌ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్‌.. 617 కొవిడ్ వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తుందని అమెరికా ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుణుడు, వైట్‌హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డా. ఆంథోనీ ఫౌసీ అన్నారు. ఇటీవల ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారికి సంబంధించిన రోజువారీ డేటాను తాను స్వయంగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. మంగళవారం కాన్ఫరెన్స్ కాల్ ద్వారా మీడియాతో మాట్లాడిన ఫౌసీ.. "భారత్‌ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్‌ పనితీరు 617 కొవిడ్ వేరియంట్లపై భేష్‌గా ఉంది. భారత్‌లో ఇటీవల కోవాగ్జిన్‌ టీకా తీసుకున్న వారికి సంబంధించిన సమాచారాన్ని పరిశీలించిన తర్వాత ఈ విషయం నిర్థారణ అయింది. ఇండియాలో ప్రస్తుతం కొనసాగుతున్న మహమ్మారి ఉధృతి కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సినేషన్." అని ఫౌసీ చెప్పుకొచ్చారు.


అటు న్యూయార్క్ టైమ్స్‌ కూడా కోవాగ్జిన్‌ పనితీరును ప్రశంసించింది. సార్స్‌ కోవ్‌-2 కరోనావైరస్‌ యాంటీబాడీస్‌ను విడుదల చేయడంలో కోవాగ్జిన్‌ సమర్థంగా పనిచేస్తున్నట్లు వెల్లడించింది. ఇదిలాఉంటే.. కరోనాతో పోరాడుతున్న భారతదేశానికి అగ్రరాజ్యం అమెరికా పూర్తి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా కట్టడి కోసం సాయపడేందుకు అమెరికా నుంచి స్ట్రైక్‌ టీమ్ త్వరలోనే భారత్‌కు వెళ్లనుందని వైట్‌హౌస్ కోవిడ్-19 రెస్పాన్స్ సీనియర్ సలహాదారు ఆండీ స్లావిట్ పేర్కొన్నారు. ఇక భారత్ బయోటెక్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంయుక్తంగా రూపొందించిన కరోనా టీకా కోవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్) ఈ ఏడాది జనవరి 3న ఆమోదించిన విషయం తెలిసిందే. కాగా, కొవిడ్-19పై ఈ వ్యాక్సిన్ 78 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ట్రయల్స్‌లో నిర్ధారణ అయింది. 

Updated Date - 2021-04-28T19:05:31+05:30 IST