కరోనా తగ్గుముఖం

ABN , First Publish Date - 2020-12-01T06:31:19+05:30 IST

జిల్లాలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతోంది.

కరోనా తగ్గుముఖం

కొత్తగా 70 మందికి వైరస్‌ 

కొవిడ్‌ ఆసుపత్రిలో మరో వ్యక్తి మృతి 

24 గంటల్లో మరో 149 మంది డిశ్చార్జి 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతోంది. జిల్లావ్యాప్తంగా రోజువారీగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసులు ఇటీవల గణనీయంగా తగ్గాయి. రెండు నెలల క్రితం జిల్లాలో ప్రతిరోజూ 400 నుంచి 500 పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఇటీవల రోజుకు 100లోపే పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాలు కూడా రోజుకు ఒకటి, రెండుకు మించడం లేదు. అదే క్రమంలో వైరస్‌ బారినపడుతున్న బాధితుల రికవరీ రేటు పెరిగింది. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చేరుతున్న పాజిటివ్‌ బాధితులు చికిత్స తీసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరుకుంటున్నారు. జిల్లాలో సోమవారం కొత్తగా 70 మందికి కరోనా వైరస్‌ సోకగా... మరో బాధితుడు కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 45,412కు చేరుకున్నాయి. కరోనా మరణాలు అధికారికంగా 637కుపెరిగాయి. గడచిన 24 గంటల్లో మరో 149 మంది బాధితులు వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 1,705 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గతంతో పోలిస్తే జిల్లాలో కేసులు గణనీయంగా తగ్గడం ప్రజలకు ఉపశమనం కల్గించే అంశమే అయినప్పటికీ.. వారం రోజులుగా రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్‌ కేసులు మన జిల్లాలోనే ఎక్కువగా ఉండడంతో కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదనేది స్పష్టమవుతోంది. చలికాలంలో వైరస్‌ మరింత విజృంభించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2020-12-01T06:31:19+05:30 IST