యూఏఈలో ఒకేరోజు భారీగా నమోదైన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-10-01T14:46:21+05:30 IST

యూఏఈ వ్యాప్తంగా బుధవారం 1,100 కరోనా కేసులు నమోదయ్యాయి.

యూఏఈలో ఒకేరోజు భారీగా నమోదైన కరోనా కేసులు

దుబాయి: యూఏఈ వ్యాప్తంగా బుధవారం 1,100 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. యూఏఈలో సెప్టెంబర్ 24న అత్యధికంగా 1,083 కరోనా కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు కేసుల సంఖ్య 1,100 దాటింది. దేశవ్యాప్తంగా ఒకేరోజు వెయ్యికి పైగా కేసులు నమోదుకావడం ఇది మూడోసారి. కాగా.. కొత్తగా నమోదైన కేసులతో యూఏఈలో మొత్తం కేసుల సంఖ్య 83,724కు చేరుకుంది. మరోపక్క కరోనా బారిన పడి యూఏఈలో ఇప్పటివరకు మొత్తం 410 మంది మృత్యువాతపడ్డారు. 


ఇదిలా ఉండగా.. బుధవారం ఒక్కరోజే 1,186 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాకుండా బుధవారం ఒక్కరోజే లక్షకు పైగా కరోనా పరీక్షలను నిర్వహించినట్టు తెలిపింది. గడిచిన రెండు వారాల్లో ఒకేరోజు లక్షకు పైగా పరీక్షలు నిర్వహించడం ఇది మూడోసారి. యూఏఈ ప్రభుత్వం ఇప్పటివరకు 96 లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేసింది. కరోనాపై అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటూ వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్ట అధికారులు తెలిపారు. సెప్టెంబర్ నెల మొదటి 15 రోజుల్లో 24,894 మంది కరోనా నిబంధలను ఉల్లంఘించినట్టు తాము గుర్తించామని అధికారులు వెల్లడించారు.

Updated Date - 2020-10-01T14:46:21+05:30 IST