9,189 శాంపిల్స్‌.. 1,639 కేసులు

ABN , First Publish Date - 2021-05-18T06:33:41+05:30 IST

గుంటూరు నగరంలో అత్యధికంగా 436 మందికి కరోనా సోకింది.

9,189 శాంపిల్స్‌..  1,639 కేసులు

17.84గా పాజిటివ్‌ శాతం నమోదు

గుంటూరులో 133 ప్రాంతాల్లో కేసులు

అధికారికంగా 10 మంది మృత్యువాత 


కరోనా మహమ్మారి తీవ్రత అదే స్థాయిలో కొనసాగుతోంది. కర్ఫ్యూ కొనసాగుతున్నా కేసులు ఏ మాత్రం తగ్గడంలేదు. జిల్లాలో సోమవారం వచ్చిన కేసుల సంఖ్య పరంగా చూస్తే తగ్గినట్లే. కాని అది సంఖ్యా పరంగా మాత్రమే. పాజిటివ్‌ రేట్‌ ఏమాత్రం తగ్గలేదు. ల్యాబ్‌ల నుంచి వస్తోన్న శాంపిల్స్‌ ఫలితాల్లో ప్రతీ 100 మందిలో 18 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ జరుగుతోన్నది. గడిచిన 24 గంటల్లో 9,189 శాంపిల్స్‌ ఫలితాలు రాగా అందులో 1,639 మందికి వైరస్‌ వ్యాప్తి చెందింది. దీంతో పాజిటివ్‌ శాతం 17.84గా నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 10 మంది కొవిడ్‌-19తో చనిపోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు ప్రకటించాయి. గుంటూరు నగరంలో 5, తాడేపల్లిలో 2, పెదకాకానిలో ఒకరు, నాదెండ్లలో ఒకరు, తెనాలిలో ఒకరు చనిపోయారు. 


గుంటూరు, మే 17 (ఆంధ్రజ్యోతి): గుంటూరు నగరంలో అత్యధికంగా 436 మందికి కరోనా సోకింది. ఇందులో ప్రధానంగా శ్రీనివాసరావుతోటలో 22, ఆర్‌టీసీ కాలనీలో 17, ఏటీ అగ్రహారంలో 16, ఆటోనగర్‌లో 15, ఎన్‌జీవో కాలనీలో 14, నల్లచెరువులో 12, పట్టాభిపురంలో 11 కలిపి మొత్తం 133 ప్రాంతాల్లో కొత్త కేసులు వెలుగులోకి వచ్చినట్లు నగరపాలకసంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ తెలిపారు. నరసరావుపేటలో 106, మంగళగిరిలో 97, మాచర్లలో 67, సత్తెనపల్లిలో 65, తాడేపల్లిలో 60, బాపట్లలో 60, అమరావతిలో 47, తెనాలిలో 41, అచ్చంపేటలో 10, బెల్లంకొండలో 4, గుంటూరు రూరల్‌లో 12, క్రోసూరులో 9, మేడికొండూరులో 15, ముప్పాళ్లలో 7, పెదకాకానిలో 18, పెదకూరపాడులో 41, పెదనందిపాడులో 4, ఫిరంగిపురంలో 15, ప్రత్తిపాడులో 8, రాజుపాలెంలో 20, తాడికొండలో 26, తుళ్లూరులో 8, వట్టిచెరుకూరులో 11, దాచేపల్లిలో 16, దుర్గిలో 13, గురజాలలో 7, కారంపూడిలో 12, మాచవరంలో 42, పిడుగురాళ్లలో 32, రెంటచింతలలో 14, వెల్దుర్తిలో 11, బొల్లాపల్లిలో 2, చిలకలూరిపేటలో 31, యడ్లపాడులో 6, ఈపూరులో 8, నాదెండ్లలో 14, నూజెండ్లలో 14, నకరికల్లులో 18, రొంపిచర్లలో 19, శావల్యాపురంలో 8, వినుకొండలో 8, అమర్తలూరులో 9, భట్టిప్రోలులో 11, చేబ్రోలులో 24, చెరుకుపల్లిలో 11, దుగ్గిరాలలో 31, కాకుమానులో 8, కర్లపాలెంలో 5, కొల్లిపరలో 12, కొల్లూరులో 6, నగరంలో 9, నిజాంపట్నంలో 7, పిట్టలవానిపాలెంలో 9, పొన్నూరులో 15, రేపల్లెలో 11, చుండూరులో 4, వేమూరులో 5 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. కొవిడ్‌ నుంచి కోలుకుని 858 మంది డిశ్చార్జి అయినట్లు పేర్కొన్నారు.


6,143 మందికి సెకండ్‌ డోస్‌ వ్యాక్సిన్‌

జిల్లా వ్యాప్తంగా సోమవారం కరోనా వ్యాక్సిన్‌ రెండో డోస్‌ పంపిణీ కార్యక్రమం కొనసాగింది. మొత్తం 6,143 మందికి రెండో డోస్‌ వేసినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. 


తండ్రి కుమారుల మృతి 

నాలుగు రోజుల్లో ఒకే ఇంట కరోనా విషాదం


తెనాలి రూరల్‌: కరోనా మహమ్మారి కాటుకు పలువురు గురవుతున్నారు. కరోనా కుటుంబాల్లో విషాదాలు నింపుతోంది. కరోనా లక్షణాలతో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స పొందుతూ మరణిస్తున్నారు. జిల్లాలో సోమవారం అధికారికంగా పది మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. తెనాలిలో నాలుగు రోజుల వ్యవధిలో తండ్రి, కుమారుడు మృతి చెందారు. ఆ ఇంట పురుషులు ఇద్దరూ మరణించడంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. తెనాలికి చెందిన విష్ణుమోహనరావు (56) కేఎల్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కరోనా లక్షణాలతో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. విష్ణుమోహనరావు నన్నపనేని రాజకుమారి మరిది.   ఈయన కుమారుడు(38) నాలుగురోజుల క్రితమే కరోనాతో మరణించాడు. కుమారుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తుంటే.. ఆయనకు 8 నెలల బాబు ఉన్నాడు. నాలుగు రోజుల వ్యవధిలో తండ్రి, కుమారుడు మృతితో ఆ ఇంట హృదయవిదారక పరిస్థితి నెలకొంది. తొలుత కుటుంబ సభ్యులు అందరికీ కరోనా పాజిటివ్‌ వచ్చింది.  పురుషులు ఇద్దరూ మృతి చెందగా విష్ణుమోహనరావు భార్య, కోడలు మాత్రం కోలుకున్నారు. విష్ణుమోహనరావు మృతికి నన్నపనేని రాజకుమారి సంతాపం తెలిపారు.


అటవీశాఖ విశ్రాంత ఉద్యోగి..

గుంటూరు(విద్య): అటవీశాఖలో వివిధ విభాగాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన షేక్‌ మహ్మద్‌జానీ(74) కరోనా లక్షణాలతో మృతి చెందాడు.   స్థానిక ఏటీఅగ్రహారం సమీపంలోని హనుమాన్‌నగర్‌లో నివసించే ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో సెయింట్‌ జోసఫ్‌ ఆస్పత్రిలో చేర్పించినట్లు కుమారుడు అమీర్‌ తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ జానీ మృతిచెందాడు. ఆటవీశాఖాధికారి రామచంద్రరావు జానీ మృతికి నివాళులర్పించారు.


మంగళగిరిలో ఇద్దరు.. 

మంగళగిరి: మంగళగిరిలో కరోనా కాటుకు ఇద్దరు బలయ్యారు. మండలం యర్రబాలెం డాన్‌ బాస్కో హైస్కూల్‌లో పీఈటీగా పని చేస్తున్న డోలాస్‌నగర్‌కు చెందిన మల్లవరపు దేవరాజ్‌(32) కరోనా లక్షణాలతో సోమవారం మరణించారు. ఆరు రోజులుగా ఆయన మంగళగిరి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.  దేవరాజ్‌ మృతిపట్ల మాదిగ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందుపల్లి రామారావు, శ్రీలక్ష్మి నరసింహ ఎడ్యుకేషనల్‌ సొసైటీ చైర్మన్‌ మేకల మోహనరావు, వాణి హైస్కూల్‌ డైరెక్టర్‌ కొల్లి నాగేశ్వరరావు, ఎస్‌ఎల్‌ఎం చైతన్య హైస్కూల్‌ డైరెక్టర్‌ సిందే బాలకృష్ణ తదితరులు సంతాపం తెలిపారు.  మంగళగిరి కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌ రోడ్డులోని శ్రీమతి షాపింగ్‌ నిర్వాహకుడు, వైసీపీ నాయకుడు షే్‌ ఫిరోజ్‌ సోదరుడైన షేక్‌ బాషా(బాబు) కరోనా లక్షణాలతో సోమవారం మృతి చెందాడు. కొన్ని రోజులుగా ఆయన ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 


గణపవరం బిల్‌ కలెక్టర్‌..

నాదెండ్ల: మండలంలోని గణపవరం గ్రామ పంచాయతీలో బిల్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న దేనువుకొండ రణధీప్‌రాజు(51) కరోనా లక్షణాలతో మృతి చెందారు. కొద్దిరోజుల క్రితం పాజిటివ్‌ రావడంతో గుంటూరులోని ఓప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 


నెలాఖరు వరకు కర్ఫ్యూ

కేసులు తగ్గకపోవడంతో పొడిగింపు

యథాతథంగా ఆంక్షలు, సడలింపులు 

గుంటూరు, మే17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసులు అదుపులోకి రాలేదు. 18 గంటల కర్ఫ్యూ అమలు చేస్తున్నా.. కేసులు మాత్రం తగ్గనంటున్నాయి. ఈ దృష్ట్యా ప్రస్తుతం అమలు చేస్తోన్న కర్ఫ్యూని యథాతథంగా ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రభుత్వం జిల్లా యంత్రాంగానికి సమాచారం పంపించింది. ఈ నెలాఖరు వరకు ఆంక్షలు, సడలింపులు యథాతథంగా ఉంటాయని ఉత్వర్వుల్లో పేర్కొన్నది. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణపై సీఎం జగన్‌ సోమవారం ఉన్నతస్థాయిలో చర్చించిన అనంతరం కర్ఫ్యూ పొగిగింపు నిర్ణయాన్ని ప్రకటించారు. కరోనా కేసులు జిల్లాలో అదుపులోకి రాకపోతుండటంతో లాక్‌డౌన్‌ పెడతారని అంతా భావించారు. లాక్‌డౌన్‌ పెట్టని పక్షంలో కర్ఫ్యూని 20 గంటలపాటు అమలు చేస్తారని అంచనా వేశారు. అయితే కేసులు తగ్గాలంటే కర్ఫ్యూని కనీసం నాలుగు వారాలపాటు అమలు చేస్తేనే ఫలితం ఉంటుందని వివిధవర్గాలు అభిప్రాయం వ్యక్తం చేయటంతో ఈ నెల 31 వరకు పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా గ్రామాల్లో కరోన వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. జిల్లాలో ఈ నెల 5వ తేదీ నుంచి కరోనా కట్టడికి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. నిత్యం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని కార్యకలాపాలను అనుమతిస్తున్నారు. ఆ తర్వాత అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటున్నది. ప్రభుత్వం చేసిన ప్రకటన మేరకు ఈ నెల 19వ తేదీతో కర్ఫ్యూ ముగియనుంది.


వీడని నిర్లక్ష్యం.. తగ్గని కేసులు

కరోనా కేసులు కర్ఫ్యూ ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం వరకు కూడా తగ్గుముఖం పట్టలేదు. నిత్యం సగటున 1700 వరకు పాజిటివ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పాజిటివ్‌ రేటు 17 శాతం మధ్యన ఉంటున్నది. ప్రజలు ముఖ్యంగా యువకులు బాధ్యతా రహితంగా కర్ఫ్యూ సమయంలోనూ షికార్లు కొడుతున్నారు. అలానే మార్కెట్ల వద్ద రద్దీ నియంత్రణ జరగడంలేదు. మెడికల్‌ షాపులు, ఆస్పత్రుల వద్ద కూడా రద్దీ నెలకొంటున్నది. భౌతిక దూరం నిబంధన విస్మరిస్తున్నారు. కరోనా మమ్మల్ని ఏమీ చేయలేదన్న నిర్లక్ష్య ధోరణితో కనీసం మాస్కులు కూడా ధరించడంలేదు. కర్ఫ్యూ సడలింపు సమయంలో 144 సెక్షన్‌ అమలు కావడంలేదు. పోలీసులు పెద్దగా కేసులు నమోదు చేయకపోవడంతో కర్ఫ్యూ సమయంలో తిరిగినా తమకేమీ కాదన్న ధోరణితో చాలామంది ఉంటున్నారు. ఇవన్నీ కేసులు తగ్గకపోవడానికి కారణంగా మారాయి. కనీసం రాబోయే రెండు వారాల పాటు అయినా నిబంధనలు కఠినంగా అమలు చేస్తే కరోనాకు కళ్లెం వేయొచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.


Updated Date - 2021-05-18T06:33:41+05:30 IST