మాల్దీవుల్లో 5 వేలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-08-11T04:32:33+05:30 IST

మాల్దీవుల్లో ఆదివారం ఒక్కరోజే 143 కరోనా కేసులు నమోదైనట్టు అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది.

మాల్దీవుల్లో 5 వేలు దాటిన కరోనా కేసులు

మాలే: మాల్దీవుల్లో ఆదివారం ఒక్కరోజే 143 కరోనా కేసులు నమోదైనట్టు అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5 వేలు దాటింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి మాల్దీవుల్లో ఇప్పటివరకు 5,041 కరోనా కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన 143 కేసుల్లో 107 మంది మాల్దీవులకు చెందిన వారు కాగా.. 28 మంది బంగ్లాదేశీయులు, ఆరుగురు భారతీయులు, ఇద్దరు నేపాలీలుగా తెలుస్తోంది. ఇక మాల్దీవుల్లో ఇప్పటివరకు మొత్తం 19 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మాల్దీవుల ప్రభుత్వం జూలై 15 నుంచి పర్యాటకుల కోసం సరిహద్దులను తెరిచింది. సరిహద్దులు తెరిచిన నాటి నుంచి ఎనిమిది మంది పర్యాటకులకు, తొమ్మిది మంది పర్యాటక సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరోపక్క ప్రభుత్వం ఎక్కడికక్కడ కఠిన చర్యలను అమలు చేస్తోంది. బహిరంగ ప్రదేశంలో ఫేస్‌మాస్క్ ధరించనందుకు అధికారులు ఇప్పటివరకు 278 మందికి జరిమానా విధించారు. మరోపక్క భద్రతా ప్రమాణాలు పాటించని 246 దుకాణాల(మార్కెట్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లు, సెలూన్లు)ను మూసివేశారు. దుకాణాలు భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నాయా లేదా అని అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఇక రాజధాని ప్రాంతంలో రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంది.

Updated Date - 2020-08-11T04:32:33+05:30 IST