కంపెనీల దాగుడుమూతలు

ABN , First Publish Date - 2021-07-29T05:53:38+05:30 IST

సమాచార వెల్లడిపై లిస్టెడ్‌ కంపెనీలు అనుసరిస్తున్న వైఖరిపై మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ అసహనం

కంపెనీల దాగుడుమూతలు

  • అరకొర సమాచారంతో సరి.. మరిన్ని ‘ఐపీఓ’ సంస్కరణలు
  •  సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి 


న్యూఢిల్లీ: సమాచార వెల్లడిపై లిస్టెడ్‌ కంపెనీలు అనుసరిస్తున్న వైఖరిపై మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ అసహనం వ్యక్తం చేసిం ది. నిబంధనలకు అనుగుణంగా అరకొర సమాచారం వెల్లడించి కంపెనీలు చేతులు దులుపుకుంటున్నాయని సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి అసంతృప్తి వ్యక్తం చేశారు. క్యాపిటల్‌ మార్కెట్స్‌పై ఫిక్కీ నిర్వహించిన వార్షిక సదస్సులో ఆయన మాట్లాడుతూ.. సమాచార వెల్లడిని కంపెనీలు మొక్కుబడి వ్యవహారంగా కాకుండా తూచా తప్పకుండా పాటించాలని కోరారు.


లిస్టెడ్‌ కంపెనీలు తూతూమంత్రంగా సమాచారం వెల్లడించడం ఏ మాత్రం ఆమోద యోగ్యం కాదని త్యాగి స్పష్టం చేశారు. ఇన్వెస్టర్ల ప్రయోజనాల కోసం ఈ సమాచార వెల్లడిలో స్వతంత్ర డైరెక్టర్లు, రుణదాతల తరఫున ఆయా కంపెనీల బోర్డుల్లో నామినేట్‌ అయిన డైరెక్టర్లు కీలక పాత్ర వహించాలని కోరారు. నిర్వహణ ప్రమాణాలతో పాటు, కంపెనీల సమాచార వెల్లడిలో పారదర్శకత పెరగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. 


మరిన్ని సంస్కరణలు: ఐపీఓ మార్కెట్లో మరిన్ని సంస్కరణలు తీసుకు రానున్నట్టు త్యాగి వెల్లడించారు. ముఖ్యంగా బుక్‌ బిల్డింగ్‌, ప్రైస్‌ బ్యాండ్‌ నిర్ణయంలో ఈ సంస్కరణలు ఉంటాయన్నారు. దీనికి సంబంధించి సెబీ ఇప్పటికే చర్చాపత్రాలు విడుదల చేసినట్టు తెలిపారు. ప్రిఫరెన్షియల్‌ ఇష్యూల విషయంలోనూ మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చే యోచన ఉందన్నారు. ఐపీఓల స్వరూపంలో వచ్చిన మార్పులనూ ఆయన ప్రస్తావించారు. గతంలో వ్యాపార విస్తరణకు అవసరమైన నిధుల కోసం కంపెనీలు ఐపీఓలకు వచ్చేవన్నారు. ఇప్పుడు ఉన్న ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని వెనక్కి తీసుకునేందుకు ఐపీఓలు పెద్ద మార్గంగా మారాయన్నారు. 


పసిడి దిగుమతులు: కాగా బంగారం దిగుమతులన్నీ స్పాట్‌ ఎక్స్ఛేంజీల ద్వారానే జరగాలని సెబీ హోల్‌టైమ్‌ సభ్యు డు జీ మహాలింగం అన్నారు. ఇలా చేయడం ద్వారా దేశంలోకి దిగుమతి అయ్యే బంగారం విలువ ఎప్పటికప్పుడు నమోదవుతందన్నారు. టర్కీ, చైనా ఇప్పటికే ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయన్నారు.  




ఐదేళ్లలో రూ.1.8 లక్షల కోట్లు

గత ఆరేళ్లలో కంపెనీల నిధుల సేకరణ రూ.30,000 కోట్ల నుంచి రూ.1.8 లక్షల కోట్లకు పెరిగిందని అజయ్‌ త్యాగి వెల్లడించారు. గతంలో స్థిరాస్తులు, బ్యాంకు డిపాజిట్లు, బంగారానికే పరిమితమైన వ్యక్తిగత పెట్టుబడులు ఇప్పుడు షేర్‌ మార్కెట్‌కూ విస్తరించాయన్నారు. ఫలితంగా 2019-20లో జీడీపీలో 0.3  శాతంగా ఉన్న వ్యక్తుల సెక్యూరిటీల  మార్కెట్‌ పెట్టుబడులు 2021 మార్చి నాటికి 1.2 శాతానికి చేరినట్టు తెలిపారు. దేశంలో రుణ పత్రాల (బాండ్స్‌) మార్కెట్‌ను మరింత విస్తృత పరచాల్సిన అవసరం ఉందన్నారు.


నష్టాల కంపెనీలూ లిస్ట్‌ కావచ్చు 

నష్టాల్లో ఉన్న కంపెనీలు తమ షేర్లను స్టాక్‌ ఎక్స్చేంజీల్లో లిస్ట్‌ చేయడాన్ని సెబీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అమర్‌జిత్‌ సింగ్‌ సమర్ధించారు. సెబీ నిబంధనల ప్రకారం చూస్తే లాభాల్లో ఉన్న కంపెనీలతో పాటు నష్టాల్లో ఉన్న కంపెనీలూ తమ షేర్లను స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేయవచ్చన్నారు. ఇటీవల మార్కెట్‌కు వచ్చిన జొమాటో ఐపీఓ, త్వరలో పబ్లిక్‌ ఇష్యూకి రానున్న పేటీఎం ఇష్యూలను దృష్టిలో ఉంచుకుని సింగ్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్నారు. 


Updated Date - 2021-07-29T05:53:38+05:30 IST