బాబోయ్‌ 3 లక్షలే!

ABN , First Publish Date - 2022-01-23T06:53:20+05:30 IST

జిల్లాను కొవిడ్‌ కుదిపేస్తోంది. వందలాది కేసులతో మళ్లీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎక్కడో విదేశాల్లో కొవిడ్‌ కరాళనృత్యం చేస్తోందని తెలుసుకుని అయ్యో.. అనుకుంటే చివరకు మహమ్మారి ఇక్కడ కూడా విలయతాండ వం చేసింది.

బాబోయ్‌ 3 లక్షలే!
జీజీహెచ్‌లో కొవిడ్‌ పరీక్ష చేయించుకుంటున్న కాకినాడ ట్రాఫిక్‌ డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి

జిల్లాలో కొవిడ్‌ కేసులు మూడు లక్షల సంఖ్య దాటేశాయి. శనివారం నమోదైన 756 పాజిటివ్‌లతో కలిపి మొత్తం కేసులు 3,00,743కు చేరాయి. ఇన్ని కేసులు రాష్ట్రం మొత్తం మీద ఒక్క ఈ జిల్లాలోనే నమోదవడంతో ‘తూర్పు’ రికార్డులకెక్కింది. కాగా ప్రస్తుత     థర్డ్‌ వేవ్‌లో రోజువారీ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈనెలలో జిల్లాలో ఇప్పటివరకు 22 రోజుల్లో 5,627 మందికి వైరస్‌ సోకింది. దీంతో మహమ్మారి వేగం తల్చుకుంటేనే భయమేస్తోంది. కాగా జిల్లాలో 2021 మార్చిలో తొలి పాజిటివ్‌ రాజమహేంద్రవరంలో నమో దైంది. అదే ఏడాది అక్టోబరు 4న కేసులు లక్షకు చేరాయి. తిరిగి గతేడాది మే 22 నాటికి పాజిటివ్‌లు రెండు లక్షలకు ఎగబాకాయి. ఎనిమిది నెలలు దాటకుండానే మళ్లీ ఇంకో లక్ష కేసులు పెరిగి శనివారానికి మూడు లక్షలకు చేరాయి.    ఈ క్రమంలో ప్రభుత్వ అమర్థతతో పడకలు దొరక్క,ఆక్సిజన్‌ అందక వేలాది మంది కన్నుమూశారు. ఇప్పుడు కేసులు మళ్లీ విజృంభిస్తుండడంతో అలజడి రేగుతోంది. 

జిల్లాలో 3,00,743కు చేరుకున్న మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య

 అత్యధిక పాజిటివ్‌లతో రాష్ట్రంలోనే జిల్లా తొలి స్థానం

 ఈ నెలలో గడచిన 22 రోజుల్లో ఏకంగా 5,627 మందికి వైరస్‌

రోజూ వందలాది పాజిటివ్‌లతో పడగవిప్పుతున్న మహమ్మారి

శనివారం జిల్లావ్యాప్తంగా 756 కేసులు నమోదు

 కాగా జిల్లాలో తొలి లక్ష పాజిటివ్‌లు 2020 అక్టోబరు 4న నమోదు

ఆ తర్వాత 2021 మే 22న రెండు లక్షలకు చేరిన కేసులు

 తిరిగి 8 నెలల్లోనే ఇంకో లక్ష పెరిగి మూడు లక్షలకు ఎగబాకిన కేసులు 

 ప్రభుత్వ అసమర్థతతో కొవిడ్‌తో చనిపోయిన వాళ్లు వేలల్లోనే

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాను కొవిడ్‌ కుదిపేస్తోంది. వందలాది కేసులతో మళ్లీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎక్కడో విదేశాల్లో కొవిడ్‌ కరాళనృత్యం చేస్తోందని తెలుసుకుని అయ్యో.. అనుకుంటే చివరకు మహమ్మారి ఇక్కడ కూడా విలయతాండ వం చేసింది. లక్షల మందిని నిలువునా కుంగదీసి, వేలాదిమందిని మృత్యుతీరాలకు చేర్చింది. జిల్లాలో 2020 మార్చిలో తొలి కొవిడ్‌ కేసు నమోదైంది. విదేశాల నుంచి రాజమహేంద్రవరం వచ్చిన 23 ఏళ్ల యువకుడికి పరీక్ష చేయగా కొవిడ్‌గా తేలడంతో కాకినాడ జీజీహెచ్‌లో వైద్యం అందించారు. ఆ తర్వాత ఏప్రిల్‌, మే నెలల్లో ప్రతిరోజూ జిల్లాలో కొవిడ్‌ కేసులు పదుల్లో పెరిగిపోయాయి. కాంటాక్ట్‌ విధానంలో కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, కోనసీమలో వరుసగా కేసులు వందల్లో వచ్చేశాయి. అదే ఏడాది అక్టోబరు 22కి మొత్తం పాజిటివ్‌లు లక్షకు చేరాయి. నవంబరు వరకు కొనసాగిన తొలి వేవ్‌లో జిల్లా మొత్తంమీద 1.11 లక్షలకుపైగా పాజిటివ్‌లు నమోదయ్యాయి. ఇన్ని కేసులు నిర్ధారణ కావడంతో దేశవ్యాప్తంగా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న 30 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం తూర్పుగోదావరిని చేర్చింది. కాగా 2020లో అత్యధికంగా జిల్లాలో సెప్టెంబర్‌లో 37,771 పాజిటివ్‌లు రాగా, ఆగస్టులో 39,008 కేసులు వచ్చాయి. ఇన్ని కేసులొచ్చినా రికవరీ రేటు బాగుండ డంతో మరణాల సంఖ్య తగ్గింది. కానీ వైరస్‌ వ్యాప్తి భారీగా ఉండడంతో కేంద్రం అప్పట్లో సుదీర్ఘకాలం లాక్‌డౌన్‌ విధించింది. ఫలితంగా జిల్లాలో అన్ని రంగాలు కకావికలమయ్యాయి. ఉపాధి లేక అనేక మంది రోడ్డున పడ్డారు. చివరకు 2020 నవంబరు ఆఖర్లో పాజిటివ్‌లు తగ్గుముఖం పట్ట డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తిరిగి అన్ని రంగాలు నెమ్మదిగా కోలుకోవడం మొదలుపెట్టాయి. మళ్లీ ఇంతలో 2021 మేలో సెకండ్‌వేవ్‌ విశ్వరూపం ప్రదర్శించింది. కనీవినీ ఎరుగని రీతిలో అల్లకల్లోలం రేపింది. వైరస్‌ వేలమందిని కుంగదీసి ప్రాణాలు లాగేసింది. వాస్తవానికి 2021 ఏప్రిల్‌ 1 నాటికి జిల్లాలో పాజిటివ్‌ల సంఖ్య 1,25, 363గా నమోదయ్యా యి. అప్పటివరకు రోజూ కేసులు 25 నుంచి 30 వరకే ఉండేవి. కానీ ఏప్రిల్‌ రెండోవారం నుంచి ఒక్కసారిగా జిల్లాపై వైరస్‌ దాడి పెరిగిపోయింది. ఎక్కడికక్కడ పల్లెలు, పట్టణాలు, నగరాల్లో కేసులు అమాంతం రెట్టింపయ్యాయి. దీంతో రోజువారీ కేసులు రెండువేల నుంచి మూడు వేల వరకు నమోదయ్యేవి. ఒక్క మేనెలలోనే ఏకంగా జిల్లాలో కొవిడ్‌ కేసులు 83,808 నమోదయ్యాయి. ఇదే నెల 22న జిల్లాలో పాజిటివ్‌ల సంఖ్య రెండు లక్షలు దాటింది. సెకండ్‌వేవ్‌లో అత్యధిక పాజిటివ్‌లు, మరణాలు నమోదైన నెల ఇదే. వేలల్లో కేసులు, మరణాలు, ఆసుపత్రిలో ఆర్తనాదాలు, ఆక్సిజన్‌ కోసం హాహాకారాలు మేలో తీవ్రస్థాయికి చేరుకున్నాయి. పెదపూడిలో ఓ వ్యక్తి కొవిడ్‌తో కన్నుమూయగా అతడి ద్వారా వైరస్‌ వ్యాపించి మండపేట, అనపర్తి, పెదపూడి, బిక్కవోలు, అలమూరు తదితర మండలాల్లో వేలకువేలు పాజిటివ్‌లు కకావికలం చేశాయి. ఒక రకంగా చెప్పాలంటే మే నుంచి జూలై వరకు జిల్లా చిగురుటాకులా వణి కిపోయింది. రోజూ వందల మంది ఆసుపత్రిలో చనిపోయారు. వైరస్‌ సోకడంతో ఉన్నట్టుండి ఆక్సిజన్‌ అందక కొందరు, ఊపిరితిత్తుల్లో వైరస్‌ తీవ్రత పెరిగిపోయి గుండెపోటుతో ఎంతమంది చనిపోయారో లెక్కకు కూడా అందలేదు. ఇందులో జిల్లాకు చెందిన ఎందరో రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు ఉన్నారు. అదే సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్‌లన్నీ నిండిపోయి బాధితులకు పడక దొరక్క వేలాది మంది ఆర్తనాదాలు చేశారు. ఆక్సిజన్‌ చాలక, ఐసీయూ బెడ్‌లు దొరక్క ఆరుబయటే అనేక మంది కొవిడ్‌ బాధితులు కన్నుమూశారు. ప్రభుత్వ అసమర్థత బయటపడకుండా మృతులను ఆసు పత్రులు దాచిపెట్టేశాయి. కానీ జిల్లావ్యాప్తంగా స్మశానాల్లో మృతదేహాల చితులు అసలు నిజాలను బయటపెట్టి కొవిడ్‌ కరాళనృత్యాన్ని కళ్లకుకట్టింది. అదే సమయంలో కొవిడ్‌ చికిత్సకు వినియోగించిన యాంటిబయాటిక్స్‌ దుష్పరిణామాలతో కొందరు బాధితులకు బ్లాక్‌ఫంగస్‌ సోకడంతో పదుల సంఖ్య లో చనిపోయారు. తిరిగి గతేడాది ఆగస్టు నుంచి జిల్లాలో పాజిటివ్‌ల సంఖ్య గణనీయంగా తగ్గింది. కొవిడ్‌ టీకాలు కూడా అందుబాటులోకి రావడంతో అంతా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. దీంతో వైరస్‌ పోయిందనే ధీమాతో జిల్లావ్యాప్తంగా అధికారులు పాజిటివ్‌ల నియంత్రణపై దృష్టిసారించడం మానేశారు. కొవిడ్‌ టెస్టింగ్‌ కేంద్రాలను దాదాపు ఎత్తేశారు. ఈలోపు థర్డ్‌వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేసినా టెండర్లు ఖరారవగా ఏవీ పట్టాలెక్కలేదు. తిరిగి మళ్లీ ఈ ఏడాది జనవరి మొదటి వారం నుంచి థర్డ్‌వేవ్‌లో భాగంగా కేసులు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాయి. దీంతో రోజూ కేసులు మళ్లీ వందల్లో నిర్థారణ అవుతున్నాయి. దీంతో శనివారం నాటికి మొత్తం పాజిటివ్‌లు మూడు లక్షలు దాటే శాయి. మొత్తం కొవిడ్‌ మృతుల సంఖ్య 1,291గా శనివారం బులిటెన్‌లో ప్రభుత్వం పేర్కొంది. కానీ ఇవి నాలుగు వేలకుపైగానే ఉన్నాయి. మరోపక్క కేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో కాకినాడ జీజీహెచ్‌కు బాధితులు పోటెత్తుతున్నారు. శనివారానికి కొవిడ్‌ ఇన్‌పేషెంట్లు వందకు పెరిగారు. 

కొవిడ్‌తో మహిళ మృతి

అంతర్వేది : సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలేనికి చెందిన 33 ఏళ్ల మహిళ గురువారం మృతి చెందినట్టు మోరి పీహెచ్‌సీ వైద్యాధికారి ప్రతిమ తెలిపారు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.


Updated Date - 2022-01-23T06:53:20+05:30 IST