వైరస్‌.. ఉగ్రరూపం

ABN , First Publish Date - 2021-04-14T06:05:19+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉగ్రరూపం దాలుస్తోన్నది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందే తప్ప ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.

వైరస్‌.. ఉగ్రరూపం
అడవి తక్కెళ్లపాడులోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ని పరిశీలిస్తున్న జేసీ ప్రశాంతి, డీఎంహెచ్‌వో యాస్మిన్

తాజాగా 622 మందికి కరోనా

గుంటూరులో 288, మంగళగిరిలో 80 కేసులు

సెకండ్‌వేవ్‌ తర్వాత 24 గంటల్లో అత్యధికంగా నమోదు 


గుంటూరు/చిలకలూరిపేట, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్‌ వేవ్‌ ఉగ్రరూపం దాలుస్తోన్నది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందే తప్ప ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా 24 గంటల వ్యవధిలో 622 మందికి వైరస్‌ వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తున్నది. గత ఏడాది జూన్‌, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఏ విధంగా అయితే వైరస్‌ వ్యాప్తి చెందిందో ఆ పరిస్థితులు మళ్లీ ఇప్పుడు తలపిస్తున్నాయి. అప్పట్లో పాక్షికంగా లాక్‌డౌన్‌ అమలులో ఉండటం, వ్యాపార కార్యకలాపాలపై ఆంక్షలు, కొవిడ్‌ కంటైన్‌మెంట్‌ పటిష్ఠంగా ఉండటంతో తొలి విడత కరోనా అదుపులోకి వచ్చింది. ఇప్పుడు ఎలాంటి ఆంక్షలు పెట్టే పరిస్థితి లేకపోవడం, కంటైన్‌మెంట్‌ స్ట్రాటర్జీ అనేది లేకపోవడంతో సెకండ్‌వేవ్‌ ఎప్పటికి అదుపులోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి జిల్లాలో నెలకొన్నది. మంగళవారం ఉదయం వరకు వివిధ ల్యాబ్‌ల నుంచి 6,097 శాంపిల్స్‌ ఫలితాలు విడుదల కాగా 622(10.20 శాతం) మందికి పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,246కి పెరిగింది. కొవిడ్‌తో మంగళగిరిలో 56 ఏళ్ల మహిళ మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు ధ్రువీకరించాయి. చిలకలూరిపేట మండలంలోని వేలూరు గ్రామానికి చెందిన ఓ పాస్టర్‌(28) కరోనా బారినపడి మృతి చెందినట్లు వైద్యఆరోగ్యశాఖాధికారులు తెలిపారు. ఇతడు ప్రకాశం జిల్లా యద్దనపూడి చర్చికి వెళ్లి వస్తూ ఉండే క్రమంలో కరోనా సోకింది. కేఎంసీ వైద్యశాలలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 104 మంది కోలుకోవడంతో ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి చేశారు. కాగా మంగళవారం కొత్తగా 5,285 స్వాబ్‌లు టెస్టింగ్‌ నిమిత్తం సేకరించారు. గుంటూరు నగరంలో కొత్తగా 288, మంగళగిరిలో 80, తాడేపల్లిలో 26, తెనాలిలో 37, పెదకాకానిలో 15, చేబ్రోలులో 12, తుళ్లూరులో 11, నరసరావుపేటలో 10 కేసులు నమోదయ్యాయి. మిగతా మండలాల్లో 10 లోపు కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు.


ఒకే గ్రామంలో ఐదుగురికి..

 చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెంలో ఐదుగురికి కరోనా వచ్చింది. ఇటీవల హైదరాబాద్‌లో మృతి చెందిన ఎయిర్‌ఫోర్స్‌ విశ్రాంత ఉద్యోగి అంత్యక్రియలు గ్రామంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌ నుంచి పలువురు హాజరయ్యారు. వారిని కలిసిన గ్రామస్థుల్లో 15 మందికి కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది.


విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన

కరోనా సెకండ్‌వేవ్‌ తీవ్రత జిల్లాలో ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలోనే అధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఇదే క్రమంలో పలు పాఠశాలల్లో విద్యార్థులు కరోనా బారిన పడటం.. పలువురు ఉపాధ్యాయులు, వారి కుటుంబసభ్యులు మృతి చెందిన ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో కేసుల విషయం అరకొరగానే బహిర్గతమవుతుండగా.. ప్రైవేటు పాఠశాలల విషయం బయటకు పొక్కనీయడంలేదు. ఈ పరిస్థితుల్లో ఎక్కడ తమ పిల్లలు కరోనా బారిన పడతారేమోనన్న ఆందోళన కొన్ని రోజులుగా విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొంది. ఏ రోజు చూసినా కేసుల సంఖ్య తగ్గకపోతుండటంతో పిల్లలను పాఠశాలలకు పంపించకపోవడమే మంచిదన్న ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే కొందరు పలు పిల్లలను పాఠశాలలకు పంపించడం మాన్పించేశారు. ఇదే సమయంలో వేసవి ఎండల తీవ్రత కూడా పెరుగుతున్నది. అయినప్పటికీ సాధ్యమైనంత త్వరగా విద్యా సంవత్సరాన్ని ముగించాలన్న ఆలోచన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు చేయడం లేదు. పొరుగు రాష్ట్రంలో పాఠశాలలు మూసేసినప్పటికీ ఇక్కడ ఇంకా కొనసాగిస్తుండటంపై విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారం వరకు వేచి చూసి ప్రభుత్వం నిర్ణయం ప్రకటించకపోతే స్వచ్ఛందంగా పిల్లలను బడులకు పంపించడం మానేస్తామని చెబుతున్నారు. 

 

కొవిడ్‌ కేర్‌ సెంటర్లు సిద్ధం

కరోనా కేసులు పెరుగుతోన్న దృష్ట్యా జిల్లాలో కొవిడ్‌ కేర్‌ సెంటర్లని పూర్తిస్థాయిలో సిద్ధం చేసినట్లు జేసీ ప్రశాంతి తెలిపారు. మంగళవారం అడవితక్కెళ్లపాడు, తెనాలి, చిలకలూరిపేటలోని ఏపీ టిడ్కో భవనాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్లను జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక్కో సముదాయంలో 600 వరకు పడకలు సిద్ధం చేసినట్లు తెలిపారు. కరోనా సోకి తక్కువగా లక్షణాలు ఉన్న వారిని కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు తరలించి ప్రత్యేక గదుల్లో క్వారంటైన్‌ చేసి చికిత్స అందిస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆస్పత్రులను కూడా సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తదితరులు పాల్గొన్నారు. 


కొవిడ్‌ ఆస్పత్రుల్లో మరిన్ని బెడ్లు 

గుంటూరు(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెరిగిపోతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని ఆరు కొవిడ్‌ ఆస్పత్రుల్లో పడకలను పెంచుతూ కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నారైలో 300 నుంచి 750కి, జీజీహెచ్‌లో 249 నుంచి 600, కాటూరి మెడికల్‌ కళాశాల ఆస్పత్రిలో 245 నుంచి 600, మణిపాల్‌ ఆస్రత్రిలో 30 నుంచి 50, మంగళగిరి ఎయిమ్స్‌లో 16 నుంచి 30కి బెడ్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు ఆరోగ్యశ్రీ, నాన్‌ ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను కూడా కరోనా చికిత్సలకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2021-04-14T06:05:19+05:30 IST