కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న న్యూయార్క్.. కానీ..

ABN , First Publish Date - 2020-06-29T23:25:14+05:30 IST

ప్రపంచదేశాల్లో అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే.

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న న్యూయార్క్.. కానీ..

న్యూయార్క్: ప్రపంచదేశాల్లో అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. మరోపక్క అమెరికాలో అత్యధిక కరోనా కేసులు న్యూయార్క్‌లోనే నమోదయ్యాయి. ఏప్రిల్ నెలలో కరోనా దెబ్బకు న్యూయార్క్ అతలాకుతలం అయిపోయింది. ఆసుపత్రుల్లో కనీసం వెంటిలేటర్లు అందుబాటులో లేక వందలాది మంది ఆసుపత్రికి వెళ్లిన నిమిషాల్లో ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. మరణించిన వారిని పూడ్చడానికి శ్మశానాలు కూడా సరిపోలేదంటే న్యూయార్క్‌ను కరోనా మహమ్మారి ఏ విధంగా వణికించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు న్యూయార్క్‌లో ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం న్యూయార్క్‌లో కరోనా అదుపులోకి వచ్చింది. ఏప్రిల్‌లో నిత్యం 900 మంది కరోనా కారణంగా చనిపోయేవారు. ఇప్పుడు ఆ సంఖ్య కేవలం ఐదు నుంచి పదిలోపే ఉంటోంది. 


శనివారం కరోనా కారణంగా న్యూయార్క్‌లో కేవలం ఐదుగురే మరణించినట్టు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో తెలిపారు. ఏప్రిల్ పరిస్థితిని పూర్తిగా అధిగమించామని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం అమెరికాలోని ఇతర రాష్ట్రాల వల్ల న్యూయార్క్‌లో కరోనా పెరిగే అవకాశాలున్నాయని ఆయన ఆందోళన చెందుతున్నారు. అమెరికా వ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో మిగతా రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ రాష్ట్రాలకు చెందిన వారు న్యూయార్క్‌కు వస్తుండటంతో వారి వల్ల న్యూయార్క్‌లో కరోనా మహమ్మారి మరోమారు విజృంభించే అవకాశం కనపడుతోంది. దీంతో కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చే వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌కు పంపించేలా న్యూయార్క్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కాగా.. న్యూయార్క్‌లో ఇప్పటివరకు 4,16,787 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా కారణంగా న్యూయార్క్‌లో 31,484 మంది మృత్యువాతపడ్డారు. ఇక అమెరికా వ్యాప్తంగా 26,37,077 కేసులు నమోదుకాగా.. 1,28,437 మంది మరణించారు.

Updated Date - 2020-06-29T23:25:14+05:30 IST