బ్రిటన్‌లో కరోనా కరాళ నృత్యం !

ABN , First Publish Date - 2020-09-22T16:14:10+05:30 IST

కరోనా విషయంలో బ్రిటన్‌ చాలా దుర్భల స్థితిలో ఉందని ఆ దేశ అత్యున్నత వైద్య సలహాదారుడు, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ క్రిస్‌ విట్టీ హెచ్చరించారు.

బ్రిటన్‌లో కరోనా కరాళ నృత్యం !

లండన్‌, న్యూయార్క్‌, ప్రాగ్‌, సెప్టెంబరు 21: కరోనా విషయంలో బ్రిటన్‌ చాలా దుర్భల స్థితిలో ఉందని ఆ దేశ అత్యున్నత వైద్య సలహాదారుడు, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ క్రిస్‌ విట్టీ హెచ్చరించారు. సరైన చర్యలు చేపట్టకుంటే కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతాయన్నారు. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు కొత్తగా స్వల్ప నిషేధాజ్ఞలను ప్రకటించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న తరుణంలో సోమవారం ఆయన బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.


దేశంలో కేసుల వ్యాప్తి ఆందోళనకరంగా ఉందన్నారు. ‘వారాల తరబడి కేసులు పెరిగిన తర్వాత కూడా మనం సరైన చర్యలు చేపట్టలేదు’ అని ఆక్షేపించారు. కాగా, ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలన్నదానిపై చర్చించేందుకు ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మంత్రులతో ఈ వారాంతంలో సమావేశం నిర్వహించనున్నారు. కరోనా చైన్‌ను బ్రేక్‌ చేసేందుకు ఈ వారాంతంలో ప్రభుత్వం స్వల్ప నియంత్రణలను విధించే అవకాశం ఉంది. మరోవైపు చెక్‌ రిపబ్లిక్‌లో కరోనా కేసులు రికార్డుస్థాయిలో పెరగడానికి  బాధ్యత వహిస్తూ ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఆదం వోజ్‌టెక్‌ సోమవారం రాజీనామా చేశారు. దేశంలో రోజువారీ కేసుల సంఖ్య తాజాగా 3 వేలకు చేరింది. ఇప్పటి వరకు దేశంలో 49,290 కేసులు నమోదవగా, 503 మంది మరణించారు. దీంతో ప్రతిపక్షాల ఒత్తిడి మేరకు ఆయన రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఎవరిని ఆరోగ్యమంత్రిగా నియమిస్తారనేది ఇంకా స్పష్టం కాలేదు. కాగా, కరోనా చికిత్సలో వైద్యులకు పెరిగిన అనుభవం, వైద్య సేవల్లో మెరుగుదల నేపథ్యంలో ప్రస్తుతం ప్రమాదకరస్థాయికి వెళ్లిన రోగులు సైతం కోలుకునే అవకాశాలు మెరుగయ్యాయి. 

Updated Date - 2020-09-22T16:14:10+05:30 IST