కోవిడ్-19 : మోల్‌నుపిరవిర్‌కు అత్యవసర వినియోగ అనుమతి

ABN , First Publish Date - 2021-12-29T02:00:08+05:30 IST

నగరంలోని ఆప్టిమస్ ఫార్మా తయారు చేసిన కోవిడ్

కోవిడ్-19 : మోల్‌నుపిరవిర్‌కు అత్యవసర వినియోగ అనుమతి

హైదరాబాద్ : నగరంలోని ఆప్టిమస్ ఫార్మా తయారు చేసిన కోవిడ్-19 ఔషధం మోల్‌నుపిరవిర్‌కు ఆంక్షలతో కూడిన అత్యవసర వినియోగ అనుమతి లభించింది. దేశవ్యాప్తంగా 29 భౌగోళిక అధ్యయన ప్రాంతాల్లో 1,218 మందిపై నిర్వహించిన మూడో దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. దీనిని భారతీయ మార్కెట్లోకి మంగళవారం ప్రవేశపెట్టారు. ఈ వివరాలను ఆప్టిమస్ ఫార్మా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ డీ శ్రీనివాస రెడ్డి చెప్పారు. 


దేశంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో ఈ ఔషధం పనితీరును పరిశీలించేందుకు రకరకాల ప్రజా సమూహాలను ఈ పరీక్షల్లో భాగస్వాములను చేయాలని తాము నిర్ణయించామని చెప్పారు. మోల్‌నుపిరవిర్‌తో ఐదు రోజులపాటు చికిత్స చేస్తే వైరల్ లోడ్ తగ్గుతుందని రుజువైందని తెలిపారు. ఏపీఐని నగరంలోని పరిశోధన, అభివృద్ధి కేంద్రంలో అభివృద్ధిపరచినట్లు తెలిపారు. 


సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) మార్గదర్శకాలకు అనుగుణంగా స్టాండర్డ్ ఆఫ్ కేర్ (ఎస్ఓసీ) మెడికేషన్‌తోపాటు మోల్‌నుపిరవిర్‌ను క్లినికల్ ట్రయల్స్‌లో ఇచ్చినపుడు సత్ఫలితాలు రుజువైనట్లు ఆప్టిమస్ ఫార్మా ప్రకటించింది. ఎస్ఓసీ గ్రూప్‌తో పోల్చినపుడు మోల్‌నుపిరవిర్‌ + ఎస్ఓసీ గ్రూప్‌లో హాస్పిటలైజేషన్ రేటు తక్కువగా ఉందని తెలిపింది. ఈ అధ్యయనం మొత్తం మీద మోల్‌నుపిరవిర్ వల్ల తీవ్రమైన భద్రతపరమైన ఆందోళన కనిపించలేదని పేర్కొంది. మరణాలు సంభవించలేదని వెల్లడించింది. 


Updated Date - 2021-12-29T02:00:08+05:30 IST