కొలువులపై కొవిడ్‌ పంజా

ABN , First Publish Date - 2021-05-06T06:26:31+05:30 IST

కొవిడ్‌-2 విజృంభణ ప్రభావంతో భవిష్యత్‌ అనిశ్చితంగా మారిన కారణంగా కంపెనీలు కొత్త నియామకాల జోలికి పోవడం లేదు. ఈ ఏడాది మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో...

కొలువులపై కొవిడ్‌ పంజా

  • ఏప్రిల్‌లో 15 శాతం ఢమాల్‌

ముంబై: కొవిడ్‌-2 విజృంభణ ప్రభావంతో భవిష్యత్‌ అనిశ్చితంగా మారిన కారణంగా కంపెనీలు కొత్త నియామకాల  జోలికి పోవడం లేదు. ఈ ఏడాది మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో కొత్త కొలువుల నియామకాలు 15 శాతం తగ్గాయి. బుధవారం విడుదలైన నౌకరి జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ ఈ విషయం తెలిపింది. గత ఏడాది ఏప్రిల్‌లో నియామకాలు 51 శాతం పడిపోయాయి. కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించకపోవడంతో నియామకాల్లో తగ్గుదల పరిమితంగానే ఉంది.  


ఎక్కువ ప్రభావం పడిన రంగాలు

ఎఫ్‌ఎంసీజీ, టెలికాం, రిటైల్‌, హాస్పిటాలిటీ, ట్రావె ల్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, టీచింగ్‌, ఎడ్యుకేషన్‌ రంగాలపై కొవిడ్‌ ప్రభావం ఎక్కువగానే  ఉంది. మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో ఈ రంగాల్లో నియామకాలు 15 నుంచి 36 శాతం పడకేశాయి. హాస్పిటాలిటీ, ట్రావెల్‌ రంగాల్లో నియామకాలు 36 శాతం పడిపోయాయి 

ఐటీ రంగంలో కొత్త నియామకాల్లో 12 శాతం క్షీణత ఏర్పడింది. అయితే బీమా, ఫార్మా, బయోటెక్‌, మెడికల్‌, హెల్త్‌కేర్‌ రంగాల కొలువులపై కొవిడ్‌ ప్రభావం తక్కువగానే ఉంది. ఈ రంగాల్లో నియామకాలు అయిదు నుంచి పది శాతం మాత్రమే తగ్గాయి.


హైదరాబాద్‌లో 4 శాతం డౌన్‌: మెట్రో నగరాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోనూ ఏప్రిల్‌ నెల్లో నియామకాలు నాలుగు నుంచి 25 శాతం వరకు పడకేశాయి. కొవిడ్‌ ఉధృతి ఎక్కువగా ఉన్న ముంబైలో 20 శాతం, జైపూర్‌లో 25 శాతం పడిపోయాయి. హైదరాబాద్‌లోనూ మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో కొత్త నియామకాలు నాలుగు శాతం తగ్గాయి. కోల్‌కతాలో మాత్రం ఎలాంటి మార్పు లేదని నౌకరి.కామ్‌ పేర్కొంది. 


Updated Date - 2021-05-06T06:26:31+05:30 IST