కాలిఫోర్నియాలో కరోనా బీభత్సం !

ABN , First Publish Date - 2021-01-20T12:39:51+05:30 IST

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కరోనా వైరస్‌ బీభత్సం సృష్టిస్తోంది. ఇక్కడ పాజిటివ్‌ కేసులు 30 లక్షల మార్కుని దాటేశాయి.

కాలిఫోర్నియాలో కరోనా బీభత్సం !

లాస్‌ఏంజెల్స్‌, జనవరి 19: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కరోనా వైరస్‌ బీభత్సం సృష్టిస్తోంది. ఇక్కడ పాజిటివ్‌ కేసులు 30 లక్షల మార్కుని దాటేశాయి. అమెరికాలో 30 లక్షలకుపైగా కేసులు నమోదైన తొలి రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. 4 కోట్ల జనాభా కలిగిన ఈ రాష్ట్రంలో డిసెంబరు 24 వరకు 20 లక్షల కేసులే ఉన్నాయి. నెల రోజుల్లోనే కేసులు విపరీతంగా పెరగడంతో ఆ సంఖ్య 30 లక్షలు దాటింది. కాలిఫోర్నియాలో ఇప్పటివరకు 33,600 మంది కొవిడ్‌తో చనిపోయారు. 30 రాష్ట్రాల్లో వారం రోజుల్లోనే మరణాలు అమాంతం పెరిగాయి. దేశంలో మరణాల సంఖ్య 4లక్షలు దాటింది. అమెరికాలో ఇప్పటి వరకు 2.44 కోట్ల కేసులు బయటపడ్డాయి. కాగా, ఈశాన్య చైనాలో కరోనా వైరస్‌ కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ ప్రాంతంలో మంగళవారం ఒక్కరోజే 118 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా కాలంలోనూ విమానయానం, పర్యాటకం, రిటైల్‌ రంగాలకు తలుపులు తెరిచిన దుబాయ్‌.. ఇప్పుడు వైరస్‌ ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. గత నెలతో పోలిస్తే అక్కడ కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది.


దేశంలో కరోనా కొత్త కేసులు 10 వేలే!

దేశంలో కరోనా కొత్తకేసులు 7నెలల అత్యల్ప సంఖ్య లో నమోదయ్యాయి. తాజాగా 10,064 మందికి వైరస్‌ నిర్ధారణ అయిందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. జూన్‌ 12వ తేదీ తర్వాత ఇవే అతి తక్కువ. మరో 137 మంది చనిపోయినట్లు తెలిపింది. 8 నెలల్లో ఇవే అత్యల్పం. అయితే, ఆదివారం 5.48 లక్షల పరీక్షలే చేయడంతో పాజిటివ్‌లు ఆ మేరకే వచ్చాయి. కొన్ని రోజులుగా 5 వేల పైనే కేసులు నమోదవుతున్న కేరళలో కొత్తగా 3,346 కేసులే వచ్చాయి. మహారాష్ట్ర (1,924)లోనూ భారీగా తగ్గాయి. మరోవైపు 17,411 మంది కోలుకున్నారు. 

Updated Date - 2021-01-20T12:39:51+05:30 IST