పెరుగుతున్న కొవిడ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-05-05T06:52:55+05:30 IST

మండలంలో కొవిడ్‌ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. అధికారిక లెక్కల కన్నా అనధికారికంగా ఎక్కువ మంది కరోనా వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెరుగుతున్న కొవిడ్‌ కేసులు
కురిచేడులో బాధితుడిని అంబులెన్స్‌ ఎక్కిస్తున్న వైద్య సిబ్బంది

కురిచేడు, మే 4 : మండలంలో కొవిడ్‌ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. అధికారిక లెక్కల కన్నా అనధికారికంగా ఎక్కువ మంది కరోనా వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల నుంచి కొవిడ్‌ కేసులు తెగ పెరిగిపోతున్నాయి. 2వ తేదీన 21 కొవిడ్‌ కేసులు నమోదు కాగా 3న 31 నమోదయ్యాయి. చాలా మంది స్వంతంగా ప్రైవేటు లాబ్‌ల్లో పరీక్షలు చేయించుకుని ఇంటి దగ్గరే ఉండి మందులు వాడుతున్నారు. వారి లెక్కలు ప్రభుత్వం వద్ద అందుబాటులో లేవు. అటువంటి వారు గ్రామంలో యథేచ్చగా తిరుగుతూ సూపర్‌స్పైడర్లుగా మారారని ప్రజలు విమర్శిస్తున్నారు. వారి నుంచి ఇతరులకు వ్యాధి సోకుతున్నట్లు వైద్యాధికారులూ అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం మండలంలో ఇప్పటికే 100కి పైగా కరోనా కేసులు ఉన్నట్లు వైద్యాఽధికారులు తెలియజేస్తున్నారు. ఆక్సిజన్‌ శాతం తక్కువగా ఉన్న వారిని దర్శిలోని కొవిడ్‌ కేర్‌ కేంద్రానికి తరలిస్తున్నారు. గంగదొనకొండ గ్రామం నుంచి మంగళవారం కొవిడ్‌ సోకిన వారిని దర్శికి తరలించారు. 

కొవిడ్‌ మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. కురిచేడులో ఇద్దరు, గంగదొనకొండలో ఒకరు, ఆవులమందలో ఒకరు మృత్యువాత పడ్డారు. వ్యాధి సోకిన వారు భయపడకుండా వెంటనే కురిచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి సరైన వైద్యం పొందాలని వైద్యాధికారి ప్రవీణ్‌ సూచిస్తున్నారు. నిత్యం కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నామన్నారు. వ్యాక్సిన్‌ కూడా అందుబాటులో ఉన్నదని ఆయన తెలిపారు.  

సింగరాయకొండలో 39 కేసులు నమోదు

సింగరాయకొండ : మండలంలో కరోనా కేసుల ఉధృతి రోజురోజుకి అధికమవుతుంది. సోమవారం ఒక్కరోజే 39 కేసులు నమోదయ్యాయి. నేటి నుండి మధ్యాహ్నం 12 నుండి ఉదయం 6 గంటల వరకు పూర్తిగా కర్ఫ్యూ కొససాగుతుందని మండల టాస్క్‌ఫోర్స్‌ కమిటీ తెలిపారు. ఉదమం 6 నుండి 12 గంటల వరకే నిత్యావసరాలు, వ్యాపారాలకు  కర్ఫ్యూ నుండి సండలింపు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 నుండి ప్రజా రావాణా వాహనాలు పూర్తిగా నిలిపివేయబడతాయని తెలిపారు. మండలంలో కేసులు ఉధృతి అధికంగా ఉన్న తరుణంలో ప్రజలందరూ ప్రభుత్వం విధించిన ఆంక్షలను పాటిస్తూ కొవిడ్‌ కట్టడికి సహకరించాలని కోరారు.

కామేపల్లి పీహెచ్‌సీ పరిధిలో సోమవారానికి 48 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని పీహెచ్‌సీ వైద్యాధికారి సరస్వతి తెలిపారు. వీరిలో ఇద్దరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండటంతో ఒంగోలు రిమ్స్‌కు పంపామన్నారు. మిగతావారు ఇంటివద్దనే క్వారంటైన్‌లో ఉంటూ వైద్య సేవలు పొందుతున్నారన్నారు. కామేపల్లి, పచ్చవ గ్రామాల్లో అధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో రెండు గ్రామాల్లో కరోనా పాజిటివ్‌ రోగులతో కాంటాక్ట్‌ అయిన వారికి రెండు వందల మందికి కరోనా పరీక్షలు చేసి నిర్ధారణకు పంపామన్నారు. అదేవిధంగా ప్రస్తుతం వ్యాక్సిన్‌ లేనందున వ్యాక్సినేషన్‌ ఆగిందని వైద్యాధికారి వివరించారు. 

కరోనా మరణంతో స్వచ్చంద లాక్‌డౌన్‌ 

కొండపి, మే 4: మండలంలోని కె. ఉప్పలపాడు గ్రామంలో సోమవారం కరోనాతో ఓ నడివయస్కుడు మరణించాడు. దీంతో గ్రామంలో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా మూడు రోజులుగా ఉపాధి హామీ పనిని కూడా నిలుపుదల చేశారు. గ్రామంలో కరోనా మరణంతోపాటు మరో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో గ్రామస్తులు స్వచ్చంధ లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. గ్రామంలో దుకాణాలు మూసివేశారు. పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలో శానిటేషన్‌ కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలోని అన్ని వీధుల్లో బ్లీచింగ్‌ చల్లారు. వైద్య సిబ్బంది, గ్రామ వాలంటీర్లు గ్రామంలో పాజిటివ్‌గా నమోదైన వారిని పర్యవేక్షిస్తున్నారు. హెల్త్‌ సిబ్బంది గ్రామంలో తిరిగి అనుమానితులను పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు ఆగడంతో నిర్ధారిత ప్రైవేటు వైద్యశాలల్లో పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. కరోనా పెరిగిన నేపథ్యంలో గ్రామంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులకు ప్రవేశం నిషేధించామని, కరోనా జాగ్రత్తలతో స్వామి వారికి నైవేద్య, పూజా కార్యక్రమాలు ఏకాంతంగానే నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకుడు సోమరాజుపల్లి రాఘవేంద్రశర్మ తెలిపారు. 

హోం ఐసోలేషన్ల ఏర్పాట్లు

కొండపి,మే 4: ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స మండల ఏపీవో వాసంతికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.  కాగా కార్యాలయంలో మరికొందరు కరోనా అనుమానిత లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారని తెలిసింది.  

కామేపల్లిలో పారిశుధ్య కార్యక్రమాలు 

జరుగుమల్లి,మే 4: కరోనా పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదైన నేపథ్యంలో కామేపల్లిలో పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరం చేశారు. సోమ, మంగళవారాలు పారిశుధ్య కార్మికులతో గ్రామంలోని అన్ని వీధుల్లో బ్లీచింగ్‌ పిచికారి చేయించారు. అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాల్లో బ్లీచింగ్‌ పిచికారి చేయడంతోపాటు, శానిటేషన్‌ కార్యక్రమాలు అధికారులు ముమ్మరం చేశారు. 

సీఎస్‌పురం, మే 4 : మండలంలో మంగళవారం మరో 13మందికి  పాజిటివ్‌ నిర్థారణ అయినట్లు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు రాజేష్‌ తెలిపారు. అరివేములలో 4, అంబవరం కొత్తపల్లిలో 3, నల్లమడుగులలో 2, కోవిలంపాడులో 1, పెదగోగులపల్లిలో 3 కేసులు నమోదయినట్లు ఆయన చెప్పారు. 

సీఎస్‌పురం, మే 4 : కరోనా పాజిటివ్‌  అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల పట్ల అప్రమత్తంగా ఉండాలని మండలంలోని కోవిలంపాడు సర్పంచ్‌ షేక్‌ ఖాదర్‌భీ బుజ్జి, పంచాయితీ కార్యదర్శి జి.వి.అరవిందా తెలిపారు. సచివాలయ సిబ్బందితో కలిసి పంచాయితీలో మంగళవారం కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో పోలయ్య, మహిళా పోలీసులు పాల్గొన్నారు. 

సీఎస్‌పురం, : కరోనా ఉధృతి అధికంగా ఉన్న నేపథ్యంలో బుధవారం నుంచి ఉదయం 6 నుంచి మధ్నాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతిస్తామని ఇన్‌చార్జి తహసీల్దార్‌ జి.ఆంజనేయులు చెప్పారు. అలాగే రోజంతా 144 సెక్షన్‌ కూడా అమలులో ఉంటుందన్నారు. ప్రజలు గమనించి కరోనా నిబంధనలు పాటించి వైరస్‌ నియంత్రణకు సహకరించాలని కోరారు.  

తాళ్లూరు, మే 4 : కరోనా సెకండ్‌ వేవ్‌ కట్టడికి రెండు వారాలపాటు కట్టుదిట్ట చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్‌ పాలపర్తి బ్రహ్మయ్య చెప్పారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం మండల టాస్క్‌ఫోర్సు అధికారుల బృందం సమావేశం జరిగింది.  వైద్యాధికారి షేక్‌ ఖాదర్‌ మస్తాన్‌బీ, ఎంపీడీవో కేవీ కోటేశ్వరరావు, ఎంఈవో జి.సుబ్బయ్య పాల్గొన్నారు.

గుడ్లూరు :  గుడ్లూరులోని తూర్పువడ్డిపాలెంలో కరోనా కేసు నమోదు కావడంతో మరికొందరి ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేకపోవడంతో ఆ ప్రాంతాన్ని అధికారులు కంటోన్మెంట్‌ జోన్‌గా మంగళవారం ప్రకటించారు. ఆ ప్రాంతంలోకి ఎవరూ ప్రవేశించరాదని బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనూషాతో పాటు వీఆర్‌వో హరిబాబు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. 

లింగసముద్రం : మండలంలో మరో 20 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మంగళవారం స్థానిక పీహెచ్‌సీలో వైద్యాధికారి రమేష్‌ ఆధ్వర్యంలో పలు గ్రామాలకు చెందిన పలువురు అనుమానితులకు ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించారు. 

Updated Date - 2021-05-05T06:52:55+05:30 IST