ఆక్సిజన్‌ అందని బెడ్‌లు ఎందుకు?

ABN , First Publish Date - 2021-05-05T05:46:04+05:30 IST

ఎన్ని బెడ్లు ఉంటే ఏం లాభం.. ఆక్సిజన్‌ అందకపోతే ఎన్ని ఉన్నా నిరుపయోగమే..

ఆక్సిజన్‌ అందని బెడ్‌లు ఎందుకు?
భీమవరంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌

నిండుతున్న ఆసుపత్రులు 

ఖాళీగా కొవిడ్‌ కేర్‌ సెంటర్లు కేర్‌ సెంటర్లు

భీమవరం క్రైం, మే 4 : ఎన్ని బెడ్లు ఉంటే ఏం లాభం.. ఆక్సిజన్‌ అందకపోతే ఎన్ని ఉన్నా నిరుపయోగమే.. ప్రస్తుతం ఇదే జరుగుతోంది.  ఉండటానికి 1000 బెడ్లు ఉన్నాయి. కానీ కరోనా బాధితులు మాత్రం 154 మందే. అసలే కరోనా బాధితులు ఆసుపత్రులు కోసం ఎగబడుతుంటే అన్ని బెడ్లు ఖాళీ ఉన్నా అక్కడకు ఎందుకు వెళ్లడం లేదంటే అక్కడ ప్రాణవాయువు లేదు.. భీమవరం శివారు తాడేరు గ్రామ పరిధి టిడ్కో నివాసాల్లో ప్రభుత్వం కరోనా బాధితులకు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌  ఏర్పాటు చేసింది. అక్కడ 30 మంది వైద్యులు, సిబ్బందితో పాటు శానిటేషన్‌ సిబ్బంది ఉన్నారు. అయితే అక్కడ మాత్రం కరోనా బాధితులకు ఆక్సిజన్‌ సౌకర్యం లేదు. దానిలో వెయ్యి బెడ్లు ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుతం 154 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. వారికి స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండడంతో అక్కడ చేరారు. అయితే భీమవరం ప్రభుత్వాసుపత్రిలో 50 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడ ఆక్సిజన్‌ కూడా అందుబాటులో ఉంది. దీంతో 50 బెడ్లు ఎప్పుడు నిండుగానే దర్శనమిస్తున్నాయి. టిడ్కో నివాసాల్లో క్వారంటైన్‌లో అందరికీ అందుబాటులో ఆక్సిజన్‌ ఉంచితే సుమారు ఇంకా 800 మంది కరోనా బాధితులు చికిత్స పొందే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు ఆక్సిజన్‌ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని బాధితులు కోరుతున్నారు.

Updated Date - 2021-05-05T05:46:04+05:30 IST